రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. సర్కార్ మూడేండ్లు పూర్తి చేసుకున్న తరుణంలో వచ్చిన ఈ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే… అది మున్ముందు పార్టీ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉంటుందనే భావనలో సర్కార్ ఉంది. అందుకే చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
పట్టభధ్రులకు సంబంధించిన ఎన్నికలు కావడంతో తెర వెనుక ఎక్కువగానే కసరత్తు చేస్తోంది. మిత్రపక్షాల సపోర్టు తీసుకోవడంతో పాటు.. సీపీఎం మద్దతును కూడా కోరింది కాంగ్రెస్. అధికార పార్టీ అభ్యర్థనపై సీపీఎం కూడా సానుకూలంగానే స్పందించేలా కనిపిస్తున్నది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నియోజకవర్గంతో పాటు.. నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇద్దరు రెడ్లకే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇది కొంత ప్రతికూల ఫలితాలకు తావిస్తుందని గమనించిన అధిష్టానం.. రానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు ఇవ్వాలని యోచిస్తున్నది.
అయితే, ఈ రెండు స్థానాల్లో గెలుపు కోసం ఎన్నికల ప్రచార అస్త్రంగా కోదండరామ్‌ను వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కోదండరామ్‌కు మంచి పేరుంది. యువతలో ఆయనకుండే మర్యాద, క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో ఆయనదే కీలక పాత్ర. ఉద్యమకారులు కూడా కోదండరామ్ నేతృత్వాన్ని నమ్ముతున్నారు. ఇప్పటికే కొంత ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిన తరుణంలో.. క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉన్న కోదండరామ్‌ను ముందు పెట్టి ఎన్నికల ప్రచారానికి వెళ్లడం మూలంగా యువతను ఆకర్షించవచ్చనే వ్యూహంలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది.
నల్లగొండ- వరంగల్- ఖమ్మం నియోజకవర్గం నుంచి కోదండరామ్ పోటీ చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ సర్కార్‌లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని పొందారు. బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉండి.. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా, ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి కీలక మెంబర్‌గా, యువతకు వెన్నుదన్నుగా ఉంటూ అన్ని పక్షాలతో మంచి సంబంధాలను నెరుపుతున్నారు కోదండరామ్.
అప్పుడప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై కూడా ఆందోళనలకు ఆయన మద్దతుగా ఉంటున్నారు. బాధిత పక్షాన నిలుస్తూ సమస్య పరిష్కారంలో తనదైన గొంతుకను వినిపిస్తున్నారు. అందుకే ఆయన పట్ల అన్ని సెక్షన్లలో అంతో ఇంతో నమ్మకం ఉంది. కాంగ్రెస్‌తో కలిసి ఉన్నా.. తన ప్రత్యేకతను, సిద్దాంతాలను దూరం చేసుకోలేదనే అభిప్రాయాలతో ఉన్నారు జనం కూడా.
అవసరమైతే సర్కార్‌ను నిలదీసే క్రమంలో.. తోడు వస్తారనే నమ్మకాన్ని కూడా ప్రోది చేసుకున్నారు ప్రొఫెసర్ సర్. అందుకే కోదండరామ్‌ను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కీలక అస్త్రంగా వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నదనే సంకేతాలు అందుతున్నాయి.