May 2026 Tata EV Sales: భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో టాటా మోటార్స్ దుమ్మురేపుతోంది. మే 2026 నెల కంపెనీకి మరింత ప్రత్యేకంగా నిలిచింది. బలమైన అమ్మకాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో రికార్డు స్థాయి ఫలితాలు సాధించింది. అమ్మకాల పరంగా మహీంద్రాను వెనక్కి నెట్టింది.
కంపెనీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, మే 2026లో టాటా మోటార్స్ మొత్తం 59,790 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. వీటిలో దేశీయ మార్కెట్లో 59,090 యూనిట్లు అమ్ముడవగా, మరో 700 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ 42 శాతం వృద్ధిని నమోదు చేసింది.
అటు మహీంద్రా దేశీయ మార్కెట్లో 58,021 ఎస్‌యూవీలను సేల్ చేసింది. ఎగుమతులను కలిపి మొత్తం అమ్మకాలు 59,573 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల విషయంలో టాటా స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది.
గత కొంతకాలంగా టాటా తన SUV మరియు ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని విస్తరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పుడు అమ్మకాల రూపంలో ఫలితాలను ఇస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పంచ్, నెక్సాన్, కర్వ్ లాంటి మోడళ్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే, టాటా మోటార్స్ కు ఈ నెలలో అత్యంత పెద్ద విజయంగా నిలిచింది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు. గత ఏడాది మే నెలలో కంపెనీ 5,685 ఈవీలను విక్రయించగా, ఈ ఏడాది అదే నెలలో 10,517 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో 85 శాతం వృద్ధి నమోదైంది.
టాటా మోటార్స్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ EV అమ్మకాల సంఖ్యగా కూడా గుర్తింపు పొందింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ, కంపెనీ అందిస్తున్న విభిన్న మోడళ్లు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టాటా ఈవీ పోర్ట్ ఫోలియోలో పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, కర్వ్ ఈవీ లాంటి మోడళ్లు ఉన్నాయి. తక్కువ ధరల్లో అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా టాటా ఈవీ కార్లను కొనుగోలు చేస్తున్నారు.
అటు మే నెలలో రిటైల్ డిమాండ్ కూడా బలంగా కొనసాగింది. వాహన్ పోర్టల్ లో నమోదైన రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు టాటా వెల్లడించింది. మార్కెట్లో వాహనాలకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. మే 2026 టాటా మోటార్స్ కు మరో సక్సెస్ ఫుల్ మంత్ గా నిలిచింది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో మహీంద్రాను అధిగమించడంతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త రికార్డును సృష్టించడం ద్వారా కంపెనీ తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది.\
Read Also: పెట్రోల్ తో పాటు ఇథనాల్ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రత్యేకతలు ఇవే!