LFP vs NMC Battery: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, ఇంధన పొదుపు, పర్యావరణ మేలు లాంటి కారణాలతో చాలామంది EVలను తీసుకుంటున్నారు. అయితే, అప్పుడప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లలో మంటలు రావడం చూస్తున్నాం. పలువురు కొనుగోలుదారులు కూడా ఈవీలు సేఫేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, ప్రతి EV ప్రమాదకరం కాదు. బ్యాటరీ మోడల్, భద్రతా వ్యవస్థలు, నాణ్యత లాంటి అంశాలు ఫైర్ యాక్సిడెంట్ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఏ బ్యాటరీ సేఫ్ అనేది ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల్లో రెండు రకాలు ఉన్నాయి. అవి లిథియం ఐరన్ ఫాస్పేట్(LFP), నికెల్ మాంగనీస్ కోబాల్ట్(NMC). LFP బ్యాటరీలు భద్రత పరంగా అత్యంత మెరుగైనవిగా భావిస్తారు. ఇవి హైటెంపరేచర్ ను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఎక్కువ వేడి వచ్చినా మంటలు అంటుకునే అవకాశం చాలా తక్కువ. అందుకే మన దేశంలో వేడి వాతావరణంలో ఈ బ్యాటరీలు మంచి ఎంపికగా చెబుతున్నారు. NMC బ్యాటరీలు తక్కువ బరువుతో ఎక్కువ శక్తిని నిల్వ చేస్తాయి. దీంతో కారు ఎక్కువ రేంజ్ ఇస్తుంది. కానీ, ఇవి అధిక వేడికి త్వరగా రియాక్ట్ అవుతాయి. ఒక సెల్ దెబ్బతింటే మిగతా సెల్స్ కు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే వీటిలో మంచి కూలింగ్ వ్యవస్థ ఉండటం చాలా అవసరం.
షోరూమ్‌కు వెళ్లినప్పుడు కేవలం డిజైన్, టచ్‌స్క్రీన్ లేదా ఫీచర్లను మాత్రమే చూడకుండా బ్యాటరీ వివరాలను కూడా తెలుసుకోవాలి. మొదటగా, ఆ వాహనంలో LFP బ్యాటరీ ఉందా? NMC బ్యాటరీ ఉందా? అని అడగాలి. భద్రతకు ప్రాధాన్యం ఇస్తే LFP బ్యాటరీ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మంచిది. రెండో విషయం బ్యాటరీ కూలింగ్ సిస్టమ్. కొన్ని EVల్లో గాలి ద్వారా చల్లబరిచే వ్యవస్థ ఉంటుంది. మరికొన్నింటిలో లిక్విడ్ కూలింగ్ ఉంటుంది. లిక్విడ్ కూలింగ్ ఉన్న బ్యాటరీలు వేడిని త్వరగా నియంత్రిస్తాయి. దీంతో బ్యాటరీ ఎక్కువకాలం పనిచేయడమే కాకుండా ప్రమాదాల అవకాశాలు కూడా తగ్గుతాయి. అలాగే వాహనం AIS-156 ఫేజ్ 2 భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవాలి.
చాలామందికి ఉండే అనుమానాల్లో ఇది అత్యంత కీలకమైనది. భారీ వర్షాల్లో నీరు బ్యాటరీలోకి వెళ్లి ప్రమాదం జరుగుతుందా? అని ఆలోచిస్తుంటారు. అయితే మంచి నాణ్యత కలిగిన EVల్లో ఈ సమస్య ఉండదు. బ్యాటరీకి IP67, IP68 రేటింగ్ ఉంటే నీరు, దుమ్ము లోపలికి చేరకుండా ప్రత్యేక రక్షణ ఉంటుంది. అలాంటి బ్యాటరీలు ఒక మీటర్ వరకు నీటిలో కొంతసేపు ఉన్నా కూడా సురక్షితంగానే పనిచేసేలా రూపొందిస్తారు. అందుకే కొత్త EV కొనేటప్పుడు ఈ IP రేటింగ్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
Read Also: వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!