ఇద్దరు డౌన్ టు ఎర్త్ లీడర్లు. కష్టపడి పైకి ఎదుగుతూ వచ్చిన బీసీ నాయకులు. ఇద్దరూ నిజామాబాద్ రాజకీయాలే కేంద్ర బిందువుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నవారే. ఈ ఇద్దరికీ దివంగత నేత, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ రోల్ మోడల్. డీఎస్‌ను ఆదర్శంగా తీసుకుని, ఆయన సహకారంతో అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చినవారే.
కానీ ఈ ఇద్దరి ప్రయాణం ఓ చోట కీలక మలుపు తిరిగింది. ఒకరికి అదృష్టం వరించగా.. ఒకరు రాజకీయాలకు తెరమరుగయ్యే పరిస్థితులు వచ్చాయి. లేటుగానైనా ఆ తెరమరుగు నేతకు మంచి పొజిషన్ ఇచ్చి గౌరవించింది అధిష్టానం. ఈ ఇద్దరి అదృష్టాల వెనుక ఓ కీలక నేత ఉన్నారు. ఇద్దరు బీసీలు.. అందులో ఇద్దరూ గౌడ్లు.. ఇద్దరి నేపథ్యమూ నిజామాబాద్ జిల్లే. మరి ఈ ఇద్దరి నేతల అదృష్టాన్ని మార్చిన ఆ నేత ఎవరు?
ఆ ఇద్దరు బీసీ నేతలు..
ఒకరు టీపీసీసీ చీఫ్ మహేశ్ కమార్ గౌడ్.. మరొకరు ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC)చైర్మన్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మధుయాష్కీ గౌడ్… మరి ఈ ఇద్దరి రాజకీయ పదవుల అదృష్టం వెనుక ఉన్న ఆ కీలక నేత…??
సీఎం రేవంత్‌రెడ్డి. అవును.. రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు గౌడ్ల అదృష్టాలను మార్చేశారనే చెప్పాలి. అప్పటి వరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. మధుయాష్కీ ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. సీనియారిటీ విషయంలో మహేశ్‌తో పోల్చితే .. మధు చాలా జూనియర్. కానీ అనతికాలంలో రాహుల్ సహా ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలను ఏర్పర్చుకునే విషయంలో సక్సెసయ్యారు. మధుపై ఢిల్లీ పెద్దలకు ఓ నమ్మకం.
కానీ మధుయాష్కీకి రాజకీయ లౌక్యం తక్కువనే చెప్పాలి. ముక్కుసూటి తనం కూడా ఆయనను రాజకీయంగా ఎదగనీయకుండా ఆపిందంటారు. ఉన్నదున్నట్టుగా పైకే మాట్లాడటం, పార్టీ అంతర్గత వ్యవహారాలను, లోపాలను కూడా బాహాటంగా వెళ్లగక్కడం ఆయన స్టైల్. అదే ఆయన బలహీనత, బలం కూడా.
కానీ ఆ వ్యక్తిత్వమే ఆయనకు పదవులు దక్కకుండా కొంతకాలం బ్రేక్ వేసిందనే చెప్పాలి. దీనికి తోడు ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఆటంకాలుగానే మారాయి. అప్పటి వరకు నిజామాబాద్ ఎంపీగా పనిచేసి.. అదే రాజకీయ కేంద్రంగా ఉంటూ వస్తున్న ఆయన.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాక్షేత్రం మార్చారు. ఎల్బీనగర్ ఎంచుకున్నారు. అందుకే పరాజయం పాలయ్యారు.
మధు గెలిచి ఉంటే .. పరిస్థితి వేరేలా ఉండేదేమో..! ప్రమాదంలో ప్రమోదంలా ఇదీ ఆయన మంచికే జరిగిందనుకోవాలి. టీపీసీసీ కోసం ఇద్దరూ తీవ్రంగా పోటీ పడ్డారు. రేవంత్ మహేశ్‌కే ఓటేశారు. దీంతో ఆ పదవి మహేశ్‌కు వరించగా.. అప్పటి దాకా రాజకీయాల్లో కీలకంగా ఉంటూ వస్తున్న మధుయాష్కీ ఒక్కసారిగా తెరమరుగై పోయారు.
చాలా కాలం తరువాత ఆయనకు అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. ఈ పదవీ అదృష్టం వెనుక కూడా రేవంత్ కీ రోల్ పోషించారు. దీంతో ఈ ఇద్దరు గౌడ్ల అదృష్టాన్ని రేవంత్ మార్చారని ఆ పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC)చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి గాంధీభవన్‌కు విచ్చేసిన మధుయాష్కి గౌడ్ ను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ కు మహేష్ కుమార్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందూరు రాజకీయ నేపథ్యంగా ఎదిగిన ఈ ఇద్దరు బీసీ బిడ్డలు ఇలా ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పదువుల్లో రాణిస్తున్నారు.