TVS Raider 125 Gets New Features: 125cc బైక్ కొనాలని చూస్తున్న వారికి TVS మోటార్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. యువతను ఆకట్టుకుంటున్న టీవీఎస్ రైడర్ 125లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, మెరుగైన USB-C ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఈ బైక్ను మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి. అయితే, ఈ అప్డేట్స్ అన్నీ టాప్ రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
2021లో మార్కెట్లోకి వచ్చిన టీవీఎస్ రైడర్ 125 స్పోర్టీ లుక్, మంచి పనితీరుతోయూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ బైక్కు వచ్చిన స్పందనతో ఇతర కంపెనీలు కూడా 125cc మోడళ్లపై దృష్టి పెట్టాయి. ఇప్పుడు పోటీని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు TVS తన రైడర్ లో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ అప్డేట్ లో ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, 27W USB-C ఛార్జర్ తో పాటు వెనుక టైరు సైజును పెంచింది.
ఈ బైక్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ట్రాక్షన్ కంట్రోల్. 125cc సెగ్మెంట్లో ఈ ఫీచర్ను పొందిన తొలి బైక్గా టీవీఎస్ రైడర్ నిలుస్తోంది. రోడ్డు మీద వెనుక చక్రం జారిపోయే పరిస్థితులను తగ్గించేందుకు ఈ సిస్టమ్ సహాయపడుతుంది. ముఖ్యంగా కంకర రోడ్లు, జారే రోడ్ల మీద వీల్ కు మంచి గ్రిప్ అందించడంలో ఉపయోగపడుతుంది. దీనికి అదనంగా, వెనుక టైరు సైజును 110/80-17 నుంచి 120/70-17కు పెంచారు. వెడల్పుగా ఉన్న టైరు వల్ల రోడ్డు మీద గ్రిప్, బైక్ స్టెబులిటీ మెరుగుపడే అవకాశం ఉంది.
ఆకస్మికంగా బ్రేకులు వేసినప్పుడు హజార్డ్ లైట్లు ఆటోమేటిక్గా వెలిగేలా ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ ఫీచర్ను అందించారు. దీని వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందుగానే హెచ్చరిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మొబైల్ ఛార్జింగ్ కోసం గతంలో ఉన్న 12W USB-A పోర్ట్ స్థానంలో 27W USB-C ఛార్జర్ను అందించారు. దీనివల్ల ఆయా డివైజ్ లకు ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త ఫీచర్లు మినహా బైక్ డిజైన్, ఇంజిన్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులోని 124.8cc ఇంజిన్ గరిష్ఠంగా 11.2hp పవర్, 11.75Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 0.55Nm టార్క్ ను ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ మోటార్ జనరేటర్ అందిస్తుంది. టాప్ వేరియంట్లలో సింగిల్ ఛానల్ ABSతో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. ధరల విషయానికి వస్తే, TVS Raider 125 SXC DD వేరియంట్ ధర రూ.1,00,330గా ఉండగా, TFT DD వేరియంట్ ధర రూ.1,03,170గా ఉంది.
Read Also: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!