స్కోడా ఆక్టేవియా RS మరోసారి సత్తా చాటింది. చెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా అందిస్తున్న ఈ పెర్ఫార్మెన్స్ సెడాన్, ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ANCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో కంప్లీట్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను సాధించింది. ప్యాసింజర్స్ ప్రొటెక్షన్, చిల్డ్రెన్ సేఫ్టీ, హైవే వినియోగదారుల రక్షణ, సేఫ్టీ అసిస్ట్ లాంటి విభాగాల్లో మంచి ఫలితాలు సాధించి ఈ గుర్తింపును పొందింది.
స్కోడా గత ఏడాది ఆక్టేవియా RSను భారత మార్కెట్లో పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. కేవలం 100 యూనిట్లను పూర్తిగా నిర్మించిన యూనిట్ల (CBU) రూపంలో అమ్మకానికి తీసుకువచ్చింది. అప్పట్లో ఈ కారుకు రూ.49.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర నిర్ణయించారు. మొదటి బ్యాచ్ కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు రెండో బ్యాచ్ ను కూడా భారత్ కు తీసుకురావాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో క్రాష్ టెస్ట్ నిర్వహించారు.
ANCAP పరీక్షల్లో ఆక్టేవియా RS నాలుగు మెయిన్ విభాగాల్లో పరీక్షించబడింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, రోడ్ యూజర్ ప్రొటెక్షన్, సేఫ్టీ అసిస్ట్ విభాగాల్లో దీని పనితీరును అంచనా వేశారు. అడల్ట్ ప్రొటెక్షన్ లో ఈ కారు 40 పాయింట్లకు గాను 34.22 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ క్రాష్ టెస్టుల్లో డ్రైవర్ చెస్ట్ కు తగిన రక్షణ లభించినట్లు గుర్తించారు. ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికుల కాళ్లకు కూడా మంచి రక్షణ లభించింది. ప్రమాదం తర్వాత నాలుగు డోర్లు సక్రమంగా పనిచేయడం, కిటికీలను తెరవగలగడం లాంటి అంశాలను ANCAP ప్రత్యేకంగా ప్రస్తావించింది.
పిల్లల భద్రత విభాగంలో ఆక్టేవియా RS 49 పాయింట్లలో 40.04 పాయింట్లు సాధించింది. 6 ఏళ్లు, 10 ఏళ్ల పిల్లలను సూచించే డమ్మీలతో పరీక్షలు నిర్వహించారు. కొన్ని విభాగాల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ, పెద్ద పిల్లల డమ్మీ ఛాతీ, మెడ రక్షణ విషయంలో కొంత మెరుగుదల అవసరమని నివేదిక తెలిపింది. అటు రోడ్ యూజర్ ప్రొటెక్షన్ విభాగంలో ఈ సెడాన్ 63 పాయింట్లలో 51.39 పాయింట్లు పొందింది. పాదచారులకు హుడ్ భాగం మంచి రక్షణ కల్పిస్తుండగా, విండ్ స్క్రీన్ కూడా అనుకున్న స్థాయిలో రక్షణను అందించినట్లు గుర్తించారు. అయితే, A పిల్లర్ భాగం మాత్రం ఆశించిన స్థాయిలో స్కోర్ చేయలేకపోయింది. సేఫ్టీ అసిస్ట్ విభాగంలో ఈ కారు 81 శాతం స్కోర్ సాధించింది.
స్కోడా ఆక్టేవియా RSలో 2.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 261 bhp శక్తి, 370 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్ బాక్స్ జత చేశారు. ఈ సెడాన్ గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 6.4 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. పండుగ సీజన్ సందర్భంగా ఆక్టేవియా RS రెండో బ్యాచ్ ను భారత మార్కెట్లోకి తీసుకురావాలని స్కోడా భావిస్తోంది. కొత్త బ్యాచ్ ధరలు కూడా మొదటి బ్యాచ్ కు దగ్గరగా ఉండే అవకాశం ఉంది.
Read Also: సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!