E-Paper
Advertisement

అందరూ సారా అనుకుంటున్నారు కానీ.. ఇప్పపువ్వు అసలు కథ తెలిస్తే!

అందరూ సారా అనుకుంటున్నారు కానీ.. ఇప్పపువ్వు అసలు కథ తెలిస్తే!

Ippa Flower: రైట్ చూశారుగా అసెంబ్లీలో ఇప్పపువ్వు, దాని ప్రొడక్ట్స్ గురించి ఎమ్మెల్యే అనిరుధ్ చెప్పిన మాటలు. ఇది సారా మాత్రమే కాదు.. అంతకు మించి అన్న చర్చ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్ప పువ్వు ప్రొడక్ట్స్ పై అంతటా ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు అడవిలో రాలిపోయి, కేవలం సారా తయారీకే పరిమితమైన ఇప్ప పువ్వు.. ఇవాళ ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా ఎదుగుతోంది. అడవి తల్లి అందించిన అక్షయ పాత్ర. గిరిజనుల పాలిట కల్పవృక్షమిది.

నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు

ఆదివాసీల ఆచార, ఆహార, ఆర్ధిక వ్యవస్థతో పెనవేసుకున్న జీవనాధారం ఇప్పపువ్వు. అందుకే ఇప్ప చెట్టును కల్పవృక్షంగా ఆరాధిస్తారు ఆదివాసీలు. ఎండాకాలం మొదలైందంటే చాలు కోయ గూడాలలో ఇప్పపువ్వు సేకరణ పండగ మొదలవుతుంది. ఆదివాసీలకు, మార్చి ఏప్రిల్ నెలలో జీవనాధారంగా మారింది ఇప్పు సేకరణ. గిరిజనులు వాడుకోవడం కోసమే కాకుండా, ఆర్థికంగా బలపడేందుకు ఇప్పపువ్వు సేకరణ పనికొస్తుంది. ఒకప్పుడు కేవలం నాటు సారాకే పరిమితమైన ఇప్ప పువ్వు, ఇప్పుడు సూపర్ ఫుడ్ గా రికార్డులు సృష్టిస్తోంది. ప్యూర్, నేచురల్, ఘాటైన అనుభూతిని ఇచ్చే ఈ పానీయం, ఒకప్పుడు గిరిజన వేడుకలకు పరిమితం. కానీ ఇప్పుడు ఆర్గానిక్ డ్రింక్స్‌ను ఇష్టపడే వారికి ఇదో ఆల్టర్నేట్ గా మారింది.
మహువా చెట్టుగా పిలుచుకునే ఇప్ప పూల సేకరణ కోసం ఇంటిల్లిపాది తెల్లవారుజామునే అడవి బాట పడుతుంటారు.

ఇప్ప లడ్డూ… సహజమైన ఎనర్జీ బాంబ్

ఇప్ప పువ్వును ఎండబెట్టి, పొడి చేసి, అందులో బెల్లం, వేరుశనగలు, నెయ్యి కలిపి చేసే ఇప్ప లడ్డూ ఒక ఎనర్జీ బాంబ్. ఇందులో ఐరన్, క్యాల్షియం కొండంత ఉంటాయి. రక్తహీనతను తరిమికొట్టే సహజమైన ఔషధం ఇది. ఈ లడ్డూ తింటే వచ్చే శక్తి, ఏ ప్రోటీన్ బార్ ఇవ్వలేదంటున్నారు. ఇప్పుడిది సిటీల్లో హెల్త్ బార్ గా మార్కెట్ అవుతోంది. సేకరించిన పూలను ఆరబెట్టి, సంవత్సరం పొడవునా ఆహార వస్తువుగా వినియోగిస్తారు. ఆదివాసి ఆచారాలలో పూజా విధానాలలో నైవేద్యంగా ఇప్పసారాను వాడుతారు.

ఇప్ప పువ్వు గ్లోబల్ ట్రెండ్!

ఇప్ప పువ్వును మరగబెట్టి చేసే మహువా టీ కూడా ట్రెండింగ్ అవుతోంది. చక్కెర అవసరం లేని సహజ సిద్ధమైన స్వీట్ నెస్ దీని స్పెషల్. అలాగే ఇప్ప పువ్వు సిరప్‌ను పాన్ కేక్స్, ఐస్ క్రీమ్స్ మీద టాపింగ్‌గా వాడుతున్నారు. అడవి పువ్వుకు లభించిన గ్లోబల్ టచ్ ఇది. ఇప్ప పువ్వు పొడితో చేసే గారెలు, రొట్టెలు గిరిజనుల ఇష్టమైన భోజనం. ఇప్పుడు బిస్కెట్లు, కుక్కీస్ గా మారుతున్నాయ్. గ్లూటెన్ లేని ఫుడ్ కావాలనుకునే వారికి ఇప్ప పిండి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. చెప్పాలంటే ఇప్ప పువ్వు ఓ పోషకాల గని.

గ్లూటెన్ ఫ్రీ డైట్‌లో కొత్త స్టార్

గ్లూటెన్ అనేది గోధుమలు, బార్లీ, ఓట్స్ వంటి ధాన్యాలలో సహజంగా ఉండే ఒక రకమైన ప్రోటీన్. ఇది పిండికి జిగురును ఇస్తుంది. అయితే కొందరికి గ్లూటెన్ తింటే చిన్న ప్రేగులు దెబ్బతింటాయి. కొందరికి గ్లూటెన్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణక్రియ బాగుండాలనుకునే వారు కూడా ఇప్పుడు గ్లూటెన్ లేని ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. సాధారణంగా గ్లూటెన్ లేని ఆహారం కోసం జొన్నలు, సజ్జలు లేదా రాగులు వాడుతుంటారు. ఈ లిస్టులో ఇప్పుడు ఇప్ప పిండి కూడా వచ్చి చేరింది. పైగా గోధుమ పిండిలో కేవలం పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే, ఇప్ప పిండిలో కాల్షియం, ఐరన్, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల బలానికి, రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచి ఆప్షన్.

ఆదిలాబాద్‌లో వినూత్న ప్రయోగం

ఆదివాసులు సేకరించిన ఇప్ప పూలలో అత్యధిక శాతం సారా తయారీకి ఉపయోగిస్తారు. ఇప్పపూలను ఆరబెట్టి, ప్రత్యేక ప్రాసెసింగ్ ద్వారా మద్యం తయారీ చేస్తారు. ఇప్ప ఉత్పత్తులను సంవత్సరం పొడవునా ఆహార పదార్ధంగా వినియోగిస్తారు. లడ్డూలు, రొట్టెలు, నూనెలుగా అటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం, ఇప్పనూనెతో చర్మం, జుట్టు సంరక్షణ ఒక్కటేమిటి అన్నీ స్పెషల్సే అంటున్నారు. ఇప్ప సారా నుంచి పోషకాలు అందించే ఇప్ప లడ్డూల తయారీ దాకా కాలం చాలా మారింది. ఇప్పపూలతో నాటు సారా తయారుచేసే గిరిజనులు, ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంతో గిరిజన మహిళ రక్తహీనతను తగ్గించేందుకు ఇప్పపువ్వుతో లడ్డులను తయారు చేసేందుకు ముందుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో దేశంలోనే తొలిసారిగా 2020 లో పైలెట్ ప్రాజెక్ట్ కింద భీమ్ భాయి సహకార సంఘం పేరిట ఇప్పపువ్వు లడ్డుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటైంది.

గిరిజన విద్యార్థినులకు శక్తి ఆహారం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో గర్భిణులకు ఈ ఇప్పపువ్వు లడ్డూలను పెద్ద ఎత్తున అధికారులు అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆశ్రమ స్కూళ్లలో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు ఈ లడ్డూలను సప్లై చేస్తున్నారు. అధికారులు నెలకు దాదాపు 20 క్వింటాళ్ల ఇప్పపువ్వు లడ్డూలను భీమ్ బాయి సంఘం నుంచి కొని విద్యార్థినులకు అందిస్తున్నారు. మన్ కీ బాత్ లో ఈ విషయాన్ని ప్రధాని మోడీ కూడా ప్రస్తావించడంతో ఇప్ప పువ్వు లడ్డూ అంతటా చర్చనీయాంశమైంది.

ఇప్పపువ్వుతో వినూత్న వంటలు

ఆదిలాబాద్ జిల్లా సోదరీమణులు ఇప్పపువ్వుతో కొత్త ప్రయోగం చేశారని, రకరకాల వంటలు చేస్తున్నారని వీటిని ప్రజలు చాలా ఇష్టంగా తింటున్నారని.. వారి వంటల్లో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయం కమ్మదనం కనిపిస్తుందని ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రధాని ప్రశంసించడంపై భీమ్ బాయి ఆదివాసీ మహిళ సంఘం అధ్యక్షురాలు కుమ్ర భాగుబాయి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో మరింత ఉత్సహంతో పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టే ప్లాన్ కూడా చేస్తున్నారు.

ఇప్ప లడ్డూ తయారీ రహస్యం

ఒక ఇప్ప లడ్డు 20 గ్రాముల బరువుంటుండగా కిలో లడ్డుల ధర 300 రూపాయలుగా నిర్ణయించారు. కిలో లడ్డు తయారీకి 400 గ్రాముల ఇప్పపూలు,190 గ్రాముల బెల్లం,190 గ్రాముల పల్లిలు, 190 గ్రాముల నువ్వులు, 30 గ్రాముల కిస్మిస్, మంచి నూనెను కలిపి తయారు చేస్తున్నారు. లడ్డూల తయారీ కోసం ముందుగా ఇప్పపువ్వు ను ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని నూనెలో వేయిస్తారు. వేయించిన నువ్వులు, పల్లీలను దానికి జత చేసి చల్లబడ్డాక బెల్లం కూడా కలుపుతారు. ఈ పదార్థాలతో పాటు కిస్మస్, యాలకులు, మిరియాలపొడి కలిపి ఉండలుగా చుట్టి లడ్డూలు తయారుచేస్తున్నారు.

ఏడాది మొత్తం ఉపాధికి మార్గం.. ఇప్పపువ్వు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్ రోడ్ లో ఆదివాసి ఆహారం పేరిట ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని ఇప్పటికే నడిపిస్తున్నారు. భీంబాయి ఆదివాసీ మహిళ సహకార సంఘం అధ్వర్యంలో ఈ లడ్డూ కేంద్రాన్ని 12 మంది ఆదివాసీ మహిళలు కలిసి నడిపిస్తున్నారు. టీం లీడర్ గా కుమ్ర భాగుబాయి ఉన్నారు. వేసవిలో లభించే ఈ ఇప్పపువ్వులను ఆదివాసి మహిళలు వేకువజామున వెదురుబుట్టలలో సేకరించి ఇంటికి తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టి ఈ ఇప్ప పూలతో రకరకాల వంటకాలు తయారు చేసుకొని తింటారు.

ఇప్ప లడ్డూల సక్సెస్ స్టోరీ

ఈ ఇప్ప లడ్డులను ఆర్డర్లపై సప్లై చేస్తున్నారు. ఆదివాసీ మహిళల స్వయం కృషిని అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థలు అవార్డులు, రివార్డులు అందించాయి కూడా. 2023 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆది మహోత్సవ్ నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ కార్యక్రమంలో.. ఈ ఇప్ప ప్రొడక్ట్స్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పపువ్వు లడ్డూపై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తరఫున జార్ఖండ్ కు వెళ్లి ఇప్పపువ్వు లడ్డు వంటకాల తయారీ గురించి అక్కడి వారికి అవగాహన కల్పించారు భీంబాయి సంఘం సభ్యులు.

ఇప్పపువ్వు అసలు విలువ ఇదే!

ఇప్పపువ్వు ప్రొడక్ట్స్ అంటే సారా మాత్రమే కాదు.. దీన్ని పక్కన పెడితే ఇప్ప లడ్డూల వంటివి, ఇప్ప పిండి ఇలాంటివి శరీరానికి ఎంతో మేలని, వీటితో కండరాలు బలంగా ఉండడంతో పాటు మోకాళ్ల నొప్పులు తగ్గడం, రక్తహీనతకు చెక్ పెట్టడం వంటివి ఇక్రిశాట్ పరిశోధనలో వెల్లడైందంటున్నారు సభ్యులు. సో ఒక అవకాశం చాలా ఆశలను తీసుకొస్తుంది. ఇప్ప పువ్వు అనగానే నెగెటివ్ ఇంపాక్ట్ వైపు చూడొద్దన్న చర్చ జరుగుతోంది. సారాను ఎవరూ ప్రోత్సహించరు. ప్రోత్సహించొద్దు కూడా. అయితే అదే సమయంలో ఇప్ప ప్రొడక్టులతో కలిగే లాభాలనూ గుర్తించాలన్న విషయమైతే హైలెట్ అవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఇప్ప ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: నువ్వెవడ్రా..? ఎమ్మెల్యే ఆవేశం.. మంత్రి పదవి గాల్లో దీపమేనా?

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×