Honda Airblade Patent Filed in India: భారతీయ టూ వీలర్ మార్కెట్లో స్పోర్టీ స్కూటర్లకు డిమాండ్ నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా 150cc నుంచి 160cc సెగ్మెంట్ లో యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హోండా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతున్న ఎయిర్ బ్లేడ్ స్కూటర్ డిజైన్ కు భారత్ లో పేటెంట్ పొందడం ఆసక్తి కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ విదేశీ మార్కెట్లలో 125cc, 160cc ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
హోండా ఎయిర్ బ్లేడ్ డిజైన్ సాధారణ ఫ్యామిలీ స్కూటర్ తో పోల్చితే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆకట్టుకునే LED హెడ్ లైట్ డిజైన్, ముందు భాగంలో స్పోర్టీ స్టైలింగ్, మధ్యలో ఉండే స్పైన్ డిజైన్, ఆకట్టుకునే బాడీ ప్యానెల్స్ ఈ స్కూటర్ కు మంచి లుక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేసి దీనిని డిజైన్ చేసినట్లు అర్థం అవుతోంది. హోండా భారత్ లో పేటెంట్ పొందిందంటే, తప్పనిసరిగా ఈ స్కూటర్ ను త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా హోండా తన ఇంటర్నేషనల్ మోడళ్లకు సంబంధించిన కొన్ని డిజైన్ పేటెంట్లను ఇండియాలో తీసుకుంది. కానీ, వాటిలో చాలా మోడళ్లు భారత మార్కెట్లోకి రాలేదు. సో, ఎయిర్ బ్లేడ్ విషయంలో కూడా కంపెనీ అధికారిక ప్రకటన చేసే వరకు వెయిట్ చేయకతప్పదు.
ఇక తాజాగా పేటెంట్ 125cc వెర్షన్ కా? లేక 160cc వెర్షన్ కా? అనేది కూడా క్లారిటీ లేదు. భారత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో హోండా ఎయిర్ బ్లేడ్ 160 వెర్షన్ లో తీసుకురావడమే బెస్ట్ ఆప్షన్ గా ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో స్పోర్టీ మాక్సీ స్టైల్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160 లాంటి మోడళ్లు ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. హోండా కూడా ఈ విభాగంలో అడుగుపెడితే పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎయిర్‌బ్లేడ్ 160లో 157cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ సుమారు 14.7 bhp పవర్, 14.8 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ కెర్బ్ బరువు కేవలం 113 కిలోలు ఉంటుంది. హీరో జూమ్ 160 కంటే దాదాపు 29 కిలోలు తక్కువగా ఉండగా, యమహా ఏరాక్స్ 155 కంటే సుమారు 13 కిలోలు తక్కువ బరువుతో ఉంటుంది. తక్కువ బరువు కారణంగా రైడింగ్ మరింత ఈజీగా ఉండనుంది.
ఫీచర్ల పరంగా కూడా హోండా మంచి ప్యాకేజీని అందిస్తోంది. LED లైటింగ్ సిస్టమ్, డిజిటల్ LCD ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్ కీ టెక్నాలజీ లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం సింగిల్ ఛానల్ ABSను కూడా అందిస్తోంది. ఇవన్నీ కలిపి చూస్తే ఈ స్కూటర్ ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశముంది.
Read Also: ఏథర్ To ఓలా.. స్మార్ట్ ఫీచర్లతో అదిరిపోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!