E-Paper
Advertisement

Gold Price 2026: అంచనాలు తలకిందులు.. 2026 దీపావళి నాటికి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉంటాయంటే..

Gold Price 2026: అంచనాలు తలకిందులు..  2026 దీపావళి నాటికి  గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉంటాయంటే..

Gold Price 2026: నేరుగా విషయంలోకి వెళ్లిపోదాం.. 2026లోనైనా బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? మరింత పెరుగుతాయా? ఇండియాలో ఇప్పుడున్న బిగ్గెస్ట్ డౌట్ ఇదే. గోల్డ్ రేటు తగ్గుతుంది.. ఇంతకు పడిపోతుంది.. అంతకు పడిపోతుంది అనే లీకులు తప్ప.. రేటు పడింది లేదు.. తగ్గింది లేదు. వెండి కూడా మొండిగా పెరిగిపోయింది. బంగారంతో పోటిపడుతూ.. లక్షల్లో రేటు పలుకుతోంది. మరి.. కొత్త ఏడాదిలోనైనా.. బంగారం, వెండి ధరలు దిగొస్తాయా?

ఇన్వెస్టర్లకు పండుగే పండుగ… 2026లోనూ బంగారం వెలుగు తగ్గదా?

2026లోనైనా గోల్డ్ రన్ ఆగుతుందా? అంటే.. కచ్చితంగా డౌటే! 2025 సంవత్సరం మొదలైనప్పుడు గోల్డ్ రేటెంతో తెలుసా? 24 క్యారెట్ల తులం బంగారం 78 వేలు. 22 క్యారెట్ గోల్డ్.. అప్పుడు 72 వేలు. అదే గోల్డ్ ఇప్పుడెంతో తెలుసా.? లక్షా 38 వేలకు పైనే! 10 గ్రాముల.. 22 క్యారెట్ గోల్డ్ లక్షా 24 వేలకు పైనే! జనవరితో పోలిస్తే.. డిసెంబర్ చివరి నాటికి 45 వేలకు పైనే పెరిగింది. గోల్డ్ రేటు ఇంతలా పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ రికార్డు స్థాయి రేట్లు.. ఇన్వెస్టర్లకు అత్యధికంగా లాభాలు తెచ్చిపెట్టాయ్. ఈ క్రమంలో.. 2026లో బంగారం, వెండి ధరలు ఏ దిశగా వెళ్తాయన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ధరలు ఇక్కడే స్థిరపడతాయా? లేక తగ్గుతాయా? మరింత పెరుగుతాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. కొత్త సంవత్సరంలోనైనా గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుతాయా అంటే.. అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దనే సమాధానాలే వినిపిస్తున్నాయ్. ప్రస్తుత పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణల్ని చూస్తే.. బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. 2026లోనూ.. వీటి జోరు కొనసాగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్. బంగారం ఇప్పటికే.. లక్షా 40 వేలను టచ్ చేసేందుకు రెడీగా ఉండగా.. వెండి ధర కిలో రెండున్నర లక్షల మార్క్‌ని ఎప్పుడో దాటేసింది. సామాన్యులకు ఇవి అందని ద్రాక్షలా మారుతున్నా.. రేట్ల పెరుగుదలకు అనేక కారణాలున్నాయ్.

స్టాక్, కరెన్సీ మార్కెట్లకు షాక్?

గోల్డ్‌మన్ సాచ్స్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లాంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు, మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. 2026లో బంగారం ధర మరో 15 శాతం నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇందుకు.. 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచం.. నగదు కొరత, బ్యాంకింగ్, ద్రవ్య సంక్షోభం దిశగా వెళ్తుందనే అంచనాలున్నాయ్. అలాంటి కాలంలో.. బంగారం విలువ అమాంతం పెరుగుతుందని చరిత్ర చెబుతోంది. అదే జరిగితే.. ఇండియాలో వచ్చే దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర లక్షా 60 వేలు దాటి కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. భవిష్యత్తులో స్టాక్, కరెన్సీ మార్కెట్లకు భారీ షాక్ తలుగుతుందని పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. బంగారం సేఫ్ హెవెన్‌గా కనిపిస్తోంది. అందుకోసమే.. గోల్డ్, సిల్వర్ ధరలు ఎంత పెరుగుతున్నా.. చాలా మంది దానిని లాభదాయకమైన పెట్టుబడిగానే చూస్తున్నారు. రేటు ఎక్కువైనా కొనేస్తున్నారు. సాధారణంగానే.. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు, ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే బంగారం పైనే ఎక్కువ నమ్మకం ఉంచుతారు. ఇదే.. డిమాండ్‌ని పెంచుతోంది.

ఇండస్ట్రియల్ డిమాండ్‌తో దూసుకెళ్తున్న వెండి ధరలు

ఈ సంవత్సరంపై వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి కూడా లాభాల పంట పండింది. ఇప్పటివరకు వెండి ధర 170 శాతం మేర పెరిగింది. ఇండియాలో.. కిలో వెండి రెండు లక్షల 60 వేల మార్క్ కూడా దాటింది. వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. దీనికి ఇండస్ట్రియల్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల తయారీలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 2026 నాటికి ఈ రంగాల్లో డిమాండ్ మరింత పెరగనుంది. కొన్నేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే.. వినియోగమే ఎక్కువగా ఉంది. కొత్త మైనింగ్ గనులు రాకపోవడం వల్ల వెండికి కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. వెండి సప్లైలో కొరతకు తోడు పారిశ్రామిక డిమాండ్ కూడా ఎక్కువ కావడంతో.. కొత్త సంవత్సరంలో వెండి రేట్లు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వెండి అత్యంత విలువైన ఆస్తిగా మారనుందని చెబుతున్నారు. ఈ ధర 100 డాలర్లకు ఎప్పుడు చేరుకుంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. డిసెంబర్‌లో మొదలైన సిల్వర్ రన్.. కొత్త ఏడాదిలో కొత్త రికార్డుకు చేరుకుటుందని చెబుతున్నారు.

బంగారం జోరు.. వెండికీ ఊపు

బంగారం ధరల్లో పెరుగుదల కూడా వెండికి ఊపునిచ్చింది. ఏఐ జనరేషన్‌లో పారిశ్రామిక రంగానికి కీలకంగా మారిన వెండిని.. అమెరికా ఇటీవలే క్రిటికల్ ఖనిజంగా గుర్తించింది. మరోవైపు.. సురక్షిత పెట్టుబడి సాధనంగా వెండికి ఎప్పటి నుంచో పేరు స్థిరపడింది. దాంతో.. వెండి కొనుగోళ్లు పెరిగాయ్. కొత్త ఏడాదిలో కిలో వెండి ధర 3 లక్షల దాకా వెళ్లొచ్చని కొన్ని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయ్. మరోవైపు.. భారత్, చైనా సెంట్రల్ బ్యాంకులు కూడా తమ దగ్గరున్న డాలర్ నిల్వలను తగ్గించుకుంటూ.. బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయ్. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ తగ్గినప్పుడు, బంగారం ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయ్. అందువల్ల.. కొత్త ఏడాదిలో డాలర్ మరింత బలహీనపడొచ్చనే అంచనాలు ఉన్నాయ్. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న లీకులు కూడా.. బంగారం రేట్లకు మరింత ఊతమిస్తోంది.

2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉందనే అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయ్. అదే జరిగితే.. గోల్డ్ రేట్లు మరింత పెరిగిపోతాయ్. అయితే.. పెట్టుబడి కోసం.. ఏది కొంటే ఎక్కువ లాభాలు వస్తాయ్? మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో.. బంగారం, వెండిలో.. ఏది కొంటే బెటర్?

బంగారం వైపు పరుగులు.. 2026 నాటికి రికార్డు ధరల అంచనాలు

ప్రపంచ ఆర్థిక మందగమనం, సంక్షోభం తలెత్తుతుందనే అంచనాలతో.. ఇన్వెస్టర్లంతా సురక్షితమైన పెట్టుబడి మార్గాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతాయని.. మార్కెట్ నిపుణులు బలంగా అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను పెంచడం, వడ్డీ రేట్ల తగ్గింపు లాంటి అంశాలు కొత్త ఏడాదిలోనూ బంగారం, వెండి ధరలను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు 2026 నాటికి ఔన్స్ గోల్డ్ ధర 4500 డాలర్ల నుంచి 5 వేల దాకా చేరొచ్చని అంచనా వేస్తున్నాయ్. భారతీయ మార్కెట్‌లో.. 10 గ్రాముల గోల్డ్ లక్షన్నర నుంచి లక్షా 80 వేల దాకా వెళ్లే చాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో గోల్డ్‌ని కొనగలమా? సామాన్యులు దాని వైపు చూడగలరా? అనే చర్చ మొదలైంది. అయితే.. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, తమ పెట్టుబడికి భద్రత కోరుకునే వారు బంగారాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే.. ఇది వెండి కంటే తక్కువ అస్థిరతని కలిగి ఉంటుంది.

బంగారం–వెండి పెట్టుబడుల్లో కొత్త వ్యూహం

బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం.. 2026 నాటికి వెండి ఔన్స్‌కు 65 డాలర్ల నుంచి 80 డాలర్లకు చేరొచ్చు. మన దేశంలో కిలో వెండి 3 లక్షల మార్క్‌ని టచ్ చేసే అవకాశం ఉంది. అందువల్ల.. కొంచెం రిస్క్ తీసుకొని.. ఎక్కువ శాతం లాభాలు ఆశించే వారికి వెండి బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. గతేడాది కాలంలో బంగారం కంటే.. వెండి ఎక్కువ శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదాని ప్రకారం.. 2025లో వచ్చిన ర్యాలీ.. 2026లోనూ కొనసాగుతుంది. అందువల్ల.. మొత్తం డబ్బుని ఒకే చోట పెట్టకుండా.. పెట్టుబడిలో 20 శాతం బంగారానికి, 10 శాతం వెండికి కేటాయించడం మంచిదంటున్నారు. వెండి ధరలు పెరగడానికి.. గ్రీన్ ఎనర్జీ రంగంలో దాని వాడకం పెరగడమే ప్రధాన కారణం. సప్లై తగ్గి.. డిమాండ్ పెరగడమే వెండికి ప్లస్ పాయింట్. స్థిరత్వం కావాలంటే.. బంగారం వైపు మొగ్గు చూపమంటున్నారు. ఇన్వెస్టర్‌గా ఉండి.. రాబోయే రెండేళ్లలో భారీ రిటర్న్స్ ఆశిస్తుంటే మాత్రం.. వెండిపై పెట్టుబడి పెట్టడం తెలివైన పనిగా చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ మొత్తంలో కాకుండా.. తక్కువం మొత్తంలో వాయిదాల పద్ధతిలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టడం ఉత్తమం అంటున్నారు.

కొత్త ఏడాదిలో బంగారం–వెండి పెట్టుబడులు.. ధరలను ప్రభావితం చేసే అంశాలివే

కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలను ప్రధానంగా కొన్ని అంశాలు ప్రభావితం చేయనున్నాయి. అందులో.. మొట్టమొదటిది వడ్డీ రేట్లే. తరచుగా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ బలహీనపడుతుంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకుల్లో డబ్బు ఉంచడం కంటే, బంగారంపై పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా మారుతుంది. భౌగోళిక ఉద్రిక్తతలు, మాంద్యం భయాలు, ఈటీఎఫ్ పెట్టుబడులు, పారిశ్రామిక డిమాండ్ కూడా ధరలను ప్రభావితం చేయనున్నాయి. బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమా అని ఆలోచిస్తున్న వారికి.. నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆభరణాల కోసమైతే.. ధరలు తగ్గే దాకా వేచి చూడకుండా.. అవసరమైనప్పుడు కొనుగోలు చేయడం, విడతలవారీగా కొనడం మంచిదని సూచిస్తున్నారు. కొత్త సంవత్సరంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా కొనసాగుతుంది. ఎందుకంటే.. గోల్డ్ రేట్లు స్థిరంగా పెరిగే అవకాశం ఉంది. పోర్ట్‌ఫోలియోలో 70% బంగారం, 30% వెండి ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సామాన్యులకు బంగారం–వెండి పెట్టుబడి మార్గాలు

బంగారం, వెండి ధరలు పెరుగుతున్న తీరు చూస్తుంటే.. సామాన్యులు వీటి గురించి మర్చిపోవాలా? అనే ప్రశ్నలు వస్తున్నాయ్. ధరలు తగ్గాక మాత్రమే బంగారం, వెండి కొందామనుకుంటే.. అది కుదిరే పని కాదు. గతంలో బంగారం అంటే.. కేవలం నగలు మాత్రమే. కానీ.. ఇప్పుడు రేటు విపరీతంగా పెరగడంతో.. నగలు కొనడం సామాన్యులకు భారంగా మారింది. అందువల్ల.. ఒకేసారి పెద్ద మొత్తంలో నగలు కొనలేకపోయినా.. డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా నెలకు చిన్న మొత్తాల్లో బంగారంపై పొదుపు చేయొచ్చు. దీనివల్ల.. ధర పెరిగినా.. పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. బంగారం కొనడం మరీ భారమైతే.. వెండిని దీర్ఘకాలిక పెట్టుబడిగా ఎంచుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడం.. ప్రస్తుత పరిస్థితుల్లో లాభదాయకం అంటున్నారు. కేవలం లాభం కోసమే అయితే.. గవర్నమెంట్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం సురక్షితం. అదనంగా ఇందులో వడ్డీ కూడా వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. బంగారం, వెండిని చూడాల్సింది నగలుగా కాదు. ఆ రెండూ మంచి పెట్టుబడి సాధనంగా కనిపిస్తున్నాయ్. 2026లో వీటిని మించిన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలు మరొకటి లేవని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Story by Anup, Big Tv 

 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×