తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నరకాల వడ్లకు భారీ గిరాకీ పెరిగింది. పొరుగు రాష్ట్రలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని దళారులు రెండు తెలుగు రాష్ట్రాలపై పడ్డారు. కోతల దశకు రాకముందే అడ్వాన్సులు ఇస్తున్నారు. వరికోతలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి క్వింటాలుకు రూ.4వేలు ఆపై ఇచ్చి మరీ కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు.
ఎల్‌నినో కరువు నేపథ్యంలో వచ్చే సీజన్‌కు వరి వేయొద్దని సర్కార్ అప్రమత్తం చేయడమే పాపమైంది. బహిరంగ మార్కెట్లో దళారులు సన్నబియ్యాన్ని బ్లాక్ చేసేశారు. దీంతో దీని ధర మొన్నటి వరకు కిలోకు రూ. 60 నుంచి రూ. 70 వరకు ఉండగా ఇప్పుడు కిలోకు రూ. 90 నుంచి వందకు పై చేరింది. బియ్యం ధరలతో బెంబేలెత్తిన ప్రజలు ముందస్తుగా ఒకేసారి కొనక్కోవడంతో ఈ ధర మరింత పెరుగుతూ వస్తోంది.
గతంలో ఇలా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు, వరి సాగుపై ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు క్వింటాలు ధరకు కొంచెం పెంచి ఇచ్చి తీసుకున్న ఉదంతాలున్నాయి. కానీ మరీ ఇంతలా ధర ఇచ్చి దళారులు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ముందస్తుగా వచ్చిన వరికోతలు ఆ రైంతాగానికి భారీ లాభాలనే తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు.
ఏపీలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ధర కూడా ఇలాగే చెల్లిస్తూ తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున దళారులు సన్నవడ్లన కొనుగోలు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సర్కార్‌కు ఇది ప్రత్యేక పరిస్థితులను తెచ్చి పెట్టింది. ఓ వైపు రైతులకు లాభం జరిగేలా రేటు ఇచ్చి కొనుగోలు చేయడాన్ని సర్కార్ ఆహ్వానిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వానికి కొనుగోలు భారం తగ్గి.. తక్షణ కర్తవ్యంగా ఇవ్వాల్సిన మద్దతు ధర, సన్నవడ్లకు బోనస్ నుంచి భారం తప్పినట్టేనని భావిస్తోంది.
అయితే, సన్నవడ్లన్నీ బయట రాష్ట్రాలు కొనుగోలు చేసుకుని పోతే..మరి సర్కార్ పీడీఎస్ ద్వారా అందించే సన్నబియ్యానికి ఎఫెక్ట్ కాదా? అనే కోణం కూడా సర్కార్‌ను ఇబ్బంది పెడుతోంది. ఈ సన్నబియ్యాన్ని మళ్లీ మిల్లర్ల వద్ద నుంచి కొనుగోలు చేస్తే.. ఆ ధరను పెట్టి కొనుగోలు చేయాలంటే తడిచి మోపెడవుతుంది. కేంద్రం వద్ద ఎఫ్‌సీఐలో కావాల్సిన దొడ్డు బియ్యం నిలువలున్నాయి. మరో ఏడాది వరకు రేషన్ బియ్యానికి కొరత లేదు. కానీ ఇక్కడ తెలంగాణలో సన్నబియ్యం ఇచ్చే పథకం ఉన్నందున.. ఈ తాజా పరిణామాలు సర్కార్‌కు పెనుభారంగా మారే పరిస్థితులు లేకపోలేదంటున్నారు.
దీంతో మొన్నటి వరకు ఏమాత్రం ఖజానాపై భారం లేకుండా సన్నబియ్యం పథకాన్ని సక్సెస్ ఫుల్‌గా అమలు చేసి.. ప్రజల వద్ద మైలేజీ పొందిన సర్కార్‌కు ఇప్పుడు ఇది గుదిబండలా మారే పరిస్థితులు తలెత్తేలా ఉన్నాయి. ఇంకా వరి కోతలు దాదాపు 60 శాతానికిపైగా ఉన్నాయి. ఇందులో ప్రతి సన్నరకం వడ్లు దళారులే కొనేలా ఉన్నాయి. రైతులు కూడా అధిక ధర వస్తున్నది కాబట్టి.. సర్కార్‌కు అమ్మరు. మరి ఈ సీజన్‌లో సన్నవడ్లు సర్కార్‌కు వచ్చే పరిస్థితే లేదు.
మరి వీటిని ఎలా పీడీఎస్ ద్వారా అందిస్తుంది..? అనేది కూడా రేవంత్ సర్కార్ ముందున్న ప్రధాన సమస్యలో ఒకటిగా మారనుంది.