కెన్యా రాజధాని నైరోబీలో 12 అంతస్తుల భారీ భవనం కూలిపోయింది.. కళ్లెదుటే నిర్మాణంలో ఉన్న భవనం.. క్షణాల్లో పూర్తిగా నేలకు ఒరిగిపోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని దుమ్ము ఆవరించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో భవనం కూలిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక పరుగులు పెట్టారు. నిర్మాణంలో ఉన్న భవనం కావడంతో అందులో కార్మికులు ఉండే అవకాశం లేకపోలేదు. శిథిలాల కింద ఎంతమంది నలిగిపోయారో.. ఎంతమంది ప్రాణాలు గాల్లో కలసిపోయాయో తెలియని పరిస్థితి..
భవనం కూలే ముందు కొంతమంది కార్మికులు పరుగులు తీసి బయటకు వచ్చినట్లు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. వెంటనే అలర్టై పలువురిని రక్షించి హాస్పిటల్‌కు తరలించారు. అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రెస్క్యూ చర్యలు చేపట్టింది. మరికొంతమంది కార్మికులు భవన శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు జేసీబీలు, ఆర్మీ బృందాలు విరామం లేకుండా శ్రమిస్తున్నారు.
Also Read: చదువుకున్న స్కూల్‌లోనే దారుణం.. ప్రిన్సిపల్‌పై మాజీ స్టూడెంట్స్ దాడి.. పాఠశాల డబ్బుతో జంప్!
కళ్లెదుటే 12 అంతస్తుల మేడ కూలిపోవడానికి కారణమేంటి..? కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా..? ప్లానింగ్ లేని నిర్మాణాలా..? లేదా అధికారుల అవినీతి దాహానికి అమాయక కార్మికుల ప్రాణాలు బలికావాల్సి వచ్చిందా..? భారీ బిల్డింగ్ కుప్పకూలడం వెనుక సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న జీవచ్ఛవాల ఆర్తనాదాలు.. నైరోబీలో వరుసగా జరుగుతున్న ఈ భవన ప్రమాదాలు.. మానవ తప్పిదాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.