VinFast EV Taxi Service: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ భారత మార్కెట్ లో కొత్త వ్యూహంతో అడుగులు వేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలతో భారత్ లోకి ప్రవేశించిన ఈ కంపెనీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీసులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కంపెనీకి చెందిన Green SM సర్వీసును భారత్ లో ప్రారంభించాలని భావిస్తోంది.
గ్రీన్ SM సర్వీసును తొలుత ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలకు దశలవారీగా విస్తరించనుంది. ప్రారంభ దశలో సుమారు 1,000 ఎలక్ట్రిక్ క్యాబ్ లను రోడ్లపైకి తీసుకురావాలని, ఈ ఏడాది చివరికి ఆ సంఖ్యను 15,000 వరకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇది సాధారణ క్యాబ్ అగ్రిగేటర్ మోడల్ కాకుండా, కంపెనీ ఆధ్వర్యంలో నడిచే ఫ్లీట్ సిస్టమ్ గా ఉండనుంది. అంటే వాహనాలు, డ్రైవర్లు, సర్వీసింగ్, ఛార్జింగ్ వ్యవస్థ అన్నీ కంపెనీ నియంత్రణలో ఉంటాయి. దీంతో ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు అందించే అవకాశం ఉంటుంది.
భారత మార్కెట్ కోసం విన్ ఫాస్ట్ లిమో గ్రీన్ అనే ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉపయోగించే అవకాశముంది. ఈ మోడల్ ఇప్పటికే భారత్ లో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఎక్కువ క్యాబిన్ ప్లేస్, మంచి బ్యాక్ సీటు సౌకర్యం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి ఎయిర్ కండిషనింగ్ లాంటి ఫీచర్లు ఉండటంతో క్యాబ్ సేవలకు సరిపోతుందని భావిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం గ్రీన్ SM కిలోమీటరుకు సుమారు రూ.8 చొప్పున చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇదే నిజం అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Ola, Uber లాంటి సంస్థలకు నేరుగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నీట్ గా ఉండే కార్లు, స్థిరమైన ధరలు, ట్రైనింగ్ పొందిన డ్రైవర్ల కారణంగా ప్రయాణికులను ఆకర్షించే అవకాశం ఉంది.
విన్ ఫాస్ట్ కు ఈ ప్రణాళిక కేవలం టాక్సీ వ్యాపారం మాత్రమే కాదు. బ్రాండ్ గుర్తింపును పెంచే ప్రయత్నం కూడా. కొత్త బ్రాండ్ కావడంతో భారతీయ వినియోగదారుల్లో నమ్మకం పెంచుకోవడం కంపెనీకి చాలా అవసరం. అందుకే, ముందుగా ప్రజలు తమ వాహనాల్లో ప్రయాణించేలా చేసి, తర్వాత రిటైల్ అమ్మకాలపై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడులోని తూత్తుకుడిలో విన్ ఫాస్ట్ ఫ్యాక్టరీ కార్యకలాపాలు ప్రారంభించింది. అక్కడ తయారయ్యే ఈవీల్లో VinFast VF 6, VinFast VF 7 లాంటి మోడళ్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, కంపెనీ ఛార్జింగ్ సదుపాయాల కోసం HPCLతో చేతులు కలిపింది. దేశంలో EV క్యాబ్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఈ సమయంలో గ్రీన్ SM సరైన సేవలు అందించగలిగితే, భారత ఎలక్ట్రిక్ టాక్సీ రంగంలో విన్ ఫాస్ట్ కు మంచి అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు నిపుణులు.
Read Also: మినీ డస్టర్ స్టైల్ లో కొత్త కాంపాక్ట్ SUV.. డిజైన్ పేటెంట్ దాఖలు చేసిన రెనాల్ట్!