MG Windsor EV New Discounts: JSW MG మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా MG విండ్సర్ EV, MG ZS EV మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్స్ ప్రకటించింది. అంతేకాదు, ఏడాది పాటు ఉచిత పబ్లిక్ DC ఛార్జింగ్ సదుపాయం కూడా అందిస్తోంది. ఈ పరిమిత ఆఫర్ మే 20 వరకే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
MG ZS EV కొనుగోలుదారులకు రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. అదే సమయంలో విండ్సర్ EVపై రూ.35 వేల వరకు బెనిఫిట్స్ ఇస్తోంది. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా కంపెనీ ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.
MG విండ్సర్ EV విషయానికి వస్తే, 100 kW సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ఈ మోటార్ 136 PS పవర్, 200 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారుల అవసరాలను బట్టి రెండు బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మొదటి వేరియంట్‌లో 38 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 332 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రో వేరియంట్ లో 52.9 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఈ వెర్షన్ గరిష్టంగా 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. సిటీ ప్రయాణాలు మాత్రమే చేసే వారికి చిన్న బ్యాటరీ సరిపోతుంది. ఎక్కువ దూర ప్రయాణాలు చేసే వారు పెద్ద బ్యాటరీ వేరియంట్ అనుకూలంగా ఉంటుంది.
విండ్సర్ EVలో MG తీసుకొచ్చిన బ్యాటరీ యాస్ ఏ సర్వీస్(BaaS) ఆప్షన్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ విధానంలో వాహనం ప్రారంభ ధరను తగ్గించి అందిస్తున్నారు. BaaS ప్లాన్ తో విండ్సర్ EV ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.3.9 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ మొత్తం పెట్టకుండా EV కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఇక కంపెనీ కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. తొలి యజమానికి లైఫ్ టైమ్ బ్యాటరీ వారంటీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనంగా 3-60 సంవత్సరాల బై బ్యాక్ హామీ కూడా అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా వినియోగదారులు బ్యాటరీ లైఫ్, రీసేల్ వ్యాల్యూ గురించి ఆలోచిస్తారు. వాటిని తగ్గించడానికే ఈ ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
ఇక MG ZS EV 50.3 kWh బ్యాటరీ ప్యాక్ తో అందుబాటులో ఉంది. పూర్తి ఛార్జ్ తో సుమారు 461 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఇది కేవలం 60 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ SUV ధరలు రూ.17.99 లక్షల నుంచి రూ.20.50 లక్షల వరకు ఉన్నాయి.
Read Also: న్యూ లుక్.. సూపర్ మైలేజ్.. మళ్లీ రోడ్కెక్కబోతున్న టాటా సుమో?