Robot Army: చూస్తున్నారుగా.. యుద్ధ క్షేత్రంలో రోబోలు ఎలా రఫ్ఫాడించేస్తున్నాయో! అవి అటాక్ చేస్తున్న తీరు, బుల్లెట్లు ఫైర్ చేస్తున్న స్టైల్, మానవ సైన్యం మట్టికరుస్తున్న దృశ్యాలు చూస్తుంటే.. యుద్ధ క్షేత్రంలో రోబోలు పెద్ద సవాల్‌గా మారబోతున్నాయనే విషయం ఇట్టే అర్థమవుతోంది. ఈ రోబోలను తట్టుకోవడం ఏ దేశం సైన్యం వల్ల కూడా కాదు. వీటిపై దాడి చేసినా.. పెద్దగా నష్టం లేదు. శత్రుసేనలపైకి రోబోలను ప్రయోగిస్తే.. జవాన్ల ప్రాణాలు సేఫ్‌గా ఉంటాయ్. పైగా.. ఇవి మనిషిని మించిన సామర్థ్యంతో.. యుద్ధ క్షేత్రంలో కదులుతాయ్. ఊహించని శక్తియుక్తులతో దాడులు చేస్తాయ్. ఇలాంటి రోబో ఆర్మీని తట్టుకొని నిలబడటం చాలా కష్టం.
ఇలాంటి రోబోలు వస్తే ఇంకేమైనా ఉందా! మొత్తం స్మాష్. కాకపోతే.. ఇక్కడ తెలుసుకోవాల్సిన అసలు విషయం మరొకటి ఉంది. ఇవేవీ.. రియల్ వీడియోలు కాదు. ఏఐ జనరేటెడ్ వీడియోలు. ఈ వీడియోలు రావడానికి మరో కారణముంది. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలు.. మార్షల్ ఆర్ట్స్, రిథమిక్ డ్యాన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాయ్. రోబోలు చేసిన ఈ పర్ఫామెన్స్ నెట్‌లో వైరల్ అయింది. రోబోలు గ్రూప్ డ్యాన్స్ చేస్తూ.. ఆకట్టుకున్నాయ్. చైనాలో ఓ చానల్ నిర్వహించిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో ఈ సీన్లు కనిపించాయ్. లూనార్ న్యూఇయర్ షో టైమ్ వేళ.. చైనా కంపెనీలు ప్రదర్శించిన హ్యూమనాయిడ్ రోబోలు.. వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారాయ్. వీటికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్. అచ్చం మనుషుల్లాగే డ్యాన్స్ చేయడం, గాల్లో పల్టీలు కొట్టడం.. జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయ్.
యూనీట్రీ రోబోట్రిక్స్, గాల్ బాట్, నోయిటిక్స్ మ్యాజిక్ ల్యాబ్స్ అనే నాలుగు చైనా స్టార్టప్ సంస్థలు.. తమ రోబో మోడల్స్‌ని ఈ షోలో ప్రదర్శించాయ్. కొన్ని మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ చేసి ఆకట్టుకున్నాయ్. ఇంకొన్ని రోబోలు కామెడీ స్కిట్స్ చేశాయ్. మరికొన్ని రోబోలు చేసిన డ్యాన్స్ షో.. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. గతేడాది కూడా యానీట్రీ రోబోల డ్యాన్స్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈసారి మరికొన్ని సంస్థలు తమ రోబోలతో విన్యాసాలు చేసి చూపించాయ్. ఇదే.. ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేసేస్తోంది. ఈ రోబోలు ట్రెండ్ అయిన తర్వాతే.. చాలా మంది రోబో థీమ్‌తో ఏఐలో వీడియోలు జనరేట్ చేయడం మొదలుపెట్టారు. వాటికి కొనసాగింపుగా సిద్ధం చేసినవే ఈ వార్ ఫేర్ రోబోలు. చూడటానికి అచ్చం నిజమైన దృశ్యాల్లా కనిపిస్తున్నప్పటికీ.. అవి, ఏఐలో క్రియేట్ చేసినవే. చాలా మంది ఈ యుద్ధం చేసే రోబోలను, తుపాకులు పట్టుకున్న రోబోలను నిజమైనవని అనుకుంటున్నారు. తెగ షేర్ చేసేస్తున్నారు. దాంతో.. చాలా మంది వీటిని చూసి మోసపోతున్నారు. నిజంగా.. చైనా తన ఆర్మీలో రోబోలని దించిందా? శత్రుసేనల్ని మట్టికరిపిస్తోందా? రోబోలకు కూడా ట్రైనింగ్ ఇచ్చేశారా? అనే చర్చ మొదలైంది. కానీ.. రియాలిటీ మాత్రం ఇలా ఉంది.
సోషల్ మీడియాలో ఏదైనా ఒక ట్రెండ్ మొదలైతే.. మిగతా వాళ్లంతా దాని చుట్టే తిరుగుతారు. అదే థీమ్‌తో వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంటారు. వీటిలో రియల్ వీడియోల కంటే.. ఫేక్ వీడియోలే ఎక్కువ షేర్ అవుతూ ఉంటాయ్. ఈ ఆర్మీ రోబోల విషయంలోనూ అదే జరిగింది. చాలామంది ఈ సీన్లన్నీ నిజమేననుకొని పొరబడ్డారు. రోబో సైన్యం దిగితే.. నిజమైన మనుషుల్ని పిట్టల్లా కాల్చేస్తారని నమ్మేశారు. ఆ వీడియోలు కూడా చూడటానికి అలా ఉన్నాయ్. అందువల్ల.. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీది నమ్మొద్దు. అలాగనీ.. అందులో వచ్చేవన్నీ ఫేక్ కాదు. రోబోలు మార్షల్ ఆర్ట్స్ చేయడం, డ్యాన్స్‌లు వేయడం వరకు నిజమే. కానీ.. ఆ తర్వాత యుద్ధ క్షేత్రంలో తుపాకులు పట్టుకొని రంగంలోకి దిగిన రోబోలు, ఆర్మీ జవాన్లని లెక్కలేకుండా కాల్చేస్తున్న రోబోల వీడియోలు నిజం కాదు. సోషల్ మీడియాలో వాస్తవం 30 శాతం ఉంటే.. మిగతా 70 శాతం అవాస్తవాలే ఉంటాయ్. పైగా.. ఇది ఏఐ జమానా. ఏది నిజమో, ఏది అబద్ధమో కనిపెట్టడం కాస్త కష్టమే. అయినాసరే.. విచక్షణతో వ్యవహరించాలి. చూసిన ప్రతిదాన్నీ నమ్మకుండా, గుడ్డిగా షేర్ చేయకుండా.. అసలు విషయమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియాలో కంటికి కనిపించేదంతా నిజం కాదని చెప్పడానికి.. ఈ రోబో ఆర్మీనే లేటెస్ట్ ఎగ్జాంపుల్.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రోబో సైన్యం వీడియోలు ఎంతలా ట్రెండ్ అయ్యాయో చూశాక.. మనమెంత అప్రమత్తంగా ఉండాలో చెబుతున్నారు నిపుణులు. ఏఐ సృష్టించే భ్రమల వెనుక ప్రమాదాలు దాగి ఉన్నాయ్. సోషల్ మీడియాలో కళ్లు చెదిరే విజువల్స్, అబ్బురపరిచే టెక్నాలజీ వీడియోలు చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. రోబోలు ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియోలు, సైన్యంపై ఫైరింగ్ జరుపుతున్న సీన్లు, యుద్ధక్షేత్రంలోకి దిగిన రోబో సైన్యాన్ని చూసి చాలా మంది ఇదంతా నిజమే అనుకున్నారు. పైగా.. చైనా అనేసరికి చాలా మంది వెంటనే నమ్మేశారు. కానీ.. తీరా చూస్తే.. అవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సృష్టించిన మాయాజాలం మాత్రమే. సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదని.. ఈ వీడియోలతో తేలిపోయింది.
ఒకప్పుడు కళ్లతో చూసింది నమ్మాలనే సామెత ఉండేది. కానీ, ఇప్పుడు కళ్లతో చూసే వీడియోలను కూడా అనుమానించాల్సిన పరిస్థితులు వచ్చాయ్. ఏఐ టూల్స్ ఉపయోగించి, వాస్తవానికి దగ్గరగా ఉండే వీడియోలను నిమిషాల్లోనే సృష్టించొచ్చు. డీప్ ఫేక్స్‌తో.. ఒకరి ముఖాన్ని మరొకరికి తగిలించి, వారు అనని మాటలను అన్నట్లుగా చూపిస్తున్నారు. అసలు ఉనికిలోనే లేని వ్యక్తులను, సైన్యాన్ని, యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. ఓ వీడియోని షేర్ చేయడం వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చైనా నిజంగానే రోబో ఆర్మీని తయారుచేసిందని, వాటికి సరైన శిక్షణ కూడా ఇచ్చేసిందని, అవి ఎంత భీకరంగా దాడి చేస్తాయో చూపించే దృశ్యాలు, వీడియోలు.. ప్రజల్లో అనవసరమైన ఆందోళన కలిగిస్తాయ్. తప్పుదోవ పట్టిస్తాయ్.
ఏఐ జనరేటెడ్ వీడియోలను కనిపెట్టడానికి కొన్ని లెక్కలున్నాయ్. ఏఐ వీడియోల్లో.. మనుషుల కనురెప్పలు ఆర్పే తీరు, చేతి వేళ్లు, వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అస్పష్టంగా ఉంటాయ్. సంచలన వార్తలుగా చలామణీలోకి వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు.. వాటిని ప్రసారం చేశాయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. అనుమానం ఉన్న వీడియో స్క్రీన్ షాట్‌ని.. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి.. దాని అసలు మూలాన్ని తెలుసుకోవాలి. టెక్నాలజీ పెరగడం ఎంత లాభమో, దానిలో అవాస్తవాలను ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల కలిగే నష్టం కూడా ఎక్కువే. అందువల్ల.. ఏదైనా కొత్త వీడియోని గానీ, ఫోటో గానీ చూసినప్పుడు.. దాన్ని ఇతరులకు పంపే ముందు ఒక్క నిమిషం ఆగి అది నిజమేనా? అని క్రాస్ చెక్ చేసుకోవడం ఇప్పుడెంతో అత్యవసరం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది.. పవర్‌ఫుల్ వెపన్. దాన్ని తప్పుడు సమాచారం కోసం వాడితే వినాశనమే. మనం ఎంత తెలివిగా టెక్నాలజీని వాడుకుంటామో, అంతకంటే తెలివిగా.. అవాస్తవాలను కనిపెట్టాలి.
రోబోలు సైన్యంలోకి ప్రవేశించడం అనేది ఇప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసే విషయమే. కానీ.. భవిష్యత్‌లో.. డ్యాన్స్‌లు, కుంగ్ ఫూ చేసే రోబోలు సరిహద్దుల్లోకి వస్తే యుద్ధం అనే మాటకు అర్థమే మారిపోతుంది. సైన్యంలో రోబోలు ఉంటే.. జీరో కాజువాలిటీస్ ఉంటాయ్. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల సంఖ్య తగ్గుతుంది. ట్యాంకులు, విమానాలు మాత్రమే కాదు నేరుగా శత్రువుతో పోరాడే ఇన్ఫాంట్రీ కూడా రోబోటిక్‌గా మారితే.. ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. పైగా.. మనుషులకు నిద్ర, ఆహారం, అలసట, భావోద్వేగాలు ఉంటాయ్. కానీ.. రోబోలకు అవేవీ ఉండవు. మైనస్ డిగ్రీల చలిలో అయినా, మండుతున్న ఎడారిలో అయినా రోబోలు అలసిపోకుండా, విసుగు చెందకుండా పహారా కాయగలవు. గురి తప్పని కాల్పులు, క్షణాల్లో శత్రువుని మట్టుబెట్టడం రోబోలకే సాధ్యం. నిజంగానే.. రోబోలు గనక సరిహద్దుల్లోకి ఎంట్రీ ఇస్తే.. ఈ వీడియోల్లో చూపించినట్లు మనుషుల కంటే వేగంగా స్పందిస్తాయ్. మనిషి.. ఒక సెకను నిర్ణయం తీసుకుంటే.. రోబో కొన్ని వందల సినారియోలని అనలైజ్ చేసి దాడి చేయగలదు. వాటిని ఎదుర్కోవడం సాధారణ సైన్యానికి దాదాపు అసాధ్యం.
అయితే.. రోబోలు సైన్యంలోకి వస్తే.. ఓ సవాల్ ఉంది. రోబోలకు యుద్ధ నీతి, న్యాయం, దయ లాంటివేవీ ఉండవు. టార్గెట్ కళ్ల ముందు ఉంటే.. టాస్క్ ఫినిష్ చేయడమే దానికి తెలుసు. ఒక వ్యక్తిని చంపాలా? వద్దా? అనే నిర్ణయం.. ఒక మెషీన్ తీసుకుంటే అది నైతికంగా కరెక్ట్ కాదు. ఇక.. రోబోలు సైన్యంలో చేరితే.. హ్యాకింగ్ ముప్పు కూడా ఉంది. శత్రుదేశం రోబోలని హ్యాక్ చేసి.. వారి సైన్యం మీదకే ఉసిగొల్పితే.. పరిస్థితులు పూర్తిగా మారిపోతాయ్. ఇది.. ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. అందువల్ల.. రోబోలు సరిహద్దుల్లోకి వస్తే యుద్ధం అనేది ఓ వీడియో గేమ్‌లా మారిపోయే ప్రమాదముంది. యుద్ధాలు అనేవి బటన్ నొక్కడం వల్ల మొదలై.. మళ్లీ బటన్ నొక్కితేనే ఆగిపోయేలా ఉండవు. మనిషి మెదడులో ఉండే విచక్షణ, సందర్భానికి తగ్గట్లుగా తీసుకునే నిర్ణయాలు.. రోబోలకు చేతకాదు. అది అంత ఈజీ కూడా కాదు. కాబట్టి, రోబోలు సైనికులకు సహాయకులుగా పనిచేయడానికి తప్ప.. యుద్ధ క్షేత్రంలో దిగటానికి ఏమాత్రం తగవనే వాదన వినిపిస్తోంది.
Story by: Anup, Big Tv