కండిషన్స్ అప్లై.. అన్నట్టుగానే మాట్లాడాడు కేటీఆర్. అదే.. జంతర్‌మంతర్ వద్దకు వెళ్లి కాక్రోచులకు సంఘీభావం తెలిపేందుకు సార్ కూడా రెడీగా ఉన్నాడు. వస్తాడు. మీకు మద్దతుగా ఉంటాడు.. అని నిన్న కేటీఆర్ ఇందిరాపార్క్ వద్దకు వెళ్లి ఢిల్లీ విద్యార్థులకు సంఘీభావం తెలపడంతో పాటు… మోడీ మెడలు వంచినం.. తెలంగాణ తెచ్చినం.. అందుకే మాకు భయం లేదు.. మీతో కలిసి పోరాడుతాం.. సారు కూడా వస్తాడు.. అని అన్నాడు.
కానీ చివరలో అవసరమైతే.. అనే కండిషన్ అప్లై లాగా ఓ ట్యాగ్ ఇచ్చి వదిలాడు. దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓ వైపు కేటీఆర్ అంటాడు… మేము రాలేము.. రాలేకపోతున్నాము.. కారణం.. అక్కడికి వస్తే పార్టీ ముద్రవేస్తారు మీకు.. మీ నిజమైన పోరాటాన్ని మలినం చేస్తారని ఏవో సాకులు వెతుక్కున్నాడు. అదే మీటింగులో మీ ఉద్యమానికి కేసీఆర్ సంఘీభావంగా ఉంటాడు.. మీతో కలిసి నడుస్తాడు.. అని కూడా చెప్పాడు. అంటే తనకు వెళ్లాలని లేదు. కేసీఆర్ పేరును తీసుకురావాలి కాబట్టి.. ఏదో పైకి అలా అని ఉంటాడు విద్యార్థులకు కొంచెం ఊపునిచ్చేందుకు.. అంతే గానీ ఆయనేంటీ.. ఢిల్లీ వెళ్లి కాక్రోచులకు మద్దతు తెలపడం ఏంటీ..? అని అంతా అనుకుంటున్నారు.
మనవడికి ఓ చిన్న గాయమైనా.. ఆస్పత్రికి వచ్చి పలకరించి.. పరామార్శించి.. దీవించి వెళ్తారే తప్ప.. రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా చూస్తూ ఉండిపోతాడంతే. రైతుల సమస్యలు రానీ, రైతులు ఆత్మహత్యలు చేసుకోనీ.. విద్యార్థులు ఆగం గానీ, నిరుద్యోగులు రోడ్లెక్కనీ.. అలా చూస్తూ ఉంటాడు. చెబితే విన్నారా? ఇకనైనా బుద్ది వచ్చిందా? చెంప లేసుకుంటారా? నేను చెప్పినా వినలేదు కదా.. అనుభవించండి.. ! అనే విధంగా మాట్లాడి ఇంకా బాధపెడతాడు తప్ప బయటకు రాడు. ఆయన రావాలంటే ఓ పెద్ద తలకాయ పార్టీలో చేరాలి. అదీ కాంగ్రెస్ నుంచి.. అది పార్టీకి బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి.. తను ఓ పే..ద్ద బహిరంగ సభ పెట్టి అందులో పాల్గొని అప్పుడు అన్ని విషయాలు అక్కడ ఆ వేదికగా మాట్లాడి కడిగేస్తాడన్నమాట.
కేసీఆర్ బయటకు రావాలంటే ఎవరినైనా కాంగ్రెస్ నుంచి బీఆరెస్ పార్టీలో చేరమని రిక్వెస్ట్ చేయండి.. అంతేగానీ, ఇలా చీటికి మాటికి, మాటికీ చీటికి.. రమ్మంటే ఆయన రాడు. కేసీఆర్ అలకపాన్పెక్కాడు. మళ్లీ ఎన్నికల దాకా దిగడు.అప్పటి వరకు జనాలకు బాగా బుద్ది వచ్చి.. రా కేసీఆర్.. రా.. రా అని పిలుస్తారు. అప్పుడు వచ్చి ఎన్నికల్లో ఓట్లేపించుకుని వెళ్లిపోతాడన్నమాట. మరి ఇక్కడికే రానోడు.. ఢిల్లీకి పోతడా..? జంతర్‌మంతర్ దగ్గర తన ప్రసంగ మంత్రం ఇస్తడా? మోడీని ఎడాపెడా చెడామడా తిడతాడా? ఇప్పుడంత అవసరమా? అసలే పార్టీ పరిస్థితి బాగాలేదు. రేపు మోడీతోనే పని పడుతుండొచ్చు.. ఎంతైనా కేసీఆర్ రాజకీయ చాణక్యుడు కదా..? ఏవైనా అంచనాలు వేయగలగుతాడు.
కేటీఆర్ చెప్పంగనే .. పోలోమని ఢిల్లీ బాట పట్టేందుకు ఆయనేమన్నా ఖాళీగా ఉన్నాడా? అందుకే కేటీఆర్‌కు కూడా డౌట్ వచ్చే అవసరమైతే.. అని అన్నాడు. ఎందుకైనా మంచిది తప్పించుకోవడానికి పనికి వస్తుందని. అందుకే కేసీఆర్ ఢిల్లీ పోవచ్చు.. పోకపోవచ్చు.. మే బీ.. మే నాట్ బీ..! వస్తాడని అనుకోవద్దు.. రాడనీ భావించొద్దు.. రాకపోయినా బాధపడొద్దు.. రావాలని కోరుకోవద్దు.. !