TCS HyperVault: ప్రస్తుతం మనదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. నేటి సాంకేతిక ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. ఈ రేసులో భారత్ వెనకబడిపోకుండా ఉండేందుకు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఒక భారీ ప్లాన్ వేసింది. అదే హైపర్‌వాల్ట్ (HyperVault) ప్రాజెక్ట్. మన హైదరాబాద్‌తో పాటు నవీ ముంబై, చెన్నై నగరాలలో గిగావాట్ స్థాయిలో ఏఐ డేటా సెంటర్లను నిర్మించడానికి TCS శ్రీకారం చుట్టింది. విశేషమేమిటంటే.. ఈ మొత్తం ప్రాజెక్టులో మన భాగ్యనగరం అత్యంత కీలకమైన కేంద్రంగా మారబోతోంది.
ఈ డేటా సెంటర్ల నిర్మాణానికి అయ్యే వ్యయం దాదాపు 6.5 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.57,600 కోట్లు. ఇది ఏదో చిన్న ప్రాజెక్ట్ అనుకుంటే పొరపాటే. ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించేందుకు వేసిన బలమైన పునాది ఈ ప్రాజెక్ట్. దీని కోసం TCS నిధులతో పాటు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPGతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా TPG సుమారు ఒక బిలియన్ డాలర్లు (రూ.8,820 కోట్లు) పెట్టుబడి పెడుతోంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ, అప్పుల ద్వారా సమకూర్చుకోనున్నారు.
Also Read: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!
సమాచార భద్రత, స్థానిక డేటా నిబంధనలు మనదేశంలో చాలా కీలకమైన అంశాలు. హైదరాబాద్ నగరంలో ఉన్న అద్భుతమైన ఫైబర్ కనెక్టివిటీ, నిరంతర విద్యుత్ సరఫరా, సాంకేతిక వాతావరణం TCSను ఆకట్టుకున్నాయి. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వ ఐటీ విధానాలు కూడా అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా ప్రపంచ స్థాయి ఏఐ మోడళ్లను రన్ చేయడం, అంతర్జాతీయ క్లౌడ్ సంస్థలకు సేవలు అందించడం టీసీఎస్‌కు సులువవుతుంది. ఐటీ ఉద్యోగులకు, టెక్ ప్రేమికులకు ఇది నిజంగా తీపి కబురు.
ఇప్పటివరకు మనం చూసిన సాధారణ డేటా సెంటర్ల కంటే ఇవి పూర్తిగా భిన్నమైనవి. ఏఐ ప్రాసెసింగ్‌కు భారీ ఎత్తున విద్యుత్, అత్యంత వేగవంతమైన గ్రాఫిక్స్ కార్డ్స్ (GPUs) అవసరం. ఇవి పనిచేసేటప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది. దానిని తగ్గించడానికి ఈ కేంద్రాల్లో డైరెక్ట్-టు-చిప్ (D2C) లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. అంటే ప్రాసెసర్ల వేడిని నేరుగా ద్రవ పదార్థాలతో తగ్గించే విధానం అన్నమాట. అంతేకాకుండా.. పర్యావరణానికి హాని కలగకుండా గ్రీన్ ఎనర్జీ విధానంలో ఇవి పనిచేస్తాయి.
ఈ గిగావాట్ ప్రాజెక్ట్ ఒకే రోజులో పూర్తయ్యేది కాదు. దీనిని దశలవారీగా నిర్మించి, 2028 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని TCS లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ కేవలం ఐటీ సేవలకే కాకుండా, గ్లోబల్ ఏఐ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. స్థానికంగా ఉన్న ఎంతోమంది ఇంజనీర్లకు, యువతకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆసియాలోనే అత్యుత్తమ ఏఐ హబ్‌గా మన హైదరాబాద్ ఎదగడానికి ఈ హైపర్‌వాల్ట్ ప్రాజెక్ట్ ఒక పెద్ద మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: వావ్ అనిపించే ఫీచర్లతో Pixel Watch 5 Stephen Curry Edition సేల్ షురూ.. ధర ఎంతంటే?