ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దయచేసి జీతభత్యాల మీద ఆందోళన పడకండి.. ఆందోళన చేయకండని కోరారు. ప్లీజ్ వద్దు అని ఆయన ఓ రకంగా ఉద్యోగులను బ్రతిమిలాడినట్టే మాట్లాడారు. ఇవాళ జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన ఉద్యోగుల సమస్యలపై సమ్మెబాటనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ సభలో.. తనను మధ్యమధ్యలో ఉద్యోగులు బెదిరిస్తున్నారని, కానీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవడం లేదని కొంత అసహనం వ్యక్తం చేసిన సీఎం.. అప్పులు తిప్పలన్నీ వారి ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ మాత్రం ఆయన శాంత స్వరూపమే కనిపించింది. పరిస్థితిని మరోసారి గుర్తు చేసి, ఉద్యోగులను రిక్వెస్టు చేసే దోరణిలోనే సీఎం ప్రసంగం కొనసాగింది.
రెండేళ్ల పాటు ఆగాలన్నారు. సీఎం ఉద్దేశం.. ఎన్నికలకు ఓ ఆరు నెలల ముందు వరకు తనను వదిలేయాలని, అప్పటి వరకు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబెట్టి మీ ముందుకు వస్తానని ఉద్యోగులను కోరారు. మీ భవిష్యత్తు, జీత భత్యాల విషయం నాకొదిలేయండి.. నేను చూసుకుంటాను.. మాట తప్పితే.. నేను కూడా ఎన్నికల పరీక్ష రాయాల్సి ఉంటుంది కదా..? అప్పుడు మీరు వంద మార్కులేస్తారా? జీరో మార్కులేస్తారా? మీ ఇష్టం అని వేడుకున్నట్టుగానే మాట్లాడారు.
ఉపాధ్యాయులే ఆందోళనకు పిలుపు ఇచ్చి రోడ్డెక్కతే విద్యార్థులేమనుకుంటారని, మంచి మెసేజ్ పోదని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యార్ధుల బంగారు భవిష్యత్‌పై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని, మీ భవిష్యత్ నేను చూసుకుంటానని మాటిచ్చారు. ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, మధుసూదన్‌లను కూడా సీఎం రిక్వెస్టు చేశారు. వచ్చి చర్చించాలన్నారు. కయ్యానికి కాలు దువ్వే విధంగా వారి వైఖరి ఉందనే విధంగా మాట్లాడిన సీఎం.. అలాంటి విధానాలు వద్దని, సామరస్యంగా చర్చించుకుందామని ఆహ్వానించారు.
దేశానికే తెలంగాణ విద్యను ఓ రోల్ మోడల్‌గా నిలపాలనే తన ఆశయాన్ని గ్రహించి.. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సహకరించాలని కోరారు. విద్యాశాఖ మంత్రిగా, సీఎంగా మీకు ఈ వేదికగా మాటిస్తున్నా.. మాట తప్పను.. రెండేళ్లు నన్ను వదిలేయండి..! అని ఆయన రిక్వెస్టు చేసిన విధానం చర్చకు వచ్చింది.
కానీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ విజ్ఞప్తిని స్వీకరిస్తారా? మీ రాజకీయాలతో మాకేం పని అంటారా? మా జీతాలు, మా జీవితాలు మాకు ముఖ్యమనే దోరణిలోనే వారుంటారా? అనే చర్చ కూడా నడుస్తున్నది. మరోవైపు ఉద్యోగులు.. ఈసారి సీఎంపై తీవ్ర ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పుడు సీఎం హామీని వారెలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.