రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? అంటే, ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు. ఎక్కువగా డ్రైవర్ల నిర్లక్ష్యంగానే ప్రమాదాలు జరుగుతాయని చెప్తారు. కానీ, ఆటో నిపుణులు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వెహికల్ కలర్ కూడా ప్రమాదాలకు కారణం అవుతుందంటున్నారు. నలుపు, ముదురు రంగు వెహికల్స్ ఎక్కువగా ప్రమాదాలకు గురవుతాయంటున్నారు. ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వెహికల్ కలర్ ప్రమాదాలకు నేరుగా కారణం కాదు. ఎక్కువ ప్రమాదాలు డ్రైవర్ తప్పిదాలు, వేగం, నిర్లక్ష్యం, రూల్స్ పాటించకపోవడం వల్లే జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో వాహనం రంగు ప్రభావం చూపే అవకాశం ఉంది. వైట్, యెల్లో, రెడ్ కార్లు రోడ్డు మీద ఈజీగా కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళ, వానలు పడే సమయంలో, మబ్బులు కమ్ముకున్నప్పుడు కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సో, ఈ కలర్ కార్లు ఇతర వాహనాల డ్రైవర్లు త్వరగా గమనించే అవకాశం ఉంటుంది. అటు నలుపు, గోధుమ, డార్క్ బ్లూ లాంటి ముదురు రంగులు రాత్రిపూట, తక్కువ లైట్ ఉన్న సమయంలో సరిగ్గా కనిపించవు. దీంతో కొన్ని సందర్భాల్లో ప్రమాద అవకాశాలు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది.
మంచు, పొగమంచు, వర్షం లాంటి పరిస్థితుల్లో లైట్ కలర్స్ ఉన్న వాహనాలు కొంచెం స్పష్టంగా కనిపిస్తాయి. డార్క్ కలర్స్ ఉన్న కార్లు, బ్యాక్ గ్రౌండ్ లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి.
కొన్ని పరిశోధనల ప్రకారం లైట్ కలర్స్ ఉన్న వెహికల్స్ ను డ్రైవ్ చేసే వారు కొంచెం జాగ్రత్తగా నడిపిస్తారట. అయితే, ఈ ఫార్ములా అందిరికీ వర్తించదు. డ్రైవింగ్ స్టైల్ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. దీని ప్రభావం తాత్కాలికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
వెహికల్ కలర్ కంటే కంటే, ఎలా డ్రైవ్ చేస్తున్నారనేది చాలా ముఖ్యమైన అంశం. స్పీడ్ కంట్రోల్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, సీట్ బెల్ట్ ధరించడం, అలర్ట్ గా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. సేఫ్టీకి సంబంధించిన సూచనలు పాటించాలి. ముఖ్యంగా రాత్రి పూట డ్రైవింగ్ సమయంలో హెడ్ లైట్లు సరిగా వాడాలి. వర్షంలో స్లోగా డ్రైవ్ చేయాలి. వెహికల్ కి రిఫ్లెక్టర్లు, సరైన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇవి రంగు కంటే ఎక్కువగా వాహనం సురక్షితంగా ఉండేలా కాపాడుతాయి. వెహికల్ కలర్ అనేది ప్రమాదాలకు మెయిన్ కారణం కాదు. అయితే, విజిబిలిటీ పరంగా కొంత ప్రభావం ఉండవచ్చు. కాబట్టి, రంగు కంటే సేఫ్ డ్రైవింగ్ కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇదే కారులోని వారికి సరైన రక్షణ ఇస్తుంది.