Nidhhi Agerwal: అభిమానం అదుపు తప్పితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని చెప్పడానికి.. హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఎదురైన అనుభవమే లేటెస్ట్ ఎగ్జాంపుల్. సెలబ్రిటీలెవరైనా పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తే.. వారు పడే ఇబ్బందుల గురించి అందరికీ తెలుసు. కానీ.. నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ అలాంటిది కాదు. అంతకుమించి! ఫ్యాన్స్ ముసుగులో ఉన్న మృగాలు ఎంత అసభ్యంగా ప్రవర్తించాయంటే.. మాటల్లో చెప్పలేం! అసలు.. హీరోయిన్ కనిపిస్తే ఎగబడి పైన పడిపోవాల్సిందేనా? నిధి అగర్వాల్ ఘటనని ఎలా చూడాలి?
రాజాసాబ్ ప్రమోషన్స్‌లో భాగంగా సాంగ్ లాంఛ్ ఈవెంట్
రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు మాల్‌లో సాంగ్ లాంఛ్ ఈవెంట్‌ని ప్లాన్ చేసింది మూవీ యూనిట్. హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌తో పాటు డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ హాజరయ్యారు. హీరోయిన్లు వస్తున్నారని తెలిసి.. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. మూవీ యూనిట్‌ని ఇబ్బంది పెట్టారు. హీరోయిన్లు కూర్చున్న సోఫాల మీదకు దూసుకొచ్చారు. ఎంతా వారించినా వినిపించుకోలేదు. ఈ సమయంలోనే.. హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది.
నిధి అగర్వాల్‌ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్..
ఈవెంట్ ముగిశాక తిరిగి వెళ్లే సమయంలో నిధి అగర్వాల్‌ని ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసేశారు. బయటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకుండా.. అంతా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. కారు దగ్గరకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకుండా.. తోపులాట మొదలైంది. ఫ్యాన్స్ ఆమెని చుట్టుముట్టి, తాకే ప్రయత్నం చేయడంతో.. ఎంతగానో ఇబ్బంది పడింది. తీవ్ర అసహనానికి గురైంది. సెక్యూరిటీ కూడా.. ఫ్యాన్స్‌ని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయారు. ఎట్టకేలకు అక్కడి నుంచి బయటపడింది నిధి అగర్వాల్. మాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, కార్ ఎక్కిన తర్వాత.. నిధి ఫేస్ చూస్తే తనెంత భయపడిందో, ఫ్యాన్స్ చేసిన అతికి ఎంతలా వణికిపోయిందో క్లియర్‌గా కనిపిస్తోంది.
నిధిని బయటకు తీసుకొచ్చేందుకు మినీ యుద్ధం
ఓ వైపు నుంచి అభిమానులంతా తోసుకుంటూ మీదపడిపోతున్నారు. మరోవైపు.. జనాన్ని కంట్రోల్ చేయలేక నానా అవస్థలు పడి హీరోయిన్‌ని బయటకు తీసుకొచ్చేందుకు.. సెక్యూరిటీ సిబ్బింది మినీ యుద్ధం చేసినట్లనిపించింది. చివరకు ఎలాగోలా కారు ఎక్కిన నిధి.. ఇదంతా ఏంటని చిరాకు పడ్డారు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశారు. మూవీ ప్రమోషన్స్‌కి వచ్చి నిధి అగర్వాల్‌కి.. ఫ్యాన్స్ ఇలా నరకం చూపించారు. ఈ ఘటనపై.. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయ్. ఈవెంట్ మేనేజర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బందిపెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. అభిమానం ఉండొచ్చు.. కానీ మరి ఇలానా? అభిమానం అదుపుతప్పితే.. సెలబ్రిటీలకు నరకం కనిపిస్తుంది. నిధి అగర్వాల్‌కు ఎదురైన ఈ అనుభవం చూస్తే ఏ హీరోయిన్‌కైనా ఒళ్లు జలదరిస్తుంది. హద్దులు దాటి ప్రవర్తించిన అభిమానులు.. ఫోటోలు, సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఎగబడటం, ఆమెను తాకడం, తోసేయడం లాంటి పనులు చూసి.. నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. నిధి అగర్వాల్ కారెక్కిన తర్వాత.. ఓ మై గాడ్ అంటూ షాక్‌లో కనిపించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిధి అగర్వాల్ ఘటనపై సింగల్ చిన్మయి ఆగ్రహం
ఈ ఘటనపై.. సింగల్ చిన్మయి కూడా స్పందించారు. వీళ్లు మగాళ్లు కాదు.. జంతువుల కంటే హీనంగా ప్రవర్తించే మృగాళ్లని.. ఇలాంటి వారిని ఈ గ్రహం ఉంచొద్దని.. వేరే గ్రహానికి పంపేయాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ.. ఇలా హీరోయిన్లని వేధించడం పట్ల ఫైర్ అయ్యారు. సెలబ్రిటీల కంటూ ప్రైవసీ ఉంటుందని.. వారిని గౌరవించడం నేర్చుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిన్మయి. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియా యూజర్లు కూడా ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ఇది అభిమానం కాదని.. పక్కా వేధింపులేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా ప్రమోషన్లలో.. ఇలాంటి సెక్యూరిటీ వైఫల్యాలు ఉండటమేంటని.. మేకర్స్‌ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయని.. ఫ్యాన్స్ తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఘటనపై.. కేపీహెచ్‍బీ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. మాల్, ఈవెంట్ నిర్వాహకులు.. పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని తెలిపారు.
అసలు.. పబ్లిక్ ప్లేసుల్లో హీరోయిన్లు, సెలబ్రిటీలు కనిపిస్తే.. ఎగబడాల్సిందేనా? అవకాశం దొరికిందని.. అసభ్యంగా తాకాల్సిందేనా? నిధి అగర్వాల్ ఘటనలో.. ఫ్యాన్స్ చేసిన అతి నేర్పిన పాఠమేంటి? అభిమానుల ముసుగులో ఉన్నది.. మగాళ్లా? మృగాలా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తే.. సెలబ్రిటీలు జనంలోకి వచ్చే సాహసం చేయగలరా? అభిమానులు హద్దులు దాటకుండా ఉండలేరా?
కొందరి వికృత చేష్టలకు పరాకాష్టగా ఘటన
అభిమానం అనేది అందమైన భావం! అది విచక్షణ కోల్పోయి ఉన్మాదంగా మారితే.. ఎదుటివారికి నరకాన్ని చూపిస్తుంది. హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఎదురైన చేదు అనుభవం.. కలచివేసే విషయమే కాదు.. సెలబ్రిటీల పట్ల కొందరు ప్రదర్శిస్తున్న వికృత చేష్టలకు పరాకాష్టగా నిలిచింది. ఇది.. సమాజం అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం. అభిమానం పేరుతో ఇలాంటి పైశాచిక పనులు మనుషులే చేస్తున్నారా? మృగాలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఇది కేవలం.. ఓ నటికి జరిగిన అవమానం మాత్రమే కాదు. ఆమె ఎదుర్కొన్న అసభ్యత.. పబ్లిక్ ప్లేస్‌ల్లో.. మహిళల భద్రత, అభిమానుల ఆలోచనా ధోరణికి అద్దం పట్టిన ఘటన. మన సమాజం ఎటు వెళ్తుందో చెప్పే ఆందోళనకరమైన హెచ్చరిక. అభిమానం అదుపు తప్పితే కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు.. ఇదే ఎగ్జాంపుల్.
ఈ ప్రవర్తన వల్ల నిజమైన అభిమానులకు చెడ్డపేరు
సెలబ్రిటీలను, హీరోయిన్లని ఇష్టపడటం, వారిని చూడాలని ఆరాటపడటం సహజం. కానీ.. వారిని తాకాలని చూడటం, వారు కనిపిస్తే ఎగబడటం, అనుమతి లేకుండా ప్రైవసీని దెబ్బతీయడం ఏమాత్రం సరైంది కాదు. అవకాశం దొరికింది కదా అని.. ఓ మహిళను అసభ్యంగా తాకడమనేది.. వారి వికృత మానసిక స్థితికి నిదర్శనం. అభిమాని ముసుగు వేసుకుని ఇలాంటి పనులు చేసేవారు మనుషులు అనిపించుకోరు. ఇలాంటి ప్రవర్తన వల్ల నిజమైన అభిమానులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. నిధి అగర్వాల్ ఘటనలో.. ఫ్యాన్స్ ముసుగులో కొందరు ప్రవర్తించిన తీరు చూస్తుంటే, అది అభిమానం కాదు, కచ్చితంగా.. ఉన్మాదమే అనిపిస్తోంది. చాలా మంది అభిమానులు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. సెలబ్రిటీలంటే.. పబ్లిక్ ప్రాపర్టీ కాదు. వెండితెరపై కనిపించే హీరో,హీరోయిన్లు వారి నటనతో మనల్ని అలరిస్తారు. అందంతో.. ముగ్ధుల్ని చేస్తారు. అంతమాత్రాన.. వారు మన సొంతమని.. వారిని ఎలాగైనా తాకొచ్చని అనుకోవడం.. మూర్ఖత్వమే అవుతుంది. మనలాగే.. సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత గౌరం, ప్రైవసీ అనేవి ఉంటాయ్. అది.. వారి హక్కు. వారిని తాకాలన్నా.. వారితో ఫోటో దిగాలన్నా వారి అనుమతి తప్పనిసరి. ఈ కనీస సంస్కారం కూడా మర్చిపోయే ప్రవర్తిస్తే ఎలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.
సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం పెద్ద వైఫల్యం
నిధి అగర్వాల్ ఘటనలో.. భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారని తెలిపినప్పుడు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఒక వైఫల్యమైతే.. అభిమానులు విచక్షణ కోల్పోయి పశువుల్లా ప్రవర్తించడం మరో ఆందోళనకరమైన విషయం. నిధి అగర్వాల్‌ని చుట్టుముట్టి, ఆమెకు ఊపిరాడనివ్వకుండా చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చూశాక.. అక్కడ ఉన్నది మనుషులేనా? అనే సందేహం చాలా మందికి కలిగింది. ఇలాంటి చేదు అనుభవాల వల్ల సమాజంలోనూ, సినిమా ఇండస్ట్రీలోనూ తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఇలాంటి వేధింపులకు గురైన నటీనటులు.. తీవ్రమైన ట్రామాకు లోనయ్యే అవకాశం ఉంది. మరోసారి.. పబ్లిక్‌లోకి, మూవీ ప్రమోషన్స్‌కి రానవాలంటేనే.. భయపడే పరిస్థితులు ఏర్పడతాయ్. ఫ్యాన్స్ అత్యుత్సాహం చూశాక.. సెలబ్రిటీలు సామాన్య ప్రజలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. దీనివల్ల.. నిజమైన అభిమానులు కూడా వారిని దగ్గరగా చూసే అవకాశం కోల్పోతారు. ఇలా.. విచక్షణ కోల్పోయిన కొందరి వల్ల.. ప్రభుత్వం కూడా పబ్లిక్ ఈవెంట్స్‌పై కఠినమైన నిబంధనలు విధించే అవకాశం ఉంటుంది.
Also Read: భారత్-ఒమన్ ఒప్పందాలు.. ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం..
ఇక్కడ మారాల్సింది ఈవెంట్ నిర్వాహకులో.. సెలబ్రిటీలో కాదు. అభిమానుల్లోనే మార్పు రావాలి. తాము అభిమానించే నటీ,నటులెవరైనా జనంలోకి వస్తే.. వారిని తప్పకుండా గౌరవించాలనే భావన ప్రతి అభిమానిలో ఉండాలి. ముఖ్యంగా.. హీరోయిన్ల విషయంలో హద్దుల్లో ఉండాలి. హీరోయిన్లని గౌరవించడమంటే.. ఆమె ప్రైవసీని గౌరవించడమే. ఈవెంట్స్ మేనేజర్లు కూడా కేవలం పబ్లిసిటీపైనే కాకుండా.. ఆర్టిస్టుల రక్షణపైనా దృష్టి పెట్టాలి. సెలబ్రిటీల పట్ల, మహిళల పట్ల బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నిధి అగర్వాల్ ఘటన.. అతిగా ప్రవర్తించే అభిమానులందరికీ.. ఓ గుణపాఠం కావాలి. సినిమాల్లో కనిపించే వారు కూడా.. మనలాంటి సాధారణ మనుషులేనని గుర్తించాలి. అభిమానం అనేది గుండెల్లో ఉండాలి గానీ.. చేతల్లో వికృతంగా మారకూడదు. సెలబ్రిటీలను చూడగానే ఉత్సాహం రావడం సహజం. కానీ.. ఆ ఉత్సాహం వ్యక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. నటీనటులను ఆరాధించడం తప్పు కాదు. కానీ ఆ ఆరాధనలో సంస్కారం లేనప్పుడు అది నేరమే అవుతుంది. అయినా.. అభిమానం అంటే అవమానించడం కాదు.. అందరిలో గౌరవించడం అని.. ఫ్యాన్స్ తెలుసుకోవాలి.
Story By Anup, Bigtv