New Hyundai Electric SUV India 2026: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హ్యుందాయ్ మరో కొత్త ఎలక్ట్రిక్ SUVను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ కారు రోడ్లపై టెస్టింగ్ దశలో కనిపిస్తోంది. క్రెటా ఎలక్ట్రిక్ కంటే తక్కువ ధరలో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ నుంచి వచ్చే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUVగా నిలిచే అవకాశముంది. ఈ క్రేజీ ఈవీ 2026 చివరి నాటికి లేదంటే 2027 ప్రారంభంలో భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ కొత్త SUVలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. తాజాగా వచ్చిన కియా సైరోస్ EVతో కొన్ని టెక్నికల్ అంశాలను పంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఇందులో 42 kWh, 51.4 kWh సామర్థ్యంతో రెండు బ్యాటరీ ప్యాక్‌లు లభించే అవకాశం ఉంది. చిన్న బ్యాటరీతో సుమారు 440 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వవచ్చని, పెద్ద బ్యాటరీతో 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ నుంచి అధికారిక వివరాలు ఇంకా రావాల్సి ఉంది. పెద్ద బ్యాటరీ ఉన్న వేరియంట్లలో DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశముంది. దీంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకుని ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. దీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
డిజైన్ పరంగా కూడా ఈ SUV కొత్త స్టైల్‌లో ఉండనుంది. ఇప్పటికే విడుదల చేసిన పెట్రోల్ మోడల్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చినట్లుగా కాకుండా, ప్రత్యేకమైన EV డిజైన్‌ను హ్యుందాయ్ అందించనుంది. స్పై ఫొటోలను పరిశీలిస్తే స్ప్లిట్ LED హెడ్ ల్యాంప్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్, రూఫ్ స్పాయిలర్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో ప్రత్యేక LED లైటింగ్ కనిపిస్తోంది. ఈ SUV లేటెస్ట్ లుక్ తో ఆకట్టుకోనుంది.
ఇంటీరియర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ టాప్ వేరియంట్లలో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్ వేర్ అప్ డేట్లు లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా లాంటి సౌకర్యాలు కూడా ఉండనున్నాయి.
టాప్ వేరియంట్లలో లెవెల్-2 ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్యాటరీ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, కనెక్టెడ్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. ఈ కొత్త హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUVకు టాటా నెక్సాన్ EV, టాటా పంచ్ EV, మహీంద్రా XUV 3XO EV, కియా సైరోస్ EV లాంటి మోడళ్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
Read Also: తక్కువ ధరలో బెస్ట్ టాటా కార్లు.. ఈ 3 మోడల్స్ అస్సలు మిస్ కావొద్దు!