Gujarati Sweets: భారతీయ వంటకాల్లో గుజరాతీ భోజనానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా అక్కడి స్వీట్స్ భోజనంలో భాగంగా కూడా వడ్డిస్తారు. స్వచ్ఛమైన నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్ ,కేసరంతో చేసే ఈ మిఠాయిలు రాజసం ఉట్టిపడేలా ఉంటాయి. మీరు గుజరాత్ సంస్కృతిని రుచి చూడాలనుకుంటే.. అక్కడి సంప్రదాయ స్వీట్స్ ఖచ్చితంగా ఆస్వాదించాలి.
తప్పక రుచి చూడాల్సిన గుజరాతీ స్వీట్స్:
1. మోహన్‌థాల్ :
గుజరాత్‌లో అత్యంత ఫేమస్ స్వీట్ ఇది. శనగపిండి, నెయ్యి , చక్కెర పాకంతో చేసే ఈ స్వీట్ కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇది బర్ఫీలా ఉన్నప్పటికీ.. దీనికి ఉండే ‘గ్రైని’ టెక్స్చర్ దీనికి ఒక విభిన్నమైన రుచిని ఇస్తుంది. కేసరి రంగులో మెరుస్తూ, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించిన మోహన్‌థాల్ ముక్క నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
2. శ్రీఖండ్ :
పాలను పెరుగుగా మార్చి, దానిలోని నీటిని పూర్తిగా తీసేసి,చక్కెర, యాలకుల పొడి కలిపి దీనిని తయారు చేస్తారు. మామిడి పండు గుజ్జు కలిపిన ‘ఆమ్రఖండ్’ ఎండాకాలంలో గుజరాతీయుల ఫేవరెట్. ఇది చాలా క్రీమీగా, చల్లగా ఉండి పూరీలతో కలిపి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.
3. బాసుందీ :
ఇది మన ఉత్తర భారత రబ్రీని పోలి ఉంటుంది కానీ కాస్త పలుచగా ఉంటుంది. పాలను తక్కువ మంటపై మరిగించి సగం అయ్యే వరకు ఉడికించి.. అందులో బాదం, జీడిపప్పు, కేసరి కలిపి చేస్తారు. దీనిని వేడివేడిగా లేదా చల్లగా ఆస్వాదించవచ్చు.
4. సుఖ్‌డీ :
మహాదేవుని ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఈ స్వీట్ గోధుమ పిండి, నెయ్యి, బెల్లంతో తయారవుతుంది. ఇది అత్యంత ఆరోగ్యకరమైన స్వీట్లలో ఒకటి. కేవలం మూడు పదార్థాలతో చేసే ఈ సుఖ్‌డీని మహుడి జైన్ దేవాలయంలో ప్రసాదంగా పంచుతారు.
5. ఘారీ:
సూరత్ ప్రాంతానికి చెందిన ఈ స్వీట్ చాలా రిచ్‌గా ఉంటుంది. పూరీ లాంటి పిండిలో మావా (కోవా), డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని నింపి.. దానిని నెయ్యిలో వేయించి చేస్తారు. చందానీ పడ్వా పండగ రోజు సూరత్ ప్రజలు దీనిని ఎక్కువగా తింటారు.
6. జిలేబీ, ఫాఫడా:
గుజరాత్‌లో ఆదివారం ఉదయం టిఫిన్ అంటే జిలేబీ, ఫాఫడా ఉండాల్సిందే. తీపి తీపి జిలేబీలు, కారం కారంగా ఉండే శనగపిండి ఫాఫడాల కాంబినేషన్ వినడానికి వింతగా ఉన్నా.. తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ కావాలంటారు.
Also Read: నార్త్ ఇండియన్ స్టైల్ మొఘలాయి చికెన్ కుర్మా.. ఇలా వండితే అందరూ మెచ్చుకోవాల్సిందే
7.మగస్ :
ఇది కూడా శనగపిండితో చేసేదే కానీ.. ఇందులో నెయ్యి, చక్కెర నేరుగా కలుపుతారు. ఇది లడ్డూ రూపంలో లేదా ముక్కల రూపంలో ఉంటుంది. దీనిని చాలా రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
గుజరాతీ స్వీట్ల కేవలం రుచికే కాదు. అక్కడి ఆతిథ్యానికి కూడా నిదర్శనం. మీరు ఎప్పుడైనా గుజరాత్ పర్యటనకు వెళ్తే.. పైన చెప్పిన వాటిలో కనీసం రెండు మూడు స్వీట్ల రుచి చూడటం మర్చిపోకండి.
Also Read: బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే కర్ణాటక బటర్ దోస రెసిపీ!