Telangana Formation: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తూ, ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో పోరాట యోధులుగా నిలిచారు. వారి త్యాగాలకు, తెగువకు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కోటి రతనాల వీణ.. నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ, రేపటి భవిష్యత్ కు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 అని అన్నారు. మనం కలలు కన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్, నాటి యు.పి.ఏ ఛైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: కేంద్ర మంత్రి బండి సంజయ్ కోసం ఊహించని యాత్ర!
పుట్టుక నీది.. చావు నీది, బతుకంతా దేశానిది” అన్న ప్రజా కవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023 న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతిక్షణం తెలంగాణ హితమే పరమార్ధంగా, రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా, పేదరికం నిర్మూలనే ప్రాధాన్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు, ఈ రెండున్నరేళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరువలేనిది. ఎవరెన్ని విమర్శలు, కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలవడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచిందన్నారు.
నాటి రాచరికం నుంచి నిన్నటి నియంతృత్వం వరకు తెలంగాణ తిరుగుబాటు చరిత్ర మొత్తం చెబుతున్న సత్యం ఇదే. ఆ చరిత్రకు మనం సాక్షులం. రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి కొత్త చరిత్రను రాసుకోవడం కోసం మీరు ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఈ రోజు ప్రజల మనోభావాలకు మేం ప్రతినిధులం. సమాజ ఆకాంక్షలకు మేం వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేం అధికారం.. అని సంభోదించడం లేదు. మమ్మల్ని మేం పాలకులుగా అనుకోవడం లేదు. మీకు సేవకులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో పెత్తనం కాదు. నాలుగు కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి.. అని మేం భావిస్తున్నాం.. బాధ్యతగా పని చేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు.. ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నాంమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దేశంలోనే కాదు. ప్రపంచానికే తెలంగాణను గేట్‌వే గా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ – 2047 డాక్యుమెంట్. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వ సంకల్పం. దానికి ప్రజల అండదండలు కావాలి. మీ అందరి సహకారం. ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు ఉందని సీఎం అన్నారు. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలంగటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.
Also read: Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!