సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS)తో యాక్సెస్ స్కూటర్ ను విడుదల చేసింది. ఈ మోడల్ లోని ఇంఫ్రూవ్ చేసిన సెఫ్టీతో పాటు రోజువారీ అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడింది. కొత్త అప్ డేట్స్ తో వచ్చిన ఈ స్కూటర్ ధరను కంపెనీ రూ. 92,328 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. TFT స్క్రీన్, ABSతో కూడిన వేరియంట్ రూ. 98,378 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ABSతో కూడిన యాక్సెస్ సుజుకి 124cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటారుతో, CVT గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6,500 rpm దగ్గర 8.43 bhp (6.2 kW) పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 5,000 rpm దగ్గర 10.2 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పెసిఫికేషన్లతో సుజుకి యాక్సెస్ ABS హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టినీ 125, యమహా ఫాసినో 125 లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ స్కూటర్ వీల్ బేస్ 1,260mm, గ్రౌండ్ క్లియరెన్స్ 160mm, వేరియంట్‌ను బట్టి 105 నుంచి 106 కిలోల వరకు కెర్బ్ వెయిట్ కలిగి ఉంటుంది. ఇది అల్లాయ్ లేదంటే కాస్ట్ వీల్స్ తో అమర్చబడి ఉంటుంది. 5.3 లీటర్ ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంటుంది. రోజువారీ ఉపయోగానికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ పలు రంగుల్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం.2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బీజ్ లాంటి కలర్ ఆప్షన్స్ తో రానుంది. ఇక TFT స్క్రీన్ తో కూడిన స్కూటర్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్‌తో వస్తుంది.
కొనుగోలు దారులను పెంచుకునేందుకు సుజుకి యాక్సెస్ ABS కోసం మంచి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ను అందిస్తుంది. ఇందులో 6.99 శాతం వరకు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుల నుంచి మినహాయింపు అందిస్తుంది. అంతేకాదు, ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది విజేతలకు రూ. 5,000 విలువైన వోచర్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇక సుజుకి యాక్సెస్ ABS లాంచ్ సందర్భంగా సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడా కీలక విషయాలు వెల్లడించారు. “ఈ ABS వేరియంట్ తో, యాక్సెస్ ఫ్యామిలీలో ఎంపికల శ్రేణిని విస్తరిస్తున్నాం. కస్టమర్లు వారి అవసరాలకు బాగా సరిపోయే వేరియంట్‌ను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తున్నాము. కస్టమర్ అంచనాలను అందుకునేలా కొత్త మోడల్స్ ను పరిచయం చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే సుజుకి యాక్సెస్ ABSని తీసుకొచ్చాం” అన్నారు.
Read Also: ఏడుకు తోడు మరో మూడు.. విన్ ఫాస్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!