Traffic Rules: రాదు.. మనకు బుద్ధి రానే రాదు. వరుస చలాన్లు వేసినా రాదు.. బైకులు సీజ్ చేసినా రాదు.. కేసులు బుక్ చేసినా రాదు. ఈ ఏడాదిలో.. గ్రేటర్ హైదరాబాద్‌లోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, వందల కోట్లలో నమోదైన చలాన్లని చూశాక.. గ్రేటర్ పీపుల్.. ట్రాఫిక్ రూల్స్‌ని ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్థమవుతోంది. ఒక్కో కమిషనరేట్ పరిధిలో చలాన్ల ఫిగర్లు చూస్తుంటే.. ఫీజులు ఎగిరిపోతున్నాయ్. ఇంకా.. ఏం చేస్తే మారతారు మన హైదరాబాదీలు?
చలాన్లు పడుతూనే ఉంటాయ్.. కేసులు బుక్ అవుతూనే ఉంటాయ్.. అయినా సరే.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ అవుతూనే ఉంటాయ్.. హైదరాబాద్ మహానగరంలో రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ నాట్ అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. వందల కోట్లలో చలాన్లు పడుతున్నా.. వేలల్లో కేసులు నమోదవుతున్నా.. అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. అది అలాగే.. కంటిన్యూ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ అంటే.. వరల్డ్ క్లాస్ సిటీ అని గొప్పగా చెప్పుకుంటాం. ఐటీ హబ్‌గా.. గ్లోబల్ మ్యాప్‌లో మెరుస్తున్నాం. అదే సిటీ రోడ్ల మీదకు వస్తే మాత్రం.. బేసిక్ సివిక్ సెన్స్ అనేది ఎక్కడో పాతాళంలో ఉంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, ఎన్ని చలాన్లు విధించినా, లక్షలు, కోట్లలో.. జనం జేబులకు చిల్లులు పడుతున్నా సరే.. వాహనదారుల్లో మార్పు కనిపించడం లేదు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో.. ఈ ఏడాది ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 239 కోట్ల 37 లక్షల రూపాయల చలాన్లు విధించారు. గతేడాదితో పోలిస్తే.. ఇది డబుల్ కన్నా ఎక్కువ. ట్రాఫిక్ ఉల్లంఘనలపై విడుదల చేసిన వార్షిక నివేదికలో.. ఈ వివరాలు వెల్లడించారు సైబరాబాద్ పోలీసులు. ఇందులో.. వాహనాలను ఆపి ట్రాఫిక్ పోలీసులు నేరుగా విధించిన చలాన్లు.. 10 లక్షల 27 వేలకు పైగా ఉండగా.. ఈ-చలాన్లు దాదాపు 26 లక్షలు ఉన్నాయి. ఈ రెండు రకాల చలాన్ల మొత్తం విలువ 239 కోట్లు దాటింది. ఈ ఒక్క ఏడాదిలోనే.. 36 లక్షలకు పైగా వాహనాలపై చలాన్లు విధించారు.
2024లో సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చలాన్ల మొత్తం విలువ దాదాపు 112 కోట్లు. కానీ.. ఏడాది గడిచేసరికి వాహనదారుల్లో ఎలాంటి మార్పు రాకపోగా.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారి సంఖ్య డబుల్ అయిపోయింది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో.. సుచిత్ర, బయోడైవర్సిటీ, బాలానగర్ టీ జంక్షన్ సహా వివిధ చౌరస్తాలను.. సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా మార్చారు. ఇలాంటి చోట.. యూటర్న్‌లు దూరంగా ఉండటంతో.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇది.. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లలో చాలా క్లియర్‌గా తెలుస్తోంది. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చలాన్ల సంఖ్య 50 వేలకు పైనే ఉంది. ఇదిలా ఉంటే.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సరిపోను ట్రాఫిక్ సిబ్బంది లేరు. 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నా.. చౌరస్తాల్లో ట్రాఫిక్ నియంత్రించే వారు లేరు. ట్రాఫిక్ పోలీసులు ఉంటేనే.. పట్టించుకోకుండా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాళ్లున్న నగరంలో.. వాళ్లు లేకపోతే ఏ విధంగా వ్యవహరిస్తారో.. ఈ ఏడాది నమోదైన చలాన్లు చెబుతున్నాయ్. సరిపోను ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో.. ప్రైవేట్ వ్యక్తులను ట్రాఫిక్ మార్షల్స్‌గా ఎంపిక చేసి వారి సేవలను వాడుకుంటున్నారు. 2024లో 95 మంది ట్రాఫిక్ మార్షల్స్ ఉండగా.. ఈ ఏడాది అది 172కి పెరిగింది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. ఈ ఏడాది.. మొత్తం 73 లక్షల 69 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఇందులో విత్ ఔట్ హెల్మెట్ ఉల్లంఘనలు 41 లక్షల పైనే ఉండగా.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉల్లంఘనలు.. 6 లక్షలకు పైగా ఉన్నాయ్. వీటితో పాటు 49 వేల 732 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయ్. ఒక్క డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లోనే.. 10 కోట్ల 46 లక్షల జరిమానా కోర్టు వసూలు చేసిందంటే.. పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో బుక్ అయిన వారిలో.. 3 వేల మందికి పైగా జైలుపాలయ్యారు. అయినాసరే.. తాగి వాహనాలు నడపొద్దనే ఆలోచనే రావట్లేదు చాలా మందికి! హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనుషుల కంటే వాహనాల సంఖ్య బాగా పెరిగిపోయిందని సీపీ సజ్జనార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్య తగ్గించడంలో వాహనదారులు భాగస్వాములు కావాలని పోలీసులు కోరుతున్నారు. కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం ద్వారా కొంతమేర ట్రాఫిక్ రద్దీని తగ్గించొచ్చని చెబుతున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనలు విపరీతంగా పెరిగిపోయాయ్. ఈ ఏడాది 27 లక్షల 89 వేలకు పైనే కేసులు నమోదయ్యాయ్. ఇందులో.. విత్ ఔట్ హెల్మెట్ కేసులు దాదాపు 20 లక్షలున్నాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు లక్షా 61 వేలకు పైనే ఉన్నాయ్. సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 22 వేల పైనే నమోదయ్యాయ్. విత్ ఔట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులు 80 వేలకు పైనే ఉండగా.. సిగ్నల్ జంప్‌లు దాదాపు 77 వేల కేసులున్నాయ్. ఈ ఏడాది.. రాచకొండ పరిధిలో 17,760 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా.. 3 కోట్ల 89 లక్షల జరిమానా వసూలు చేశారు. 5,821 మంది వాహనదారుల లైసెన్సులు రద్దు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నా.. సీసీ కెమెరాలు గ్యాప్ లేకుండా మానిటర్ చేస్తున్నా.. హైదరాబాద్ వాసుల తీరులో మార్పు రావడం లేదు. చలాన్ వేస్తారా.. వేసుకోండి.. దొరికినప్పుడు చూసుకుందాం.. డబ్బులుంటే కట్టుకుంటాం.. అన్నట్లుగా ఉంది సిటీ పబ్లిక్ వ్యవహారం. అందుకే.. ట్రాఫిక్ చలాన్లు కూడా ఏటికేడు పాత రికార్డులను తిరగరాస్తున్నాయ్. ఈ ఏడాది సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు, కోట్లల్లో నమోదైన చలాన్ల లెక్కలు చూస్తుంటే.. మైండ్ బ్లాంక్ అవుతోంది. కేవలం.. జరిమానాల రూపంలోనే వందల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.
ఇదీ.. పరిస్థితి! హెల్మెట్ పెట్టుకోమన్నా మన గురించే.. సీట్ బెల్ట్ పెట్టుకోమన్నా మన గురించే.. సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ టేకింగ్.. ఇలా ఎన్ని రూల్స్ బ్రేక్ చేసినా.. ట్రాఫిక్ పోలీసులు మన సేఫ్టీ గురించే చెబుతారు. అయినా సరే మనం వినం. అందుకే.. ఇన్ని చలాన్లు. అలాగైనా మారుతున్నామా? నో.. ఆ ఛాన్సే లేదంటున్నాం! హైదరాబాద్ వాహనదారులారా.. ఈ కొత్త సంవత్సరంలోనైనా ట్రాఫిక్ రూల్స్ పాటించే రెజల్యూషన్ తీసుకుంటారా? సంవత్సరం మారినా.. మాలో మార్పు రాదు అన్నట్లుగా వ్యవహరిస్తారా?
హైదరాబాద్‌లో ధమ్ బిర్యానీ ఎంత ఫేమస్సో.. ట్రాఫిక్ కష్టాలు కూడా అంతే ఫేమస్. కానీ.. ఈ కష్టాల్లో సగం మనవల్లే అన్నది పచ్చి నిజం. హెల్మెట్ పెట్టుకోండి బాబూఅని పోలీసులు మొత్తుకున్నా, సీట్ బెల్ట్ లైఫ్ సేవ్ చేస్తుందని బోర్డులు పెట్టినా.. మన కంటికి కనిపించదు. చెవులకు అస్సలు ఎక్కదు. సంవత్సరాలు మారుతున్నాయ్.. క్యాలెండర్లు మారిపోతున్నాయ్.. అయినాసరే.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే విషయంలో వానహదారుల బుద్ధి మారట్లేదు. మన సేఫ్టీ.. మనకే భారంగా అనిపిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసేది.. ఖజానా నింపుకోవడానికి కాదు. మన ప్రాణాలను కాపాడటానికి అని ఇంకెప్పుడు గుర్తిస్తాం? హెల్మెట్ అనేది.. తలకు ఉంటేనే ప్రాణాలు పదిలంగా ఉంటాయ్. బైక్ హ్యండిల్‌కు తగిలిస్తే వచ్చే లాభమేంటి? కారులో ఎయిర్ బ్యాగులున్నా.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అవి సరిగ్గా పనిచేయవన్న లాజిక్ కూడా మర్చిపోతున్నారు కొందరు. ఇక.. సెల్ ఫోన్ డ్రైవింగ్ సంగతి సరేసరి. వాహనాలు నడిపేటప్పుడు ఒక్క సెకన్ ఫోన్ వైపు చూసినా.. లైఫ్ మొత్తం చీకటిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయినా సరే.. స్టీరింగ్ మీద ఒక చెయ్యి.. ఫోన్ మీద ఓ కన్ను వేసి నడిపేవాళ్లు రోజుకు వేల మంది కనిపిస్తారు.
అయినా.. ప్రాణాలు కాపాడే హెల్మెట్ పెట్టుకోవడానికి ఎందుకింత బద్ధకం? చలాన్ పడుతుందన్న భయంతోనే హెల్మెట్ కొంటారు తప్ప.. ప్రాణాలు పోతాయన్న ఆలోచనే లేదు. యూటర్న్ దూరంగా ఉందని.. షార్ట్ కట్‌లు వెతుక్కుంటూ.. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసే బ్యాచ్.. సిటీని పట్టి పీడిస్తోంది. ఎన్ని చలాన్లు వేసినా.. ఏదో ఒక రోజు డిస్కౌంట్ ఇస్తారనే ధోరణి చాలా మంది వాహనదారుల్లో పెరిగిపోయింది. ఇదే.. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేలా చేస్తోంది. ఇక.. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌లు, మాస్కులు వేయడం లాంటి దిక్కుమాలిన పనులు కూడా ఎక్కువైపోయాయ్. రూల్స్ పాటిస్తే లేట్ అవుతుందనో.. చలాన్ పడితే పడుతుందిలేనని అనుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. అందుకే.. ట్రాఫిక్ చలాన్ల కేసుల్లో ఇంత భారీ ఫిగర్స్ కనిపిస్తున్నాయ్. అయినా.. చలాన్ పడితే ప్రభుత్వాన్నో, ట్రాఫిక్ పోలీసులనో తిట్టుకుంటారు తప్ప.. తప్పు చేశామని ఒప్పుకునే వాళ్లెంత మంది ఉన్నారు? హైదరాబాద్‌లో రోజుకు వేల సంఖ్యలో ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్. లక్షల్లో ఫైన్లు కడుతున్నారు. కానీ.. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే.. ఆ డబ్బు ఆదా అవుతుందనే ఆలోచన చాలామందికి రావట్లేదు. లక్షల్లో చలాన్లు వేస్తున్నా జనం మారుతున్నారా? అంటే.. నిశ్శబ్దమే సమాధానమై కనిపిస్తోంది.
ఇప్పటిదాకా.. జరిగిందేదో జరిగిపోయింది. రాబోయే కొత్త సంవత్సరంలోనైనా మారదాం అంటున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే వాహనదారులంతా ఒక్క విషయం ఆలోచించండి. ఇంట్లో మీకోసం ఎదురుచూసే కుటుంబసభ్యుల్ని గుర్తుతెచ్చుకోండి. ఈ న్యూఇయర్‌లో.. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటిస్తాననే రెజల్యూషన్ తీసుకోండి. ఎంత ఆలస్యమైనా.. రాంగ్ రూట్‌లో వెళ్లొద్దు. బండి బయటకు తీస్తే.. తల మీద హెల్మెట్ ఉండాల్సిందే. సిగ్నల్ జంపింగ్‌లు, సెల్‌ఫోన్ డ్రైవింగ్ లాంటి ఉల్లంఘనలకు అస్సలు పాల్పడొద్దు. ప్రతి గల్లీలో ట్రాఫిక్ పోలీసులు ఉండరు. ప్రతి సిగ్నల్ దగ్గర కెమెరా పనిచేయకపోవచ్చు. మార్పు అనేది చలాన్ భయంతో కాదు, బాధ్యతతో రావాలి. ఇంటి నుంచి బయలుదేరిన మనం.. క్షేమంగా తిరిగి రావాలి. ఎదుటి వ్యక్తిని క్షేమంగా వెళ్లనివ్వాలనే కనీస ఆలోచన కలిగిన రోజే.. హైదరాబాద్ రోడ్లు సురక్షితం అవుతాయి. నగరం మారాలంటే.. రోడ్లు ఒక్కటే మారితే సరిపోదు. ఆ రోడ్లపై తిరిగే వాహనదారుల ఆలోచన తీరు కూడా మారాలి. కొత్త ఏడాదిలో ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది కేవలం చలాన్లు తప్పించుకునేందుకు కాదు.. బాధ్యత కలిగిన పౌరుడిగా అది మన విధి. గుర్తుంచుకోండి.. కొత్త సంవత్సరం నుంచైనా మార్పు మనతోనే మొదలవ్వాలి.
Story by Anup, Big Tv