తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు తండ్లాడుతోంది. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలే దీనికి సరైన ఎంట్రీగా భావిస్తోంది. బీజేపీ ఊపుకు తగ్గట్టే.. అధిష్టానం కూడా ఇక్కడ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా సునీల్ బన్సల్‌ను నియమించింది. ఇది రెండోసారి ఆయనకు అవకాశం. తొలిసారి పార్టీని బాగానే ఊపు మీదకు తెచ్చినా.. బీఆరెస్‌తో బీజేపీ అంటకాగుతుందనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.
అందుకే పోటీ.. కాంగ్రెస్, బీఆరెస్ మధ్యే అనే మెసేజ్ పోయింది అప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అన్నట్టుగా ప్రచారం జరగాలంటే.. బీఆరెస్‌ను డమ్మీ చేసి తామే ప్రధాన ప్రతిపక్షం అని జనాలకు తెలియజేసేలా ఉనికి చాటుకోవాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది.
అందుకే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలలో ఒకటి కచ్చితంగా గెలిచి చూపాలని అనుకుంటున్నది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. నల్లగొండ- వరంగల్- ఖమ్మం నియోజకవర్గంపై బీజేపీకి పెద్ద ఆశలు లేవు. అందుకే రెండు గెలవాలనేది అత్యాశ కిందకే వస్తుందని, ఒకటి గెలిచినా చాలు.. జనం బీజేపీ గురించి చర్చించుకునే అవకాశం ఉంటుందనే భావనలో ఆ పార్టీ అధిష్టానం ఉంది.
అందుకే బన్సల్‌ను రంగంలోకి దింపింది. రీ ఎంట్రీ ఇచ్చిన బన్సల్ ఇవాళ కీలక భేటీ నిర్వహించారు. గ్రేటర్ ఎమ్మెల్సీని గెలుచుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు ఉండనున్నాయి. ఈ మేరకు కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ గతంలో బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఉన్న రాంచంద్రారావు గెలిచిన నేపథ్యం ఉంది. హైదరాబాద్‌లో బీజేపీకి కాస్త పట్టుంది.
ఇవి పట్టభద్రుల ఎన్నికలు కాబట్టి… మోడీ మానియా కూడా కలిసి వస్తుందనే అంచనాలో ఉందా పార్టీ. ఈ ఒక్క సీటు గెలవడం వల్ల.. రానున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ప్రభావం చూపొచ్చనే కోణం ఒకటైతే.. కీలకమైన జీహెచ్ఎంసీలో బీజేపీ సత్తా చాటేందుకు దీన్ని ట్రయల్ రన్‌గా ఉపయోగించుకోవచ్చనే వ్యూహం కూడా ఇందులో ముడిపడి ఉంది.
అందుకే బన్సల్ దీన్ని తొలి పరీక్షగా తీసుకున్నాడు. దీంట్లో గెలిచి చూపడం మూలంగా అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకానికి జీవం పోయడంతో పాటు.. ఇక్కడ గ్రూపు రాజకీయాలతో తలోదిక్కుగా ఉన్న సీనియర్లతో పార్టీ క్యాడర్‌లో నెలకొని ఉన్న నైరాశ్యాన్ని దూరం చేయడం కూడా బన్సల్ ప్లానింగ్‌గా కనబడుతోంది.
కానీ ఇదంతా ఈజీ కాదని కూడా బన్సల్‌కు తెలుసు. ఈ సీటుపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా చాలా సీరియస్‌గా దృష్టి పెట్టారు. నల్లగొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గాన్ని లోకల్‌గా బలంగా ఉన్న నాయకత్వానికి వదిలేశారు సీఎం. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మేనేజ్‌మెంట్ కీలక భూమిక పోషించనుంది. ఎవరు ఎక్కువగా పట్టభద్ర ఓటర్లతో టచ్‌లో తరుచుగా ఉంటారో.. వారిపై ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
ఇదే పనిగా పెట్టుకుని.. ఓటర్లతో టచ్‌లో ఉండే మేనేజ్‌మెంట్ విధానం నల్లగొండ, ఖమ్మం నాయకత్వంలో మెండుగా ఉంది. అందుకే దీనిపై సీఎంకు పెద్దగా టెన్షన్ లేదు. కానీ హైదరాబాద్- రంగారెడ్డి.. ఈ రెండు కీలకమైన జిల్లాలు కావడం.. ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో తన సొంత జిల్లా మహబూబ్‌నగర్ కూడా ఉండటంతో ఇది కచ్చితంగా గెలిచి తీరాల్సిన సీటుగా మారింది.
అందుకే సీఎం దీన్ని ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకున్న తరుణంలో.. బీజేపీ కూడా దీనిపైనే పట్టు బిగిస్తున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ నెలకొననుంది. బీఆర్‌ఎస్‌కు ఈ సీటుపై పెద్దగా ఆసక్తి ఉన్నట్టుగా కనిపించడం లేదు. నల్లగొండ- వరంగల్‌పై ఆశలు పెట్టుకున్నది. ఇక్కడ రాకేశ్‌రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి తోడు రాగా.. గెలిచేందుకు ఎదురీదుతోంది. ఒక్క సీటైనా గెలవకపోతే.. కొండంత రాగం తీసి అన్నట్టుగా అవుతుందనే గుబులు గులాబీ పార్టీలో ఉంది.
ఎందుకంటే.. ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా తీసుకుంటున్నామని హరీశ్ ప్రకటించి ఉన్నాడు. తమకు తాముగానే గిరి గీసుకుని బరిలోకి దిగింది బీఆర్ఎస్ పార్టీ.