E-Paper
Advertisement

Tech 2026: 2026లో దేశంలో జరగబోయే విప్లవాత్మక మార్పులేంటి!

Tech 2026: 2026లో దేశంలో జరగబోయే విప్లవాత్మక మార్పులేంటి!

Tech 2026: రోజులు మారాయ్.. నెలలు దాటాయ్.. ఏకంగా ఇప్పుడు ఏడాదే మారబోతోంది. కొత్త సంవత్సరం అంటే.. కొత్త క్యాలెండర్ ఒక్కటే కాదు. కొత్తగా మన జీవితాల్లో రాబోయే మార్పులు కూడా. ఏళ్లు గడిచేకొద్దీ టెక్నాలజీ మారుతోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంది. రాబోయే 2026లో.. మనమంతా కొత్తగా ఏం చూడబోతున్నాం? ఎలాంటి ఆవిష్కరణలు రాబోతున్నాయ్? మన లైఫ్‌లో కొత్తగా జరగబోయే మార్పులేంటి?

క్యాలెండర్ మాత్రమే కాదు… 2026లో మారబోయేది మన జీవనశైలి

కాలం పరుగులు పెడుతోంది.. 2025 అప్పుడే ఎండింగ్‌కి వచ్చేసింది. 2026కి వెల్‌కమ్ చెప్పేందుకు గ్లోబ్ అంతా రెడీ అయిపోయింది. ప్రతి ఏటా క్యాలెండర్ మారినట్లుగానే.. మన చుట్టూ ఉన్న ప్రపంచం, టెక్నాలజీ ఊహించని వేగంతో మారుతోంది. 2026లో మన జీవితాల్లో చోటు చేసుకోబోయే విప్లవాత్మక మార్పులేంటి? రాబోయే కొత్త ఆవిష్కరణలు ఏవి?

2026.. మానవ మేధస్సు + AI.. కొత్త యుగానికి నామంకనం

2025లోనే ఈ ప్రపంచం అడ్వాన్స్ టెక్నాలజీని చూసేసింది. 2026.. అంతకుమించి ఉండబోతోంది. టెక్నాలజీ మాయాజాలంతో.. మనందరి జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయ్. వచ్చేది కొత్త సంవత్సరం మాత్రమే కాదు.. మానవ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కలిసి.. ఓ కొత్త యుగానికి నాంది పలకబోతోంది. వచ్చే ఏడాదిలో.. అల్ట్రా పర్సనలైజ్డ్ ఏఐ అసిస్టెంట్స్ చూడబోతున్నాం. ఇప్పటిదాకా మనం చూసి ఏఐ చాట్‌బాట్స్ కేవలం సమాచారాన్ని ఇచ్చి సాధనాలుగానే ఉన్నాయ్. కానీ.. కొత్త ఏడాది ఇవి మన డిజిటల్ ట్విన్స్‌గా మారతాయ్. మీరు చెప్పకముందే.. మీ షెడ్యూల్ సెట్ చేయడం, మీ అభిరుచులకు తగ్గట్లుగా పనులు పూర్తి చేయడం లాంటివి జరుగుతాయ్. కేవలం.. టెక్ట్స్ మాత్రమే కాదు.. మీ ఎమోషన్స్‌ని కూడా అర్థం చేసుకొని స్పందించే ఏఐ.. మన స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి రాబోతోంది.

భవిష్యత్తు చూపే మిక్స్‌డ్-రియాలిటీ గ్లాసెస్

బరువైన వీఆర్ హెడ్‌సెట్‌లు.. కనుమరుగయ్యే పరిస్థితులున్నాయ్. తక్కువ బరువుతో, చూడటానికి సాధారణ కళ్లద్దాల్లా ఉండే మిక్స్‌డ్-రియాలిటీ గ్లాసెస్ రాబోతున్నాయి. ఇవి రియాలిటీకి దగ్గరగా.. దృశ్యాలతో డిజిటల్ సమాచారాన్ని కలిపి చూపిస్తాయి. వర్క్, ఎడ్యుకేషన్, గేమింగ్, నావిగేషన్ లాంటి అన్ని రంగాల్లో ఇదొక కొత్త అనుభూతిని ఇస్తుంది. మీరు రోడ్డుపై వెళ్తుంటే.. గాలిలోనే మ్యాప్స్ కనిపిస్తాయ్. వీడియో కాల్స్ చేయడం, సినిమాలు చూడటం లాంటివన్నీ.. కళ్లముందే గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తాయ్. దీనివల్ల.. స్మార్ట్ ఫోన్ల వినియోగం కొంత తగ్గే అవకాశం ఉంది.

హెల్త్ టెక్నాలజీ , రవాణాలో విప్లవాత్మక మార్పులు

ఇక.. కొత్త సంవత్సరంలో హెల్త్ టెక్నాలజీ.. కీలక మైల్‌స్టోన్ కానుంది. హెల్త్ ట్రాకింగ్ వేరబుల్ సెన్సార్లు విరివిగా రానున్నాయ్. కేవలం హార్ట్ రేట్ మాత్రమే కాదు, రక్తంలోని చక్కెర స్థాయిని సూదులు గుచ్చకుండానే కొలిచే స్మార్ట్ వాచీలు, స్మార్ట్ రింగ్స్ సాధారణం కానున్నాయ్. మీ శరీరంలో ఏదైనా అనారోగ్యం మొదలయ్యే ముందే.. స్మార్ట్ రింగ్, స్మార్ట్ వాచ్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇంటి నుంచే డాక్టర్లతో కనెక్ట్ అయ్యే వర్చువల్ క్లినిక్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. రవాణా రంగంలోని విప్లవాత్మక మార్పులు రానున్నాయ్. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో.. ఎలక్ట్రిక్ వాహనాలు రాజ్యమేలతాయ్. ప్రధాన నగరాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. హైపర్ లూప్, ఎయిర్ ట్యాక్సీలను కూడా చూసే చాన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో.. ఎయిర్ టాక్సీల ట్రయల్స్ పూర్తయి, కమర్షియల్‌గా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయ్. అవిగానీ సక్సెస్ అయితే.. ట్రాఫిక్ కష్టాలు తగ్గే దిశగా అడుగులు పడతాయ్.

మల్టీ టాస్కింగ్ నుండి మైక్రోస్కేల్ హోలోగ్రామ్స్ వరకు

ఇక.. స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో మరో విప్లవం రాబోతోంది. ఇప్పటికే ఉన్న ఫోల్డబుల్ ఫోన్లని మించి.. స్కీన్‌ని చుట్టగలిగే రోలబుల్ ఫోన్లు.. కొత్త ఏడాదిలో ట్రెండ్ అవుతాయ్. ఇది మెరుగైన మల్టీ టాస్కింగ్ ఫీచర్లతో.. మొబైల్ వాడకం నిర్వచనాన్నే మార్చేసే అవకాశాలున్నాయ్. ఇలాంటి మొబైల్ తయారీకి ప్రముఖ కంపెనీల రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాలు పనిచేస్తున్నాయ్. సాధారణ ల్యాప్‌టాప్‌ల కంటే.. చాలా రెట్లు వేగంగా పనిచేసే క్వాంటం టెక్నాలజీ ఆధారిత ల్యాప్‌టాప్స్ 2026లో వస్తాయ్. ఇవి చాలా కష్టమైన లెక్కలను క్షణాల్లో పూర్తి చేసేస్తాయ్. రీసెర్చ్ చేసేవారికి, క్రియేటర్లకు ఇదొక వరంలా మారనుంది. ఇంటి పనులు చేసేందుకు.. మనుషుల అవసరం తగ్గించేందుకు ఏఐ రోబోలు రానున్నాయ్. ఇల్లు శుభ్రం చేయడం, భద్రత కల్పించడం, వృద్ధులను చూసుకోవడం లాంటి అన్ని పనులను.. ఏఐ రోబోలు చూసుకుంటాయ్. మనుషుల భావాలను అర్థం చేసుకొని పనిచేసేలా వీటిని తయారుచేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీడ్‌లో నెక్ట్స్ మైల్ స్టోన్.. అల్ట్రా ఫాస్ట్ వై-ఫై రూటర్లు. ఇది.. మెరుపు వేగంతో డేటాని బదిలీ చేస్తుంది. స్మార్ట్ హోమ్ పరికరాలు, గేమింగ్, పెద్ద మొత్తంలో డేటా వాడకానికి.. ఇది అంతరాయం లేకుండా కనెక్టివిటీని అందిస్తుంది. స్క్రీన్ మీద సినిమాలు చూడటం పాత స్టైల్. ఇక.. గాల్లోనే త్రీడీ దృశ్యాలను సృష్టించే.. హోలోగ్రామ్ ప్రొజెక్టర్లు రాబోతున్నాయ్. ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇది మరో లెవెల్‌కి తీసుకెళ్తుంది.

టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. గూగుల్‌ ఫర్ ఆల్ దగ్గర్నుంచి.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాలానికి మారిపోయాం. స్మార్ట్ గ్యాడ్జెట్లకైతే లెక్కే లేదు. ఇలా.. మనందరి జీవితాలను సౌకర్యవంతంగా మార్చేసింది టెక్నాలజీ. ఇప్పటిదాకా చూసినవే కాదు.. కొత్త ఏడాదిలో మనందరినీ ఆశ్చర్యపరిచేందుకు, అద్భుతాలు చూపించేందుకు మరెన్నో రాబోతున్నాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే.. 2026 ఓ హైటెక్ ఇయర్‌గా ఉండబోతోంది.

సామాన్యుడి జీవితంలో విప్లవాత్మక మార్పులు!

2026లో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయ్. సామాన్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపబోతున్నాయ్. ఈసారి కూడా బ్యాంకింగ్, సోషల్ మీడియా, ప్రభుత్వ విధానాలు, రేషన్, వాహన నియమాలు లాంటి అనేక రంగాల్లో మార్పులు కనిపించబోతున్నాయ్. కొత్త ఏడాదిలో లైఫ్‌ స్టైల్‌ని మార్చేసే టెక్నాలజీ రాబోతోంది. 2026.. టెక్నాలజీ ప్రపంచంలో స్వర్ణయుగం కాబోతోంది. కొత్తగా రాబోయే గాడ్జెట్‌లు మన పనుల్ని సులభతరం చేయడమే కాదు.. జీవన విధానాన్ని కూడా మెరుగుపరచనున్నాయి. ముఖ్యంగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఓ సాఫ్ట్‌వేర్‌గానే కాకుండా.. భౌతిక ప్రపంచంలోనూ భాగం కానుంది.

రేపటి ప్రపంచం.. మన చేతుల్లో ఏఐ.. మన ఇంట్లో రోబోలు

ఇంకొద్దిరోజుల్లోనే.. ఏఐ మనందరికీ ఏజెంట్‌గా మారుతుంది. మెయిల్స్‌కి రిప్లై ఇవ్వడం, బుకింగ్స్ చేయడం లాంటి పనులన్నింటిని ఏఐ చేయనుంది. 2026లో క్వాంటం కంప్యూటింగ్, 6G దిశగా పరిశోధనలు వేగవంతం కానున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. మన ఇళ్లలోని ప్రతి వస్తువును స్మార్ట్‌గా మారుస్తుంది. వ్యక్తిగత డేటా భద్రత కోసం మరిన్ని కఠినమైన టెక్నాలజీ నిబంధనలు అమల్లోకి వస్తాయి. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ.. విద్య, వైద్య రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. స్టూడెంట్స్ క్లాస్‌రూమ్‌లో కూర్చుని, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. చారిత్రక కట్టడాలను వర్చువల్‌గా సందర్శించవచ్చు. డాక్టర్లు కూడా సర్జరీల కోసం వీఆర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించనున్నారు. రోబోలు కూడా ఫ్యాక్టరీలకే పరిమితం కాకుండా.. ఏఐ సాయంతో ఇళ్లలోనూ, ఆఫీసుల్లో మనుషులతోనూ కలిసి పనిచేసే స్థాయికి చేరుకోనున్నాయి.

గగన్‌యాన్ నుంచి కొత్త ఐటీ చట్టం వరకు.. రాబోతున్న భారీ మార్పులివే!

స్పేస్ టెక్నాలజీలో.. భారత్ గగన్‌యాన్ లాంటి కీలకమైన మిషన్‌ని చేపట్టనుంది. అంతరిక్షంలోకి మనుషులను పంపి.. వారిని తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేలా ప్రయోగాలు చేపట్టనున్నారు. ఇండియన్ స్టార్టప్‌లు.. సొంతంగా రాకెట్లని ప్రయోగించే దిశగా అడుగులు వేస్తున్నాయ్. పెరోస్కైట్, సిలికాని కలిపి తయారుచేసే.. హైబ్రిడ్ సోలార్ సెల్స్ అందుబాటులోకి రానున్నాయ్. ఇవి.. తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయ్. కొత్త ఏడాదిలో బ్యాంకింగ్ రంగంలోనూ కీలక మార్పులు రానున్నాయ్. ముఖ్యంగా.. క్రెడిట్ స్కోర్లు, లోన్ వడ్డీ రేట్లు, ఎఫ్‌డీ రేట్లు, యూపీఐ, డిజిటల్ చెల్లింపుల నియమాలు సవరించారు. క్రెడిట్ స్కోర్ కంపెనీలు ప్రతి 15 రోజులకోసారి కాకుండా.. ప్రతి వారం డేటాని అప్‌డేట్ చేయనున్నారు. ఇక.. వచ్చే ఫిబ్రవరి కల్లా.. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ వాడాలంటే.. ఫోన్లో సిమ్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తెస్తున్న రూల్ ఇది. 60 ఏళ్ల నాటి పాత ఐటీ చట్టం పోయి.. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్-2025.. వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. దాంతో.. ఫామ్స్ అన్నీ సింపుల్‌గా మారిపోతాయ్. అన్నీ ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయొచ్చంటున్నారు.

నగరాల్లో సొంత పంట.. ఆఫీసుల్లో కొత్త వింత

మారుతున్న కాలానికి అనుగుణంగా.. అర్బన్ ఫార్మింగ్ పెరిగే అవకాశం ఉంది. నగరాల్లో నివసించే వారు తమ మేడల మీద, బాల్కనీల్లో.. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు పెంచుకోవడం ఓ ట్రెండ్‌గా మారనుంది. కెమికల్స్ లేని ఆహారం కోసం ఈ దిశగా అడుగులు పడనున్నాయ్. వర్క్ కల్చర్ కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ఆఫీసుకి వెళ్లి పనిచేయడం అనేది పద్ధతి క్రమంగా మారనుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు.. చాలా కంపెనీలు ప్రయోగాత్మకంగా ఫోర్ డే వర్క్ వీక్‌ని ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాగనికి పెద్ద పీట వేయడం ద్వారా ప్రొడక్టివిటీ పెంచాలని కొన్ని సంస్థలు భావిస్తున్నాయ్.

మారుతున్న కాలం.. మెరుస్తున్న టెక్నాలజీ

ఇక.. జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే.. జెనో-ట్రాన్స్‌ప్లాంటేషన్ రంగంలో కొత్త ఏడాదిలో కీలక పురోగతి కనిపించే అవకాశం ఉంది. అవయవ దాతల కొరతను తీర్చేందుకు.. జన్యుమార్పిడి చేసిన జంతువుల అవయవాలపై పరిశోధనలు పెరగనున్నాయి. చెత్తని పూర్తిగా తగ్గించే జీరో వేస్ట్ లైఫ్ స్టైల్‌ని జనం అలవాటు చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ బదులు తినగలిగే భూమిలో కలిసిపోయే ప్యాకేజింగ్ మెటీరియల్స్ లాంటి ఇన్నోవేషన్లు మార్కెట్‌లోకి రానున్నాయి. 2026లో రాబోయే కొత్త టెక్నాలజీ మన పనుల్ని సులభతరం చేస్తే.. పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్‌ని కాపాడనుంది. మొత్తంగా 2026.. మరింత ఆధునికంగా ఉండనుంది. అయితే.. టెక్నాలజీ ఎంత పెరిగినా, మానవ సంబంధాలు, ప్రకృతితో మనకున్న అనుబంధం చెక్కుచెదరకుండా చూసుకోవడం మన బాధ్యత. కొత్త ఏడాది.. మనకు మరిన్ని సౌకర్యాలను ఇస్తుంది. టెక్నాలజీతో పాటు మనం కూడా అప్‌డేట్ అవ్వాలి. కొత్త విషయాలను నేర్చుకోవాలి.

Story By Anup, Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×