భారత నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా రద్దీ రోడ్లపై మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న కార్లు నడపడం చాలా మందికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు ఆటోమేటిక్ కార్లు ఖరీదైనవిగా ఉండేవి. కానీ ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా పలు కంపెనీలు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను అందిస్తున్నాయి. వాటిలో టాప్ 5 మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ విభాగంలో అత్యంత సరసమైన కారుగా మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో కొనసాగుతోంది. ధర రూ.4.75 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ మోడల్ లో AMT గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మంచి మైలేజ్ కారణంగా ఇది మొదటిసారి కారు కొనేవారిని ఆకర్షిస్తోంది. అయితే, భద్రతా ఫీచర్ల పరంగా అంతగా లేవు.
రెండో స్థానంలో మారుతి ఆల్టో K10 ఉంది. రూ.4.95 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ కారు నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. AMT వెర్షన్ ట్రాఫిక్ లో డ్రైవింగ్‌ను చాలా సులభతరం చేస్తుంది. క్రీప్ ఫంక్షన్ లాంటి సదుపాయాలు రద్దీ రోడ్లలో ఉపయోగపడతాయి.
మూడో స్థానంలో రెనాల్ట్ క్విడ్ ఉంది. రూ.5 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ హ్యా చ్‌బ్యాక్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. AMT గేర్ బాక్స్ తో కలిపి సాఫీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. నగర వినియోగానికి ఇది మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.
మారుతి సెలెరియో కూడా బడ్జెట్ ఆటోమేటిక్ కార్ల జాబితాలో ప్రముఖంగా నిలుస్తోంది. 2014లో దేశంలో AMT టెక్నాలజీని విస్తృతంగా పరిచయం చేసిన మోడళ్లలో సెలెరియో ఒకటి. గేర్ మార్పులు ఈజీగా ఉండటం, తక్కువ ఖర్చుతో ఆటోమేటిక్ సౌకర్యం అందించడం దీని ప్లస్ పాయింట్స్.
మారుతి వాగన్ ఆర్ కూడా ఈ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించింది. 1.0 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న ఈ కారు విశాలమైన క్యాబిన్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో కుటుంబాలకు అనువైన ఎంపికగా ఉంది. AMT గేర్ బాక్స్ నగర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.
ఇవే కాకుండా టాటా టియాగో, మారుతి డిజైర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, రెనాల్ట్ ట్రైబర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లు కూడా సరసమైన ధరల్లో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో లభిస్తున్నాయి. కొన్ని మోడళ్లలో AMT ఉండగా, మరికొన్నింటిలో CVT లాంటి అధునాతన గేర్ బాక్స్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య బడ్జెట్ లోనే పలు ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. సౌకర్యవంతమైన డ్రైవింగ్ తో పాటు తక్కువ నిర్వహణ ఖర్చులు కోరుకునే వారికి ఇవి మంచి ఆప్షన్ గా కొనసాగుతున్నాయి.
Read Also: కారు కొనాలనుకుంటున్నారా? జూన్ 2026లో రానున్న బెస్ట్ మోడల్స్ ఇవే!