దసరా పండుగ రోజున జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకోవడం వెనుక ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉంది. పండుగ దినాన ఆలయ్ బలాయ్‌తో ఆలింగనం చేసుకుంటారు. తమ చేతిలో ఉన్న జమ్మీ ఆకులనే బంగారంగా భావించి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు. నాకు బంగారం పెట్టవా? ఇదిగో నా బంగారం తీసుకోవా? అంటూ ఆ జమ్మీ ఆకులనే బంగారంగా తలిచి ఇచ్చుకుంటారు. ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది? తెలంగాణలో ప్రధానంగా బంగారంగా పిలుచుకునే ఈ సంస్కృతి ఇతర ప్రాంతాల్లో కూడా ఉందా? దీని వెనుక ఉన్న నేపథ్యం ఏమిటీ? తెలంగాణలో బంగారాన్ని పరస్పర పంచుకునే క్రమంలో ఒకరికొకరు ఇచ్చుకునే సందేశమేమిటీ? తెలుసుకుందాం.
మహాభారతం ప్రకారం, పాండవులు తమ 12 ఏళ్ల వణవాసం పూర్తి చేసుకుని, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కోసం వెళ్లేటప్పుడు వారి దివ్య ఆయుధాలను జమ్మి చెట్టు పైనే దాచిపెట్టారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయదశమి రోజున పాండవులు ఆ ఆయుధాలను తిరిగి తీసుకుని, శమీ వృక్షాన్ని పూజించి యుద్ధంలో విజయం సాధించారు. శమీ వృక్షం వారి ఆయుధాలను సురక్షితంగా దాచి, విజయానికి కారణమైనందున ఈ ఆకులను విజయానికి, సంపదకు చిహ్నంగా (బంగారంగా) భావిస్తారు.
దీని వెనుక మరో గాథను కూడా చెబుతున్నాయి పురాణాలు. రఘు వంశానికి చెందిన రఘు మహారాజు దానధర్మాలు చేసి తన సంపదనంతా కోల్పోతాడు. ఆ సమయంలో ‘కౌత్సుడు’ అనే బ్రాహ్మణుడు గురుదక్షిణ ఇవ్వాలని.. రాజు వద్దకు వచ్చి 14 కోట్ల బంగారు నాణేలు అడుగుతాడు. రాజు వద్ద ధనం లేకపోవడంతో, ఆయన సంపదల దేవుడైన కుబేరుడిపై యుద్ధానికి సిద్ధమవుతాడు. దీనికి భయపడిన కుబేరుడు ఆ నగరంలోని జమ్మి వృక్షాలపై బంగారు నాణేల వర్షం కురిపిస్తాడు. రాజు ఆ బంగారాన్ని కౌత్సుడికి ఇవ్వగా, మిగిలిన బంగారాన్ని ప్రజలు పంచుకుంటారు. ఈ ఘటన విజయదశమి నాడే జరగడంతో ఈ చెట్టు ఆకులను బంగారంగా భావించే ఆనవాయితీ వచ్చిందని కూడా చెబుతారు.
భారతదేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో దసరా రోజున ఈ ఆకులను ‘సోనా’గా పిలుచుకుంటారు. సోనా అంటే తెలుగులో బంగారం అన్నమాట. ఈ బంగారాన్ని పరస్పరం పంచుకుంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాంతీయ వ్యత్యాసం ఉంది. తెలంగాణలో జమ్మి చెట్టు ఆకులను బంగారంగా పంచుకుంటే, మహారాష్ట్ర, గుజరాత్ లలో ‘ఆప్తా’ అనే మరో రకం చెట్టు ఆకులను ‘సోనా’గా పిలుస్తూ మార్చుకుంటారు. మహారాష్ట్రలో ప్రజలు ఈ ఆకులను ఇస్తూ “సోనా ఘ్యా, సోన్యాసార్ఖే రహా” అని ఆశీర్వదిస్తారు. అంటే.. బంగారం తీసుకోండి, బంగారంలాగే ప్రకాశిస్తూ ఉండండి అని దీని అర్థం. చారిత్రకంగా మరాఠా యోధులు యుద్ధాల నుంచి విజయవంతంగా తిరిగి వచ్చినప్పుడు శత్రువుల నుంచి తెచ్చిన బంగారాన్ని, సంపదను దేవుడి పాదాల చెంత ఉంచి, ఆపై ఆప్తా ఆకులను బంగారానికి ప్రతీకగా పంచుకునేవారు.
దసరా రోజు జమ్మీ ఆకులను తెచ్చి ఇంట్లోని పెద్దల కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. స్నేహితులు, బంధువులకు “బంగారం” అంటూ ఆకులను ఇస్తారు. ఎదుటివారు కూడా తిరిగి తమ వద్ద ఉన్న జమ్మి ఆకును “బంగారం” అంటూ తిరిగి ఇస్తారు. అలా ఇవ్వకపోతే తాము వారికి బాకీ పడినట్టుగా కూడా నమ్ముతారు. అందుకే ఎవరికీ బాకీలు పడి ఉండకుండా ఉండేందుకు, బంగారం తీసుకున్నప్పుడు, తిరిగి మళ్లీ తమ వద్ద ఉన్న బంగారాన్ని వారికి ఇచ్చేయడం కూడా ఈ పండుగలో కొనసాగుతూ వస్తున్న ఆచరంగా చెప్పవచ్చు.
అంటే, బంగారం రావాలి, కానీ తాము అప్పుల పాలు కాకూడదు… అనే భావంతో పాటు.. ఇతరులకు కూడా తాము బంగారం పంచాలి, దీని వల్ల అవతలి వారు కూడా సంక్షేమంగా ఉండాలనే ఇతరుల మేలు కోరుకునే మంచి ఉద్దేశ్యం కూడా ఇందులో ఇమిడి ఉందని అర్థం చేసుకోవాలి. జమ్మి ఆకులను ఇంట్లోని బీరువాల్లో లేదా డబ్బులు దాచుకునే పెట్టెల్లో దాచుకుంటే… ఆ సంవత్సరం అంతా లక్ష్మీ దేవి కటాక్షం కలిగి, ధన ధాన్యాలు వృద్ధి చెందుతాయని గట్టి నమ్మకం. జ్యోతిష్య పరంగా శని దోషాలు తొలగిపోవడానికి కూడా ఈ శమీ పూజ తోడ్పడుతుందని విశ్వసిస్తారు.