Iran AirDefense: వార్ వన్ సైడ్ అయిందనే ట్రంప్ మాట ఉత్తదేనని మళ్లీ తేలిపోయింది. పశ్చిమాసియాలో ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకే రోజు యూఎస్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. మరో రెండు హెలికాప్టర్ల పైనా దాడి చేసింది. ఈ ఘటనల్లో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడగా.. మరో పైలట్ గల్లంతయ్యారు. ఇరాన్ గగనతలంపై అమెరికాకు పూర్తి ఆధిపత్యం ఉందన్న ప్రెసిడెంట్ ట్రంప్ వాదనలకు.. ఈ ఘటనలు గండికొట్టాయ్. ఇంతటి అధునాతన యుద్ధ విమానాలను.. ఇరాన్ ఎలా టార్గెట్ చేస్తోంది? ఏ రకంగా కూలుస్తోందనే దానిమీదే ఇప్పుడు వరల్డ్ వైడ్ డిబేట్ మొదలైంది.
అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ విమానాన్ని ఇరాన్ దాడి చేసి కూల్చేసింది. ఇందులో ఓ పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు. వారిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు తెలిపాయ్. అటు హర్మూజ్ సమీపంలో ఏ-10 వార్‌థగ్ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చేసింది. దీనికి సంబంధించిన వీడియోని కూడా ఇరాన్ షేర్ చేసింది. ఈ ఫైటర్ జెట్ శకలాలు కువైట్‌లో పడగా.. అందులోని పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్న వేళ.. ఈ ఘటనలు టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారాయ్.
అమెరికా అంచనాలకు మించి.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఎఫ్-15ఈ యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం గాలింపు చేపట్టిన రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లపైనా ఇరాన్ దాడి చేసింది. ఇవి కొద్దిలో తప్పించుకొని.. ఇరాన్ ఎయిర్‌స్పేస్ నుంచి బయటకు వచ్చేశాయ్. ఈ పరిణామాలపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ఇలాంటి ఘటనలు దౌత్య చర్చలపై ప్రభావం చూపలేవన్నారు. యుద్ధంలో ఉన్నప్పుడు.. ఇలాంటి దాడులు చర్చలపై ఇంపాక్ట్ చూపవని చెప్పేశారు.
ఇరాన్ ఇచ్చిన షాక్‌లు చూశాక.. ఇరాన్ గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలు ఈజీగా ఎగిరే రోజులు ముగిసిపోయినట్లు కనిపిస్తున్నాయ్. అలాగని.. ఇరాన్, అమెరికాతో సమాన సైనిక స్థాయికి చేరుకుందని కాదు. కానీ, ఆ దేశ గగనతలంపై తమకే పూర్తి ఆధిపత్యం ఉందన్న ప్రెసిడెంట్ ట్రంప్ వాదనలకు ఇది దెబ్బకొట్టింది. అయితే, బలహీనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిన ఇరాన్, ఇంతటి అధునాతన యుద్ధ విమానాలను ఎలా టార్గెట్ చేసిందనేదే ఇప్పుడు మేజర్ క్వశ్చన్. యుద్ధం ఇప్పుడు రెండో నెలలోకి ఎంటరైంది.
అయినప్పటికీ, ఇరాన్ ఎత్తుగడల గురించి అమెరికాకు ఇంకా అవగాహన లేనట్లు కనిపిస్తోంది. అమెరికన్ యుద్ధ విమానాలను కూల్చేసిన తర్వాత, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్.. ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. తమ కొత్త, అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే.. ఈ ఘనత సాధించినట్లు తెలిపింది. ఈ పరిణామాలు అమెరికాకు యుద్ధరంగంలో ఓ పెద్ద ఎదురుదెబ్బగా మారాయ్. గడిచిన 2 దశాబ్దాలకు పైగా కాలంలో.. అమెరికా యుద్ధ విమానాలను శత్రువులు కూల్చడం దాదాపుగా ఇదే తొలిసారి. 2003లో ఇరాక్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు.. చివరిసారిగా అమెరికా ఫైటర్ జెట్ కూలిపోయింది.
ముఖ్యంగా, ఇరాన్ గగనతలంపై కంప్లీట్ కంట్రోల్ ఉందని, టెహ్రాన్ దగ్గర ఎలాంటి నాన్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ లేవని ట్రంప్, అమెరికా పదే పదే చెబుతున్నా, ఇరాన్ ఎదురుదాడులతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో ఎగురుతున్నా.. వాళ్లేమీ చేయట్లేదని ట్రంప్ అన్నారు. సరిగ్గా వారం తర్వాత.. వాస్తవమేమిటో ట్రంప్‌తో పాటు మొత్తం ప్రపంచానికి ఇరాన్ చూపించింది. మాజిద్ ఇన్‌ఫ్రారెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గానీ, షోల్డర్ ఫైర్డ్ మిసైల్ ద్వారా గానీ, ఇరాన్ యుద్ధ విమానాలను కూల్చి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ కూల్చేసిన ఆ రెండు అమెరికా యుద్ధ విమానాలు.. బహుశా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండటంతో.. ఈజీ టార్గెట్లుగా మారాయంటున్నారు. నిజానికి, అమెరికా అడ్వాన్స్‌డ్ స్టెల్త్ ఫైటర్ జెట్.. ఎఫ్-35 పైన కూడా మార్చి 19న దాడి జరిగింది. ఇది కూడా భూమిపై నుంచి ఆకాశానికి ప్రయోగించే మిసైల్ ప్లాట్ ఫామ్ అయిన, మాజిద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఇరాన్ తుమ్మితే ఊడిపోయే దేశం కాదు. భయపెడితే భయపడిపోయే దేశం అంతకన్నా కాదని.. ఈ యుద్ధంలో ప్రతి రోజూ ప్రూవ్ అవుతూనే ఉంది. ఇలాంటి రోజు ఏదో ఒకరోజు వస్తుందని.. అన్ని రకాల రక్షణ వ్యవస్థలను రెడీ చేసుకుంది. అందుకే.. అమెరికా కూడా యుద్ధం త్వరగా ముగించలేకపోతోంది. అమెరికన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు కూడా ఇరాన్ ఎత్తుల ముందు నిలబడలేక, కూలిపోతున్నాయ్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పసిగట్టలేవనే స్టెల్త్ టెక్నాలజీ.. ఇరాన్‌లో ఒట్టిదేనని మళ్లీ, మళ్లీ తేలుతోంది. ఇరాన్ దళాలు అమెరికా యుద్ధ విమానాలపై సక్సెస్‌ఫుల్‌గా దాడులు చేస్తూనే ఉన్నాయ్. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇరాన్ డెవలప్ చేసిన చేసిన మాజిద్ AD-08 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలకంగా ఉంది. ఇదే.. ఫైటర్ జెట్స్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
మాజిద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. ఓ షార్ట్ రేంజ్ , లో-ఆల్టిట్యూడ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్. తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, హెలికాప్టర్లను అడ్డుకుంటుంది. దీనికి సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. ఈ వ్యవస్థ రాడార్ సిగ్నల్స్‌పై ఆధారపడకుండా ప్రాక్సిమిటీ ఫ్యూజ్‌తో కలిపి పాసివ్ ఇన్‌ఫ్రారెడ్ డిటెక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దాంతో.. జెట్‌లోని రాడార్ వార్నింగ్ రిసీవర్లకు ఎలాంటి హెచ్చరిక అందదు. అందువల్ల, శత్రు విమానాలకు తాము టార్గెట్ అయ్యామనే విషయమే తెలియదు.
మాజిద్ డిఫెన్స్ సిస్టమ్ రేంజ్ 8 కిలోమీటర్లు, ఎత్తులో 6 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అందువల్ల, అమెరికా ఫైటర్ జెట్‌లు ఈ పరిధిలోనే పనిచేస్తూ ఉండటానికి అవకాశాలున్నాయ్. F-35 లాంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్ రాడార్ నుంచి తప్పించుకుంటాయి కానీ, ఇంజిన్ నుంచి వచ్చే వేడిని దాచలేవు. మాజిద్ డిఫెన్స్ సిస్టమ్ ఈ హీట్‌ని గుర్తించి ఎటాక్ చేస్తుంది. ఇది రేడియో వేవ్స్ కాకుండా ఇన్‌ఫ్రారెడ్ రేస్‌ని వాడుతుంది.
సో, శత్రువులు చేసే జామింగ్ దీనిపై పెద్దగా పనిచేయదు. పైగా ఇది దాడి చేసేటప్పుడు మాత్రం ఇన్‌ఫ్రారెడ్ గైడెన్స్‌ను వాడుతుంది. దీని పరిధి 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఒకేసారి అనేక టార్గెట్లని మానిటర్ చేస్తుంది. అందుకే, అమెరికన్ ఫైటర్ జెట్స్ ఇరాన్ గగనతలంలో ఏమీ చేయలేకపోతున్నాయి. అటు యుద్ద విమానాలను పంపి తన ఎయిర్ ఫోర్స్‌ని తగ్గించుకోవడం అమెరికాకు ఇష్టం లేదు. అందుకే చర్చల వైపే మొగ్గు చూపుతోంది.
గతేడాది జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత.. ఇరాన్ తన వ్యూహలను, రక్షణ వ్యవస్థలను పూర్తిగా మార్చేసింది. ఫిక్స్‌డ్.. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల నుంచి తప్పుకుంది. ఇరాన్ దగ్గరున్న అనేక గగనతల రక్షణ వ్యవస్థలు.. ఇప్పుడు అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీస్, సొరంగాలు, కఠినమైన తీరప్రాంత భూభాగాల్లో దాచిపెట్టి ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్.. రోజూ ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు చేస్తున్నా.. ఇరాన్ మిసైల్ లాంఛర్లలో సగం చెక్కుచెదరకుండా ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది.
అంతకుముందు, ఇరాన్ దగ్గర సుమారు 20 నుంచి 25 శాతం మిసైల్ లాంఛర్స్ మాత్రమే మిగిలినట్లు ఇజ్రాయెల్ సూచించింది. కానీ, రహస్య గుహలు, సొరంగాల్లో పాతిపెట్టిన వేలాది మిసైళ్ల గురించి ఇజ్రాయెల్‌కు తెలిసినట్లు లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఇరాన్.. మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంఛర్లలోనూ పెట్టుబడి పెట్టింది. ఇవి వేగంగా తమ స్థానాలను మార్చుకోగలవు. అందువల్ల, వీటిని గుర్తించడం, ధ్వంసం చేయడం కష్టతరం. బేసిగ్గా ఇది.. షూట్ అండ్ స్కూట్ వ్యూహం. అంటే, ఈ లాంచర్లను టార్గెట్ చేసుకోకముందే కాల్పులు జరిపి, వేరే చోటుకి వెళ్లిపోతారు.
చైనాకు చెందిన అత్యంత అధునాతన లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ అయిన HQ-9Bని కూడా ఇరాన్ ఉపయోగిస్తుండొచ్చనే వాదనలున్నాయ్. ఇందులో రాడార్, ఇన్‌ఫ్రారెడ్ గైడెన్స్ రెండూ ఉండటం వల్ల, F-35 వంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ని ఎదుర్కొనేందుకు, ఎలక్ట్రానిక్ జామింగ్‌ని నిరోధించడానికి మరింత సన్నద్ధంగా ఉంటుంది. ఇలా.. రకరకాల ఫ్యాక్టర్స్.. మధ్య ఇరాన్‌లోని గగనతలాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేశాయ్. శత్రు విమానాలకు మృత్యు ఉచ్చుగా మారింది. ఇప్పట్లో.. ఇరాన్ గగనతలంపై అమెరికా ఆధిపత్యం సాధిస్తుందనే విషయంలో గ్యారంటీ లేదంటున్నారు.
Also Read: పర్యాటకులకు బంపర్ ఆఫర్.. ఇకపై వాట్సాప్‌లోనే టూర్ టికెట్స్.. ఎలాగో తెలుసా?
Story by: Anup, Big Tv