E-Paper
Advertisement

Epstein Files: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ కుంభకోణం.. బిల్ క్లింటన్ , ట్రంప్ వీడియోలు లీక్..

Epstein Files: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌  కుంభకోణం.. బిల్ క్లింటన్ , ట్రంప్ వీడియోలు లీక్..

Epstein Files: అమెరికాలో ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ కలకలం కొనసాగుతోంది. డెడ్‌లైన్‌ దగ్గర పడుతుండడంతో.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధం ఉన్న ఫొటోలను, కీలక పత్రాలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలో.. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌ నుంచి ఇప్పటికే రిలీజ్‌ అయిన కొన్ని ఫైల్స్‌ మాయమవడం సంచలనంగా మారింది. ఈ ఫైళ్లలో.. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోటో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ విషయం వరల్డ్ వైడ్ హాట్ డిబేట్‌కు దారితీసింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై అమెరికాలో నడుస్తున్న చర్చేంటి?

అమెరికాలో కలకలం రేపుతున్న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్‌ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి.. 24 గంటల్లోనే 16 ఫైళ్లు మాయమవడం కలకలం రేపింది. అమెరికా న్యాయశాఖ వెబ్‌పేజీ నుంచి అదృశ్యమైన ఈ ఫైళ్లలో.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫొటో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం అమెరికాలోనే కాదు.. టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారింది.

ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి కీలక పత్రాలు విడుదల

ఎప్‌స్టీన్‌ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. అందులో మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, పాప్‌ స్టార్‌ మైఖేల్‌ జాక్సన్‌ లాంటి ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. ఇవి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే.. ఇంకొన్ని ఫైళ్లు మాయంకావడం చర్చనీయాంశంగా మారింది. మిస్ అయిన 468 నెంబర్ ఫైల్‌లో.. ట్రంప్‌‌తో పాటు ఆయన భార్య మెలానియా, ఎప్‌స్టీన్‌, అతని క్రైమ్ పార్ట్‌నర్ గిస్లైన్‌ మాక్స్‌వెల్‌‌కి సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు బాధితుల నుంచి ఎఫ్‌బీఐ తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మెమోలు లాంటి.. కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వైట్ హౌస్ వెబ్ పేజీ నుంచి ఫైళ్లు అదృశ్యం

మరోవైపు.. ఆ ఫైల్స్‌ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేదానిపై వైట్‌హౌజ్‌ ఇప్పటిదాకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వాటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా? పొరపాటున జరిగిందా? మరేదైనా కారణంతోనే.. కనిపించకుండా చేశారా? అనే విషయాన్ని.. న్యాయశాఖ కూడా స్పష్టం చేయలేదు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. కానీ.. వెబ్ పేజీ నుంచి అదృశ్యమైన ఫైళ్ల గురించి ఇంటర్నెట్‌లో మాత్రం హాట్ డిబేట్ మొదలైంది. హౌస్‌ ఓవర్‌సైట్‌ కమిటీలోని డెమోక్రాట్లు.. ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. మాయమైన ఫైల్స్‌లో ట్రంప్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉందని ఆరోపిస్తున్నారు. అటార్నీ జనరల్‌ పామ్‌ బోందీ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకా ఏం కప్పిపుచ్చాలనుకుంటున్నారు? అమెరికన్‌ ప్రజలకు పారదర్శకత అవసరమని కామెంట్ చేస్తున్నారు.

సాక్ష్యాలు లేవని న్యాయశాఖ స్పష్టం

ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి న్యాయశాఖ విడుదల చేసిన ఫైళ్లలో.. ట్రంప్‌కు సంబంధించిన ఫోటోలు, డాక్యుమెంట్లు పెద్దగా లేవు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ ప్రస్తావన, వారికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. హాట్ టబ్బులో.. అమ్మాయిలతో బిల్ క్లింటన్ ఉన్న ఫోటోలు, సెక్స్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. గిస్లైన్ మాక్స్‌వెల్, మైక్ జాగర్, వూడీ అలెన్, నోమ్ ఛామ్‌స్కీ లాంటి ప్రముఖుల ఫోటోలు కూడా ఈ ఫైల్స్‌లో ఉన్నాయి. రాబోయే కొన్ని వారాల పాటు ఫైల్స్ రిలీజ్ చేస్తుంటామని.. డిప్యూటీ అటార్నీ జనరల్ తెలిపారు. బాధిత యువతుల ఫొటోలు, పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అమెరికా విదేశాంగ నీతికి, జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ఫైళ్లని, దర్యాప్తునకు భంగం కలిగించే సమాచారాన్ని విడుదల చేయబోమన్నారు. అమెరికాలోని ప్రముఖులను.. ఎప్‌స్టీన్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడనే ఆధారాలేవీ తమ రివ్యూలో దొరకలేదని న్యాయ శాఖస్పష్టం చేసింది. అయితే.. వేలఏళ్ల నాటి భారత ఆయుర్వేద పద్ధతులను.. ఎప్‌స్టీన్‌ తన క్లయింట్ల కోసం ఉపయోగించేవారని ది ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌ మసాజ్‌ అనే పేరుతో అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో తెలిపింది. కానీ.. ఈ ఫైళ్ల విడుదలపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు సాక్ష్యాలు బయటికి రాకుండా.. ట్రంప్‌ సర్కారు అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నారు.

పారదర్శకతకు ట్రంప్ ఒప్పందం,

మీటూ మూమెంట్ నడుస్తున్న టైంలో.. ఎప్‌స్టీన్‌ ఫైల్స్ తెర మీదకు వచ్చింది. ఇది ఆ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో.. ఎప్‌స్టీన్‌ టోటల్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, ఫ్లైట్‌ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలోనే దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వాటిని బయటపెట్టాలనే డిమాండ్ అమెరికా చాలా ఏళ్లుగా ఉంది. అయితే.. డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్‌ వివరాలు బయటకొస్తాయని అంతా భావించారు. కానీ.. అలా జరగలేదు. ఇందుకు.. ఎప్‌స్టీన్‌ కస్టమర్ల జాబితాలో ట్రంప్‌ కూడా ఉండటమే కారణమని.. డెమొక్రాట్లు ఆరోపిస్తూ వచ్చారు. అయితే.. ఒకప్పుడు జెఫ్రీతో స్నేహం ఉండేదని.. అతని అరెస్ట్ తర్వాత దూరం పెట్టానని ట్రంప్ చెబుతూ వచ్చారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌ని.. పారదర్శకంగా రిలీజ్‌ చేయించేందుకు తాను సిద్ధమంటూనే.. ఆలస్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. సొంత రిపబ్లికన్‌ పార్టీ నేతల నుంచి కూడా డిమాండ్‌ తలెత్తడంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. ఆ ఫైల్స్‌ని బయటపెట్టాలని ఆదేశిస్తూ.. కాంగ్రెస్ బిల్లుని ఆమోదించడంతో.. ఇటీవలే ట్రంప్ దానిపై సంతకం పెట్టారు. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్.. అన్ని ఫైళ్లను విడుదల చేయాల్సి ఉంది.

ఎప్‌స్టీన్ రహస్య ఫైల్స్

మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, వందలాది ఫోటోలను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. ఇందులో.. ఆయుర్వేదం, వివిధ రకాల మసాజ్‌ పద్ధతుల గురించి ప్రస్తావన ఉంది. అలాగే.. ట్రంప్ సహా కొందరు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు.. ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోజులు, ఆయన ఐల్యాండ్‌లో సేదతీరిన ఫోటోలు బయటకొచ్చాయి. డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్‌కి సంబంధించి చాలా ఫోటోలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సహా కొందరు హాలీవుడ్ హీరోలు కూడా.. జెఫ్రీ ఎప్‌స్టీన్ పార్టీలకు హాజరైన ఫోటోలు కూడా.. విడుదలైన ఫైల్స్‌లో ఉన్నాయి. ఇప్పటిదాకా రిలీజ్‌ అయిన ఫైల్స్‌లో.. డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ.. 16 ఫైళ్లు మిస్ అవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలేంటి.. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం? ఈ సెక్స్ స్కామ్.. ఇంత సంచలనం సృష్టించడానికి కారణమేంటి? ఇది.. ఒక వ్యక్తి చేసిన నేరమేనా? మరేదైనా ఉందా? అమెరికా రాజకీయాల్లోనే కాక.. వరల్డ్‌వైడ్ ఎప్‌స్టీన్‌ సెక్స్ కుంభకోణంపై డిబేట్ మొదలవడానికి రీజన్లేంటి? అసలు.. జోఫ్రీ ఎప్‌స్టీన్ స్టోరీ ఏంటి? అతను చేసిన నేరమేంటి?

వందల మైనర్లపై కేసు.. జెఫ్రీ ఎప్‌స్టీన్ వివాదం

జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యంత వివాదాస్పదమైన కేసు. ఇది కేవలం ఓ వ్యక్తి చేసిన నేరం మాత్రమే కాదు. ఇందులో అమెరికాలోని అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, హాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు రావడం వల్లే.. వరల్డ్ వైడ్ ఇంత చర్చనీయాంశమైంది. అమెరికన్‌ ఫైనాన్షియర్‌, ప్రముఖ ఇన్వెస్టర్‌ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌‌కు.. అగ్రరాజ్యంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలుండేవి. ఎప్‌స్టీన్ దశాబ్దాల పాటు వందలాది మంది మైనర్ బాలికలను ట్రాప్ చేసి.. వారిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలున్నాయి. తక్కువ వయసున్న అమ్మాయిలను మోసం చేసి తీసుకురావడం, వారికి డబ్బు ఆశ చూపడం ద్వారా ఒక పెద్ద సెక్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ని నడిపాడు. ఈ క్రైమ్‌లో ఇతనికొక పార్ట్‌నర్ కూడా ఉంది. ఆవిడే.. గ్లైసేన్ మాక్స్‌వెల్. ఈవిడ.. ఎప్‌స్టీన్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్. అమ్మాయిలను ఎంపిక చేయడం, వారిని లైంగికంగా సిద్ధం చేయడం లాంటి పనుల్లో.. కీలకపాత్ర పోషించినట్లు తేలడంతో కోర్టు శిక్ష విధించింది.

ఎప్‌స్టీన్ మరణం చుట్టూ అనేక అనుమానాలు

కరేబియన్ సముద్రంలో ఎప్‌స్టీన్‌కు సొంతంగా లిటిల్‌ సెయింట్‌ గేమ్స్‌, గ్రేట్‌ సెయింట్‌ గేమ్స్‌ అనే రెండు దీవులుండేవి. ఇక్కడికి.. తన సంపన్న మిత్రులను తీసుకొచ్చి.. మైనర్ అమ్మాయిలతో వారికి లైంగిక సంబంధాలు ఏర్పరిచాడనే ఆరోపణలున్నాయి. అలా.. చాలా ఏళ్ల పాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ రాజకీయ నాయకులు, బిజినెస్ టైకూన్లు, సెలబ్రిటీలకు ఎప్‌స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని.. ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గ్లైసేన్ మాక్స్‌వెల్ సహకరించారనే అభియోగాలున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్‌ అయ్యి.. కొంతకాలం తర్వాత విడుదలయ్యాడు. మొదటిసారి అతనిపై ఆరోపణలు వచ్చినప్పుడు.. అప్పటి అధికారులతో ఓ డీల్ కుదుర్చుకొని తక్కువ శిక్షతో బయటపడ్డాడు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్‌ అయ్యాడు. 2019లో మరోసారి ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ని అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతుండగానే.. 2019 ఆగస్టులో న్యూయార్క్ జైల్లోనే.. ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు అధికారులు ప్రకటించారు. అతని మరణం చుట్టూ ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి.

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌‌కు ఇబ్బందికరం

ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు కొంత ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా ఫైల్స్ మిస్ అవడంతో.. అందరి కళ్లు ట్రంప్ వైపే చూస్తున్నాయ్. గత నవంబర్‌లోనే ట్రంప్ స్వయంగా.. ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్‌పై సంతకం చేశారు. డిసెంబర్ 19 డెడ్‌లైన్ నాటికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ఫైల్స్‌లో చాలా వరకు బ్లాక్ అవుట్ చేసి ఉండటం, కొన్ని ముఖ్యమైన ఫైల్స్ వెబ్‌సైట్ నుంచి అదృశ్యం కావడం వివాదాస్పదమైంది. దీనివల్ల.. ట్రంప్ ప్రభుత్వం ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో.. ట్రంప్ తన ఫోటోలను తొలగించడం వల్ల.. ట్రంప్ తన ప్రతిష్టను కాపాడుకునేందుకు అధికారాన్ని ఉపయోగిస్తున్నారా? అనే అనుమానాలు.. ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ తన వాగ్దానాన్ని నిలబట్టుకోలేదనే వాదన

కానీ.. ట్రంప్ మద్దతుదారులలో చాలా మంది ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌లోని అసలు దొంగలను బయటపెట్టాలని కోరుతున్నారు. ఫైల్స్ సరిగ్గా విడుదల కాకపోతే, ట్రంప్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదనే వాదన మొదలవుతుంది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు కూడా ఫైల్స్ పూర్తిగా విడుదల చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫైల్స్ చుట్టూ మొదలైన వివాదాన్ని.. డెమోక్రాట్లు రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం నిజాలను తొక్కిపెడుతోందనే ప్రచారం మొదలుపెట్టారు. ఇది.. ట్రంప్ పాలనకు ఓ మచ్చలా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి.. ట్రంప్‌పై ఎలాంటి నేరారోపణలు రుజువు కాలేదు. కానీ.. ఫైల్స్ విడుదలలో పారదర్శకత లేకపోవడం.. ట్రంప్‌ని ఇరకాటంలో పడేస్తోంది.

Story By Anup, Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×