బ్రేకింగ్ న్యూస్ కోసం మనం ఎంతలా ముఖం వాచిపోయి ఉన్నామో పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల మరణం అంటూ తప్పుడు వార్త చేరవేసిన విషయంలో మరోసారి నిరూపితమైంది. ఎవరైనా ఆకస్మాత్తుగా చనిపోయిన వార్త తెలిసి అంతా తల్లడిల్లుతాం. అయ్యో పాపం.. చిన్న ఏజ్‌లోనే కన్నుమూశాడే.. అని సానుభూతి తెలుపుతాం. పార్టీలకతీతంగా. పరిచయాలకు సంబంధం లేకుండా. తెలిసి ఉన్న వ్యక్తైతే చాలు.
అదీ ఓ రాజకీయ నాయకుడైతే.. అందరికీ తెలిసే ఉంటాడు కాబట్టి… కొందరికి తెలియకపోయినా… వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేసి విచారం వ్యక్తం చేస్తాం. కానీ బ్రే .. కింగులకు ఇవన్నీ పట్టవు. ఆస్పత్రి పోయాడా? చచ్చాడా? డాక్లర్లేమంటున్నారు..? వీటిపై క్లారిటీగా తెలుసుకునే లోపే.. ఎవడో బ్రేకింగు ఇచ్చేస్తాడు. అందరికంటే నేను ముందు చంపాలి.. అని. ఆ చంపేసినోడిని చూసి .. ఇంకొకడు టకీటకీమని చంపేసి దీనిపై ఓ విశ్లేషణ కూడా చేస్తాడు.
ఇంకొకడు.. పుట్టుపర్వోత్తరాలన్నీ ముందేసుకుని వళ్లెవేస్తాడు.మొత్తానికి మేమే ముందు చంపినమంటే.. మేమే ముందు చంపినమనే పోటీలో ఆ బ్రే .. కింగులు ఉంటారు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరే ఉంటాయి. సోషల్ మీడియాలో ఏమన్నా తక్కువ తిన్నారా? ముందు ఓ పోస్ట్ పెట్టేసి తామే ముందు ప్రపంచానికి తెలియజెప్పాలనే తొందరలో.. మాకు అతగాడికి ఉన్న పరిచయాన్ని కూడా తెలియజేయాలనే అత్యుత్సాహంలో.. చచ్చాడు పాపం.. అని ఓ పెదవి విరుపును జోడించి.. రిప్‌ల కోసం.. లైక్‌ల కోసం వెంపర్లాడే గ్యాంగులకూ ఏం తక్కువ లేదు.
సెలబ్రిటీ అయితే చాలు.. వారు ఆస్పత్రి పాలైతే చాలు.. చావు కోసం కాచ్చుక్కూర్చున్న పీతిరి గద్దల లెక్క తయారయ్యారు అంతా కలిసి. అరేయ్.. మేము చావలేదురా.. అని గావుకేక పెట్టాలని ఉన్నా.. ఆ కేక కూడా పూర్తిగా గొంతు దాటి బయటకు రాకముందే ఇక్కడ అంత్యక్రియలు కూడా కానిచ్చేస్తారు.
ఒకవేళ బతికి బట్టకట్టినా..అరేరే.. మన బ్రేకింగ్ మిస్ ఫైర్ కాకూడదే.. కచ్చితంగా అతగాడు చచ్చి తీరాలే.. అలా ఎలా అయ్యిందని.. అతడు చావకపోవడమే తప్పిదంగా.. అతన్నిచంపకపోవడమే డాక్టర్లు చేసిన పెద్ద మిస్టేక్‌గా చూస్తున్నారు తప్ప.. అయ్యయ్యో.. మేం తప్పు చేశామే.. సరిదిద్దుకుందాం.. చెంపలేసుకుందాం.. అని ముందుకు రారు.
ఎందుకంటే… వారిది చాలా చాలా విశ్వసనీయ సమాచారాలు చేరవేసే ప్రముఖ టాప్ రేటింగ్.. మెరుగైన సమాజం కోసం అహర్నిషలు.. బ్రే.. కింగులనే ఊపిరిగా పీల్చుకుంటున్న ఓ వార్త ఛానెల్ కాబట్టి. ఇంతలా ఎదిగిన మేం.. ఓ చావు కోసం తప్పు ఒప్పుకుంటామా? ఇలాంటి చావులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ మాలాంటి వార్తాహరులు.. బ్రే.. కింగులు.. ఇంకా పుట్టలేదు.. పుట్టరు.. అందుకే మేం చెప్పిందే వార్త. అదే వినాలి. నమ్మాలి. శ్రద్దాంజలి ఘటించాలి. మమ్మల్ని ఫాలో కావాలి. లేదంటే వాడు గాడిదే.