Putin Residence Attack: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో అటాక్ చేసిందనే వార్తలు సంచలనం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాధినేతలు ఈ దాడిని ఖండించారు. సోమవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మీడియాతో మాట్లాడుతూ.. మాస్కో సెయింట్ పీటర్స్‌బర్గ్ లోని పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందని ఆరోపించారు. నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసం వద్ద 91 డ్రోన్‌లను అడ్డుకుని పేల్చివేశామన్నారు. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ తరహా దాడిని సహించేది లేదని లావ్‌రోవ్ అన్నారు. చర్చలపై రష్యా వైఖరి మారుతుందన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. యుద్ధాన్ని ముగించడానికి ఇరు దేశాలు దౌత్య ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని కోరారు. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ దౌత్య ప్రయత్యాలతో సమస్య పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచిస్తున్నారు.
“రష్యా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే వార్తలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాను. దౌత్య ప్రయత్నాల ద్వారా శాంతిని సాధ్యమవుతుందని భావిస్తున్నాను. ఈ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని, శాంతి చర్చలను దెబ్బతీసే ఏవైనా చర్యలను నివారించాలని కోరుతున్నాము” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డ్రోన్ల దాడిని తోసిపుచ్చారు. ఉక్రెయిన్ పై దాడులను సమర్థించుకోవడానికి.. ఇది రష్యన్ అబద్ధం అని అన్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చేస్తున్న ప్రయత్నాలను బలహీనపరచడానికి రష్యా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. యూఎస్ తో కలిసి దౌత్య ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓ కట్టు కథతో మళ్లీ ఉక్రెయిన్‌పై దాడులను సిద్ధమవుతున్నారని ఆరోపించారు. చర్చలకు భంగం కలిగించేలా ఉక్రెయిన్ ప్రయత్నించదు అని స్పష్టం చేశారు.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణ హత్య.. అరాచాకలకు పులిస్టాప్ పడేదెప్పుడు..?
అమెరికాలో జెలెన్స్కీని కలవడానికి ముందు పుతిన్‌తో ట్రంప్ మాట్లాడారు. దాడి గురించి తనకు సమాచారం అందిందన్నారు. ఈ ఘటన పట్ల తాను చాలా కోపంగా ఉన్నానని ట్రంప్ అన్నారు. ఇది మంచిది కాదన్నారు. జెలెన్స్కీతో చర్చల తర్వాత శాంతి ఒప్పందానికి దగ్గరయ్యామని ట్రంప్ అన్నారు.