Hyderabad Techie Dies: అతడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. డబ్బులకు కొదవలేదు. ఆ తర్వాత షేర్ మార్కెట్ వైపు చూశాడు. భారీగా నష్టాలు రావడం మొదలైంది. తట్టుకోలేక మనస్తాపానికి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ సిటీలో వెలుగు చూసింది.
హైదరాబాద్ సిటీలోని ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు 34 ఏళ్ల తమ్మిశెట్టి ప్రవీణ్. దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురి ఏరియాలో ఉంటున్నాడు. జీతం కూడా బాగా ఉండడంతో మూడు నెలల కిందట వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా ప్రవీణ్.. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. ఇటీవలకాలంలో మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా నష్టాల బాట పడుతోంది. ఆ విధంగా నష్టపోయినవారిలో ప్రవీణ్ కూడా ఒకడు.
నష్టాల కారణంగా పెట్టిన డబ్బులు అంతా పోగొట్టుకున్నాడు. చివరకు మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ విషయం కుటుంబసభ్యులు, బంధువులకు తెలిస్తే పరువు పోతుందని భావించాడు. ఏం చేస్తే ఈ గండం నుంచి గట్టెక్క వచ్చని భావించారు. పరిపరి విధాలుగా ఆలోచించాడు.. ఆలోచన తట్టలేదు. చివరకు ఆత్మహత్య శరణ్యమని భావించాడు.. చైతన్యపురిలోని ఓ భవనంపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తీవ్రంగా గాయాలు కావడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురించి సమాచారం తెలియగానే చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ డీటేల్స్ సేకరించిన పోలీసులు, ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఘటనతో ప్రవీణ్ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ALSO READ: అలియాబాద్‌లో విషాదం.. చెట్టును ఢీకొన్న బైక్, ఇద్దరు యువకులు మృతి