September 2026 Bike Sales Report: దేశంలో బైక్‌లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కొందరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను ఎంచుకుంటే, మరికొందరు స్టైలిష్ లుక్, పవర్, సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ప్రతి నెలా బైక్‌ల అమ్మకాల లెక్కలపై ఆసక్తి నెలకొంటుంది. సెప్టెంబర్ 2026లో అత్యధికంగా అమ్ముడైన మోటార్ సైకిళ్ల జాబితాలో హీరో స్ప్లెండర్ మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. హోండా షైన్, బజాజ్ పల్సర్ లాంటి మోడళ్లు కూడా టాప్ స్థానాల్లో నిలిచాయి.
సెప్టెంబర్ 2026లో హీరో స్ప్లెండర్ ఏకంగా 4,31,279 యూనిట్లు అమ్ముడై మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది 12.49 శాతం వృద్ధి సాధించింది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, రోజువారీ ప్రయాణానికి కంఫర్ట్, మంచి మైలేజ్ లాంటి అంశాలు ఈ బైక్‌కు మంచి ఆదరణ కల్పిస్తున్నాయి.
అటు రెండో స్థానంలో హోండా షైన్ నిలిచింది. ఈ బైక్ సెప్టెంబర్‌లో 1,89,941 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 2.64 శాతం పెరిగాయి. మూడో స్థానంలో ఉన్న బజాజ్ పల్సర్ 1,36,313 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 12.51 శాతం తగ్గాయి.
టాప్ బైక్‌ల జాబితాలో హీరో HF Deluxe నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మోడల్ 1,14,064 యూనిట్లు అమ్ముడైంది. ఐదో స్థానంలో ఉన్న టీవీస్ అపాచీ 61,148 యూనిట్ల అమ్మకాలతో గత ఏడాదితో పోలిస్తే 14.67 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక ప్రీమియం బైక్‌ల విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 కూడా సత్తా చాటింది. సెప్టెంబర్‌లో ఈ బైక్ 47,286 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 16.90 శాతం పెరిగాయి. అదే సమయంలో హోండా CB Unicorn అమ్మకాలు 43.59 శాతం పెరిగి 46,468 యూనిట్లకు చేరుకున్నాయి. టాప్ 10 లిస్టులో అత్యధిక శాతం వృద్ధి సాధించిన మోడల్‌గా నిలిచింది.
కొత్త బైక్ కొనేటప్పుడు అమ్మకాల సంఖ్యను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదు. మీ రోజువారీ ప్రయాణ దూరం, మైలేజ్, ఎక్స్‌షోరూమ్ ధర, సర్వీసింగ్ ఖర్చులు, స్పేర్ పార్ట్స్ లభ్యత లాంటి అంశాలను పరిశీలించాలి. సిటీలో రోజువారీ ప్రయాణానికి ఒక మోడల్ అనుకూలంగా ఉంటే, ఎక్కువ దూరాలు ప్రయాణించేవారికి మరో మోడల్ సరిపోవచ్చు.
ఓవరాల్ గా చూస్తే హీరో స్ప్లెండర్ అమ్మకాలలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. హోండా షైన్, బజాజ్ పల్సర్, లాంటి బైక్‌లు కూడా టాప్ స్థానాల్లో ఉండగా, టీవీస్ అపాచీ, రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా యూనికార్న్ మోడళ్లకు కూడా మంచి ఆదరణ కనిపిస్తోంది. రాబోయే నెలల్లో ఈ ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం..
Read Also: టీవీఎస్ To బజాజ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ ఎవరంటే?