Bajaj Pulsar N250SS Launched: ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ బజాజ్ ఆటో తన పల్సర్ లైనప్ లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. బజాజ్ పల్సర్ N250SS పేరుతో వచ్చిన ఈ కొత్త వేరియంట్ లో ఇంజిన్, గేర్ బాక్స్, టెక్నాలజీ పరంగా పలు మార్పులు చేసింది. స్టాండర్డ్ N250తో పోలిస్తే మరిన్ని ఫీచర్లు కోరుకునే రైడర్లను టార్గెట్ చేసుకుని ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.1.59 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
బజాజ్ పల్సర్ N250SSలో 249cc ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇందులో కొత్త ఫోర్ వాల్వ్ హెడ్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 25hp పవర్, 22Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ పల్సర్ N250లో 24.5hp పవర్, 21.5Nm టార్క్ మాత్రమే లభిస్తుంది. దీంతో కొత్త వేరియంట్ లో కాస్త పవర్, టార్క్ పెరిగాయి.
ఈ బైక్‌లో మరో ముఖ్యమైన మార్పు గేర్ బాక్స్. స్టాండర్డ్ మోడల్ లో ఉన్న 5 స్పీడ్ గేర్‌బాక్స్ స్థానంలో కొత్తగా 6-స్పీడ్ గేర్‌బాక్స్ ను అందించారు. దీనికి అదనంగా క్విక్ షిఫ్టర్‌ను కూడా స్టాండర్డ్ ఫీచర్ గా ఇచ్చారు. దీని ద్వారా క్లచ్ ను ఉపయోగించకుండా గేర్లు మార్చుకోవచ్చు. ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీని కూడా అందించారు. ఇది రైడింగ్ మోడ్ లకు సపోర్టు ఇస్తుంది. దీంతో రైడర్లు తమ అవసరాలకు అనుగుణంగా బైక్ పనితీరును ఎంచుకునే అవకాశం ఉంటుంది.
టెక్నాలజీ పరంగా కూడా N250SSలో మార్పులు చేశారు. స్టాండర్డ్ మోడల్‌లోని LCD డిస్‌ప్లే స్థానంలో కొత్త 5 అంగుళాల TFT కన్సోల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ సదుపాయం ఉంది. ప్రయాణ సమయంలో నావిగేషన్ వివరాలను చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, అడ్జస్టబుల్ లివర్లు, USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్, పానిక్ బ్రేక్ అలర్ట్, హజార్డ్ స్విచ్ ఉన్నాయి. ఈ ఫీచర్లు రైడింగ్ సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరచడంలో సాయపడుతాయి.
బజాజ్ పల్సర్ N250SS ధర రూ.1.59 లక్షలుగా ఉంది. ఇది స్టాండర్డ్ పల్సర్ N250 కంటే రూ.14,000 ఎక్కువ. అయితే, అదనపు టెక్నాలజీ, కొత్త గేర్‌బాక్స్, క్విక్ షిఫ్టర్ లాంటి ఫీచర్లను ఇందులో అందించారు.
ధర పరంగా చూస్తే ఈ బైక్‌కు మార్కెట్లో పోటీ ఉంది. సుజుకి గిక్సర్ 250 ధర రూ.1.85 లక్షలుగా ఉండగా, హీరో ఎక్స్‌ట్రీమ్ 250R కార్బన్ ధర రూ.1.98 లక్షలుగా ఉంది. ఈ ధరలతో పోలిస్తే పల్సర్ N250SS తక్కువ ధరకు లభిస్తోంది. రూ.1.59 లక్షల ధరలో స్పోర్టీ బైక్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి ఇదో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? బ్యాటరీ గురించి ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!