CM Chandrababu: భారతదేశమంటే.. కేవలం భూభాగం కాదు.. అపారమైన జ్ఞానానికి నిలయం అన్నారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక.. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు సీఎం. పీపీపీ విధానంలో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల నిర్మాణం, మౌలిక వసతులపై.. కేంద్రం నుంచి సాయం తీసుకోనున్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి.. జనాభా వృద్ధి కారణం కాబోతోందన్నారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయోధ్య రామాలయంలో శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత.. ఆలయ నిర్మాణ విశేషాలను.. నిర్వాహకులు సీఎంకు వివరించారు. అంతకుముందు.. అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు దేవాలయ అధికారులు, ఉత్తరప్రదేశ్ ఎన్డీఏ నాయకులు ఘన స్వాగతం పలికారు.
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యంతరాల గడువు ముగియడంతో.. వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మొత్తం 927 అభ్యంతరాలపై రివ్యూ చేశారు. డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
భారతదేశం ఓ భూభాగం మాత్రమే కాదని.. అపారమైన జ్ఞానానికి నిలయమని చెప్పారు సీఎం చంద్రబాబు. 4,500 ఏళ్ల క్రితమే హరప్పా నాగరికతతో.. పట్టణ ప్రణాళికను ప్రపంచానికి నేర్పిన ఘనత మనదన్నారు. సున్నాను కనిపెట్టి.. నేటి ఐటీకి పునాది వేసింది భారతీయులేనని గొప్పగా చెప్పారు. భారతీయతే మన బలం అన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, మన సంప్రదాయ విలువలను కాపాడుకుంటే.. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో.. 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని.. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని సైతం ఆవిష్కరించారు. తల్లిదండ్రులు పిల్లలకు హాలీవుడ్ సూపర్ హీరోలను చూపించడం కంటే.. హనుమంతుడి బలం గురించి, అర్జునుడి యుద్ధ ప్రావీణ్యం గురించి చెప్పాలన్నారు. మహాభారత, రామాయణాలతో పాటు శ్రీకృష్ణుడి మహిమలు, శివ మహత్యం, రామరాజ్యం గురించి చెప్పాలన్నారు సీఎం.
ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుతోందని.. చైనా, జపాన్, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో జనాభా వేగంగా క్షీణిస్తోందని తెలిపారు సీఎం. భారత్ ఒక్కటే రాబోయే కాలంలో 14.8 శాతం జనాభా వృద్ధిని నమోదు చేయబోతోందన్నారు. ఇది మనకు లభించిన గొప్ప అవకాశమని చెప్పారు. మన దగ్గర యువశక్తి పుష్కలంగా ఉందని.. పాపులేషన్ రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే మనం తగ్గకూడదన్నారు. అందుకోసమే.. ప్రతి జంట కనీసం ముగ్గురు పిల్లలను కనాలన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి.. జనాభా వృద్ధి ప్రధాన కారణం కాబోతోందన్నారు.
తిరుపతిలో జిల్లా పోలీసు నూతన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ వారం ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని.. విజిటర్స్ పుస్తకంలో తన అభిప్రాయాలను రాశారు.
అమరావతిలో చరిత్ర సృష్టించే విధంగా.. అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి.. రాజధానిలో 14 అడుగుల వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దేశానికి సుపరిపాలన యాత్రను పరిచయం చేసిన వ్యక్తి వాజ్‌పేయి అని.. అందుకే ప్రధాని మోడీ డిసెంబర్ 25ని గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించారని చెప్పారు. వాజ్‌పేయి, మోడీలో.. విలక్షణమైన వ్యక్తిత్వం, చరిత్రను తిరగరాసే నాయకత్వం ఉందని చెప్పుకొచ్చారు. తనకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీఆర్ అన్నారు చంద్రబాబు. దేశంలో యాంటీ కాంగ్రెస్ కోసం పనిచేసిన వారిలో.. వాజ్‌పేయి తర్వాత ఎన్టీఆర్ మాత్రమేనని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాడు కుట్రతో కూలిస్తే.. అండగా నిలబడిన వ్యక్తులు వాజ్‌పేయి, అద్వానీ మాత్రమేనని గుర్తుచేసుకున్నారు.
పనిలో పనిగా.. వ్యవసాయం, అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలకు మరింత సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు.. సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు సహా ఏపీలో అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విభజన చట్టం–2014, షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా.. రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. 2,585 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను.. వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి సమర్పించినట్లు చెప్పారు. అమరావతి పర్యటనలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు.. చంద్రబాబు వినతి పత్రం అందించారు.
పేదలకు నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదన్నారు సీఎం చంద్రబాబు. ఈ వారం వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన రివ్యూలో.. పీపీపీ విధానంలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం, మౌలిక వసతులపై.. కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాల గురించి చర్చించారు. పీపీపీ ప్రాజెక్టుల అమలును ప్రోత్సహించేందుకు.. ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ.. విధానపరమైన ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అమలులో ఉన్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద.. సామాజిక ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. పీపీపీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇచ్చే 60 శాతం ఆర్థిక మద్దతులో.. చెరో 30 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు స్పష్టం చేశారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి.. కేంద్రం పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తోందని వివరించారు. దీని ద్వారా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల వంటి కీలక ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అభిప్రాయపడింది.
క్రిస్టియన్ పాస్టర్లకు కూటమి ప్రభుత్వం క్రిస్మస్ కానుకను అందించింది. పాస్టర్లకు నెలవారీ అందించే గౌరవ వేతనాలను ఈవారం జమ చేసింది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని 8 వేల 418 మంది పాస్టర్లకు గౌరవ వేతనం నిధులు విడుదల చేశారు. 2024 డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 50 కోట్లకు పైగా పాస్టర్ల ఖాతాలో వేశారు. ఒక్కో పాస్టర్‌కు నెలకు 5 వేల చొప్పున 12 నెలల మొత్తం 60 వేల అందించింది ప్రభుత్వం
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఈవారం రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం ఉత్పత్తి, విద్యుత్, రవాణా, నీటి భద్రత అందించటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ మేళవింపు అంశాల ఆధారంగా.. వివిధ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. సుస్థిరాభివృద్ధితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కావాల్సిన, నిర్దేశించుకోవాల్సిన అంశాలపైనా చర్చించారు.
ఇండియాలో క్వాంటమ్ టెక్నాలజీలో మొదలైన రెవల్యూషన్‌కి.. ఏపీ నాయకత్వం వహిస్తుందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిని ప్రపంచంలోని ఐదు క్వాంటమ్ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు. ఏపీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ సాధించినవారికి.. 100 కోట్ల నజరానా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక.. ఏపీఆర్టీసీలో కొత్త ప్రవేశపెట్టే బస్సులన్నీ ఈవీలే ఉండాలని ఆదేశించారు. ఏపీలో లిక్కర్ పాలసీని.. వ్యాపారంలా కాకుండా ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.
రాష్ట్రంలో గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ధాన్యం కొనుగోళ్లు సహా వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌పై ఈ వారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో మాట్లాడి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు.. తక్షణమే చర్యలు ఉండాలన్నారు చంద్రబాబు. రైతుల నుంచి కొనే ధాన్యంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడకుండా చూడాలన్నారు.
ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు.. పల్లెవెలుగుకు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టదల్చిన 1,450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని.. గోదావరి జిల్లాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ముందుగా ఏర్పాటు చేయాలన్నారు. వీటికి సంబంధించి.. త్వరలోనే టెండర్లు పిలవాలని సూచించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఈ-బస్సుల రోడ్ మ్యాప్‌పై ఈ వారం సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో.. 8 వేల 819 డీజిల్ బస్సుల స్థానంలో.. ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు అంగీకారం తెలిపారు. అలాగే.. 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాలపరిమితి ఉన్న బస్సులను ఈవీలుగా మార్చేయాలన్నారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తలెత్తిన రద్దీకి తగినట్టుగా.. కొత్త బస్సులు ప్రవేశపెట్టాలన్నారు సీఎం.
ఏపీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ బహుమతి సాధించినవారికి.. 100 కోట్ల నజరానా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ప్రపంచంలోని.. ఐదు అగ్రశ్రేణి క్వాంటమ్ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు. ఇండియాలో.. ఈ టెక్నాలజీలో విప్లవానికి ఏపీ నాయకత్వం వహిస్తుందన్నారు. 6 నెలల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని, రెండేళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు ఉత్పత్తి చేసి… విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. ప్రపంచ ఐటీ రంగానికి కేంద్రస్థానం సిలికాన్ వ్యాలీ అయితే.. రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్‌కి అమరావతి కేంద్రంగా మారుతుందన్నారు. కొత్త కంపెనీలు ప్రారంభించేందుకు, టెక్నాలజీ ఆవిష్కరణకు అంతా ఇక్కడికే వస్తారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం, వైసర్, క్యూబిటెక్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 54 వేల మంది విద్యార్థులు నమోదుకు చేసుకున్నారు. వాళ్లందరితో.. ఈ వారం క్వాంటమ్ టాక్ బై సీబీఎన్ కార్యక్రమం నిర్వహించారు. సిలికాన్ వ్యాలీ నుంచి క్వాంటమ్ వ్యాలీకి.. అమరావతి నుంచి భారత క్వాంటమ్ భవిష్యత్తు నిర్మాణం అన్న అంశంపై.. ఆన్‌లైన్‌లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
పాఠశాల విద్యార్ధులు, కాలేజీ యూత్‌లో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికి తీసేలా.. సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ పోటీలను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సంబంధించి.. సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2026 పోస్టర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో.. జనవరి 22 నుంచి 24వ వరకు మూడు రోజుల పాటు గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో.. ఫైనల్స్ జరగనున్నాయి. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆధ్వర్యంలో.. మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాలేజీ స్థాయిలో కెమికల్ రాకెట్రీ, పాఠశాల స్థాయిలో హైడ్రో రాకెట్రీ పోటీలు నిర్వహిస్తున్నారు. కెమికల్ రాకెట్రీ విభాగంలో 16 ఏళ్లకు పైబడిన వారు, హైడ్రో రాకెట్రీ విభాగంలో 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న వారు పాల్గొననున్నారు. కళాశాల యువతతో పాటు పాఠశాల విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణల్ని, ఆలోచనల్ని వెలికితీసేలా పోటీలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తెలియచేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు కొత్త స్కిల్స్ అందుబాటులోకి తెచ్చేందుకు.. త్వరలో క్వాంటం టెక్నాలజీ కోర్సులను అందించనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు టెక్ విద్యార్థులు క్వాంటం, ఏఐ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా.. శిక్షణ ఇప్పించనున్నారు. అంతేకాదు.. పాఠశాల స్థాయి నుంచే క్వాంటం టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయంలో ఈ వారం.. ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో సీఎం సమావేశం అయ్యారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో.. డిజిటల్ పద్ధతిలో విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రతిపాదనలను ఐఐటీ ప్రతినిధులు వివరించారు. వచ్చే ఏడాది నుంచి రెండేళ్ల పాటు.. నాలుగు విడతల్లో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేలా తయారు చేసిన యాక్షన్ ప్లాన్‌ను ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు ప్రతిపాదించారు. వీటిపై.. సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు.
ఏపీలో లిక్కర్ పాలసీని.. వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని సీఎ చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సచివాలయంలో ఈ వారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. కొత్త ఎక్సైజ్ విధానాల అమలు, వాటి ప్రభావంపై సమగ్రంగా చర్చించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని.. మద్యాన్ని ఓ ఉత్పత్తిలానే పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ ద్వారా.. షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు తదితర అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. అదేవిధంగా.. బార్లకు అడిషనల్ రిటెయిల్ ఎక్సైజ్ టాక్స్ మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలన్నారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్టు షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ వారం 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై ఈ మీటింగ్‌లో చర్చించారు. అదేవిధంగా.. వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశంపై ఆరా తీశారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు.
Story by Anup, Big Tv