Retro-Style Electric Scooter: ఒకప్పుడు భారతీయ రోడ్లపై కనిపించిన స్కూటర్లు ఇప్పటికీ చాలామందికి మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. ముఖ్యంగా బజాజ్ చేతక్, LML వెస్పా లాంటి క్లాసిక్ మోడళ్లు ఎన్నో కుటుంబాల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కాలం మారడంతో ఆధునిక స్కూటర్లు కొత్త డిజైన్, టెక్నాలజీతో ముందుకు వచ్చినా, ఆ పాతకాలపు స్టైల్, ఫీలింగ్ మాత్రం కొంతమంది మిస్ అవుతున్నారు.
పాతరోజుల్లో బాగా పాపులర్ అయిన స్కూటర్లను ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చి, మళ్లీ రోడ్లపైకి తీసుకువస్తున్నారు. ఒకప్పుడు ఉపయోగించిన క్లాసిక్ స్కూటర్ డిజైన్ ను అలాగే ఉంచుతూ, లోపల మాత్రం కొత్త ఎలక్ట్రిక్ వ్యవస్థను అమర్చుతున్నారు. దీంతో పాతకాలపు లుక్, కొత్త టెక్నాలజీ కలయిక ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
రెట్రో స్టైల్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుతం సుమారు రూ. 70,000 ధరలో లభిస్తున్నాయి. ఈ ధరలో స్టైలిష్, ఓల్డ్ మెమొరీస్ గుర్తు చేసే వెహికల్ ను పొందడం పట్ల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో కూడా ఇలాంటి స్కూటర్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో రెట్రో డిజైన్ ఉన్న స్కూటర్.. పూర్తిగా ఎలక్ట్రిక్‌గా పని చేస్తూ ఆట్టుకుంటుంది. స్కూటర్‌ను చూడగానే పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి. గుండ్రని మెటల్ బాడీ, సింపుల్ డిజైన్ ఆకట్టుకుంటున్నాయి. పాత ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చడంతో పొగ లేకుండా, శబ్దం రాకుండా నడుస్తుంది. పర్యావరణ అనుకూలంగా ఉండటం వీటి ప్రత్యేకత.
ఈ స్కూటర్‌లో ఆధునిక ఫీచర్లు ఎక్కువగా ఉండవు. డిజిటల్ స్క్రీన్‌లు, స్మార్ట్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉండవు. ఒక సాధారణ అనలాగ్ మీటర్ మాత్రమే ఉంటుంది. ఇది కేవలం వేగం లాంటి అవసరమైన సమాచారాన్ని మాత్రమే చూపిస్తుంది. అంటే, ఈ డిస్ ప్లేను సింపుల్‌గా ఉండేలా రూపొందించారు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ నగర ప్రయాణాలకు సరిపడేలా ఉంటుంది. గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. రోజువారీ ఆఫీస్, చిన్న దూర ప్రయాణాలకు సరిపోతుంది. ఈ స్కూటర్ లో 250W సామర్థ్యం కలిగిన BLDC మోటార్ ఉంటుంది. దీనికి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ జత చేయబడింది. బ్యాటరీ సామర్థ్యం సుమారు 1.5 kWh నుంచి 2.3 kWh వరకు ఉంటుంది. ఛార్జింగ్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
ఇక సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థలు కూడా సాధారణంగానే ఉంటాయి. ముందు, వెనుక భాగాల్లో హైడ్రాలిక్ డాంపర్లతో కూడిన సస్పెన్షన్ ఉంటుంది. బ్రేకింగ్ కోసం డ్రమ్ బ్రేకులు ఉపయోగించారు. గతుకుల రోడ్లపై కూడా సులభంగా నడిచేలా దీన్ని రూపొందించారు.
Read Also: హీరో సూపర్ స్ప్లెండర్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు మర్చిపోకండి!