Maruti’s Cheapest 7-Seater Car: భారత కార్ల మార్కెట్లో తక్కువ ధరలో, మంచి మైలేజ్ తో, నమ్మకమైన కార్లను అందించే బ్రాండ్ గా మారుతి సుజుకికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆల్టో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనో లాంటి మోడళ్లతో అన్ని సెగ్మెంట్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అయితే, ఇప్పటి వరకు 4 మీటర్ల లోపు ఉండే బడ్జెట్ 7 సీటర్ కారును మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం ఆ విభాగంలో రెనాల్ట్ ట్రైబర్ లాంటి మోడళ్లు మాత్రమే ఉన్నాయి. అయితే, త్వరలో ఈ లోటును భర్తీ చేసేలా మారుతి కొత్త 7 సీటర్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త మోడల్ కు మారుతి సోలియో అనే పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని విదేశీ మార్కెట్లలో 5 సీటర్ గా అందుబాటులో ఉన్న సోలియోను, భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా 7 సీటర్ వెర్షన్ గా తీసుకురావచ్చని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ధర కూడా చాలా పోటీగా ఉండే అవకాశం ఉండటంతో ఇది దేశంలోనే అత్యంత చౌకైన 7 సీటర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సోలియోకు బాక్సీ టాల్ బాయ్ స్టైల్ ఉంటుంది. వ్యాగన్ ఆర్ తరహాలో ఎత్తుగా ఉండే బాడీ కారణంగా లోపల ప్రయాణికులకు ఎక్కువ హెడ్ రూమ్, లెగ్ రూమ్ లభించే అవకాశం ఉంది. ముందు భాగంలో పెద్ద క్రోమ్ గ్రిల్, లేటెస్ట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఆకర్షణీయమైన బంపర్ డిజైన్ కారుకు ప్రీమియం లుక్ ను ఇస్తాయి. పక్కవైపు పెద్ద గ్లాస్ ఏరియా, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ కనిపించే అవకాశం ఉంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, వాటిని కలిపే క్రోమ్ స్ట్రిప్, రూఫ్ స్పాయిలర్ మరింత ఆకట్టుకునేలా చేస్తాయి.
ఇంటీరియర్ కూడా సాధారణ మారుతి కార్ల కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉంది. డ్యాష్ బోర్డ్ మధ్యలో ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ క్యాబిన్, నాణ్యమైన ఫ్యాబ్రిక్ సీట్లు, మంచి స్టోరేజ్ స్పేస్ ఉండనుంది. కుటుంబ ప్రయాణాలకు అనువుగా క్యాబిన్‌ను రూపొందించే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ లో 7 అంగుళాల టచ్ స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి. భారత మార్కెట్ కోసం విడుదలయ్యే వెర్షన్ లో 9 అంగుళాల టచ్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ లాంటి అదనపు ఫీచర్లు ఉండనున్నాయి. అటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈఎస్‌సీ, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు బలమైన బాడీ నిర్మాణాన్ని అందించే అవకాశం ఉంది. భారత క్రాష్ టెస్ట్ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను అభివృద్ధి చేసే అవకాశముంది.
ప్రస్తుత సోలియో 660 సీసీ ఇంజిన్ తో లభిస్తోంది. భారత మార్కెట్ కోసం మారుతి ఇప్పటికే ఉపయోగిస్తున్న 1.0 లీటర్ లేదా 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. మెరుగైన మైలేజ్ కోసం కొత్త సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ కారు రూ.6.50 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఈ కొత్త 7 సీటర్‌ను 2027 చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!