Ola Roadster X+ Discount Offer: ఓలా ఎలక్ట్రిక్ మధ్య తరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఉన్న వెహికల్స్ మీద భారీగా తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది. ఓలా రోడ్ స్టర్ X+పై భారీగా ధరను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మోడల్ మీద ఏకంగా రూ. 60,000 వరకు ధరను తగ్గించింది. ఇప్పుడు ఈ మోడల్ మరింత చౌకకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా 9.1 kWh బ్యాటరీతో వచ్చే టాప్ వేరియంట్‌పై ఈ ఆఫర్ ను అందిస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని ప్రకటించింది. ఆసక్తి ఉన్న వాళ్లు త్వరగా కొనుగోలు చేయాలని సూచించింది.
ఇప్పటి వరకు ఓలా రోడ్ స్టర్ X+ బైక్ ధర సుమారు రూ.1.90 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉండేది. తాజా తగ్గింపు తో ఈ ధర రూ. 1.30 లక్షలకు తగ్గింది. ఈ ధర తగ్గింపు వల్ల, హై పర్ఫార్మెన్స్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్ ను కొనాలనుకునే వారికి మరింత సులభం అయ్యింది.
ఓలా ధర తగ్గింపునకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది స్వదేశీ టెక్నాలజీ కారణంగా ఈ ధర తగ్గినట్లు వెల్లడించింది. కంపెనీ అభివృద్ధి చేసిన 4680 భారత్ బ్యాటరీ సెల్స్ వాడటం వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గాయని తెలిపింది. విదేశీ బ్యాటరీలపై ఆధారపడకపోవడం వల్ల, ఈ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించగలుగుతోంది. అంతేకాదు, కంపెనీ తన గిగాఫ్యాక్టరీ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ, భవిష్యత్తులో మరింత ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఓలా రోడ్ స్టర్ X+ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు, గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది సిటీ రైడింగ్ మాత్రమే కాకుండా, లాంగ్ రైడ్స్ కి కూడా అనుకూలంగా ఉంటుంది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో స్కూటర్లు అధికంగా ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ బైక్స్ తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రోడ్ స్టర్ X+ లాంటి మోడళ్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా పనితీరు, రేంజ్ రెండింటినీ కలిపిన బైక్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. అయితే, ఈ ధర తగ్గింపుతో పాటు, కంపెనీ ఒక ప్రత్యేక సేల్స్ విండోను కూడా ప్రకటించింది. మొదటి సేల్ ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగింది. డిమాండ్‌ను బట్టి మరిన్ని సేల్స్ విండోలు కూడా ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: రూట్ మార్చిన ఏథర్.. జస్ట్ లక్షకే ఎలక్ట్రిక్ స్కూటర్!