New Bajaj Off-Road Bike Leaked: బజాజ్ బైక్స్ సెగ్మెంట్ లోకి మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ బైక్ ప్రత్యేకంగా హీరో ఎక్స్ పల్స్ 200కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ ను బజాజ్ మెయిన్ బ్రాండ్ కాకుండా కొత్త సబ్ బ్రాండ్ కింద విడుదల కావచ్చని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం బజాజ్ పోర్ట్ ఫోలియోలో KTM, ట్రయంఫ్ లాంటి బ్రాండ్ల ద్వారా పలు అడ్వెంచర్ బైక్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, స్వంతంగా పవర్ ఫుల్ డ్యూయల్ స్పోర్ట్, ఆఫ్ రోడ్ మోడల్ అందుబాటులో లేదు. ఈ లోటును పూడ్చేందుకు కంపెనీ ఒక కొత్త ప్రాజెక్ట్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో బయటకు వచ్చిన స్పై వీడియోలో, పూర్తిగా కవర్ చేసిన టెస్ట్ బైక్ పల్సర్ N250తో పాటు పరీక్షించబడుతున్నట్లు కనిపించింది. దీన్ని చూస్తే ఇది కొత్త ఆఫ్ రోడ్, డ్యూయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్ లా కనిపిస్తోంది.
ఈ బైక్‌లో వైర్ స్పోక్ వీల్స్ ఉండే అవకాశం ఉంది. ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల సెటప్ కనిపిస్తోంది. ఇది సాధారణంగా ఆఫ్ రోడ్, ర్యాలీ బైక్ లలో కనిపించే కాన్ఫిగరేషన్. టైర్లు కూడా సన్నగా ఉండి, తేలికపాటి ఆఫ్ రోడ్ వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. సస్పెన్షన్ లో ముందు USD ఫోర్క్స్, వెనుక మోనోషాక్ ఉండే అవకాశం ఉంది. బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేకులు కనిపిస్తున్నాయి. స్టైలింగ్ పరంగా ఇది పూర్తిగా అడ్వెంచర్ బైక్ కంటే డ్యూయల్ స్పోర్ట్ కేటగిరీకి దగ్గరగా ఉంటుంది. ర్యాలీ స్టైల్ సింగిల్ పీస్ సీటు, పైకి ఎత్తిన ఎగ్జాస్ట్ లాంటిఅంశాలు ఈ బైక్ ను మరింత రగ్గడ్ గా చూపిస్తున్నాయి. గతంలో వచ్చిన హీరో ఇంపల్స్ తరహా డిజైన్ ను ఈ బైక్ గుర్తు చేస్తోంది.
ఈ బైక్ ఇంజిన్ వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. అయితే, ఇది 300cc లోపు సెగ్మెంట్ లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బజాజ్ దగ్గర ఇప్పటికే 150cc నుంచి 250cc వరకు ఉన్న ఇంజిన్‌ల శ్రేణి ఉంది. వాటిలో ఏదో ఒకటి లేదంటే కొత్తగా ట్యూన్ చేసిన ఇంజిన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. లిక్విడ్ కూలింగ్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఖర్చు తగ్గించేందుకు ఎయిర్, ఆయిల్ కూల్డ్ సెటప్ ఉండొచ్చని భావిస్తున్నారు. గేర్‌బాక్స్ 5-స్పీడ్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ బైక్‌ను సరసమైన ధరలో అందించాలనే ఉద్దేశంతోనే సింపుల్ మెకానికల్ సెటప్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే TFT డిస్ ప్లే, LED లైటింగ్ లాంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
ధర పరంగా చూస్తే, ఇది హీరో ఎక్స్ పల్స్ 200 4Vకి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. అంటే సుమారు రూ. 2 లక్షల లోపు రేంజ్‌లో మార్కెట్ లోకి రావచ్చు. మొత్తం మీద, బజాజ్ ఈ కొత్త బైక్ తో అడ్వెంచర్, డ్యూయల్ స్పోర్ట్ సెగ్మెంట్ లో బలమైన ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
Read Also: ఇక యాక్సిడెంట్లకు చెక్.. రూ. 15 లక్షల లోపు ADAS కార్లు వచ్చేశాయి!