E-Paper
Advertisement

Russia Snowstorm 2026: రష్యాను ముంచేసిన మంచు తుఫాన్.. మంచు మంచిదేనా..?

Russia Snowstorm 2026: రష్యాను  ముంచేసిన మంచు తుఫాన్.. మంచు మంచిదేనా..?

Russia Snowstorm 2026: ఇదంతా రియల్ స్నో. రష్యాలో ఇప్పుడున్న కనిపిస్తున్న ఈ సీన్లు చూస్తుంటే.. ఇది భూమి మీద ఉన్న ప్రాంతమేనా? ఏదైనా మంచు గ్రహమా? అనే డౌట్ వస్తుంది. రష్యాలో మంచు కురవడం కొత్తేమీ కాదు. కాని.. ఇప్పుడు కురుస్తున్న తీరు మాత్రం.. ఈ శతాబ్దపు మంచు తుఫాన్ అనిపించుకుంటోంది. గడిచిన కొన్నేళ్లలో.. ఎన్నడూ లేనంత స్థాయిలో రష్యాలోని కామ్చాట్కాని మంచు కమ్మేసింది. కమ్మేయడమంటే.. ఏదో అలా పైపైన కురిసి.. మోకాళ్లు ఎత్తు వరకు వచ్చేసి.. ఈజీగా పక్కకు తప్పించే స్థాయిలో కాదు. ఈసారి కురిసిన మంచు.. మనిషి ఎత్తుని మించిపోయింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లని కూడా ముంచేసింది.

మంచులో మునిగిన ఇళ్లు, కార్లు.. రష్యాలో అపూర్వ హిమపాతం

సాధారణంగా మోకాళ్ల లోతు మంచు కురిస్తేనే జనజీవనం స్తంభించిపోతుంది. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 10 నుండి 15 అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోయింది. రోడ్ల పక్కన ఆపిన కార్లు ఉన్నాయో? లేవో కూడా తెలియనంతగా మంచులో కూరుకుపోయాయి. గ్రామాల్లోని చిన్న చిన్న ఇళ్లు పూర్తిగా మంచు కింద ఉండిపోయాయి. ప్రజలు తమ ఇంటి తలుపులు తీయడానికి కూడా గంటల తరబడి మంచును తవ్వాల్సి వస్తోంది. రైళ్లు, విమానాలు నిలిచిపోవడమే కాదు.. హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. ఈ నెలలో ఇప్పటివరకు 2 మీటర్లకు పైగా హిమపాతం కురవడంతో.. బిల్డింగ్‌లు, అపార్ట్‌మెంట్లు, రోడ్లు అన్నీ పూర్తిగా మంచు తుఫాన్‌లో కూరుకుపోయాయ్. నగరమంతటా పదుల మీటర్ల ఎత్తులో మంచు పేరుకుపోయింది. రోడ్లపై కార్లు, ఇతర వాహనాల్ని కూడా మంచు పూర్తిగా కప్పేసింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలను నిలిపివేశారు. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో.. మంచు కొండల్లా పేరుకుపోయి, దారులన్నీ మూసుకుపోయాయ్. మంచు ఎంత లోతుగా ఉందంటే.. జనాలు ఇంటి కిటికీల నుంచి పేరుకుపోయిన మంచుపై నుంచి కిందకు జారుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయ్. గడిచిన 60 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన హిమపాతమని రష్యా వాతారవణశాఖ చెబుతోంది.

కామ్చాట్కాలో రికార్డు స్థాయి మంచు తుఫాన్‌.. ఎమర్జెన్సీ ప్రకటించిన రష్యా

కామ్చాట్కా వీధుల్లో 10 నుంచి 40 అడుగుల మేర మంచు కుప్పలు పేరుకుపోయాయి. అపార్ట్‌మెంట్ల నాలుగో అంతస్తు వరకు మంచు పేరుకుపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈస్ట్ రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో మంచు తుపాను, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కొత్తేమీ కాదు. కానీ.. ఈ మంచు తుఫాన్ పాత రికార్డులను బద్దలుకొట్టేసింది. దీనివల్ల.. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లు పూర్తిగా మూసుకుపోయాయ్. అనేక విమాన సర్వీసులు రద్దయిపోయాయ్. మంచు దెబ్బకు.. కామ్చాట్కాలో రష్యా అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. స్కూళ్లు, స్థానిక వ్యాపారాలు సైతం మూతబడ్డాయి. ప్రజలు రిమోట్ వర్కింగ్‌కి మారాల్సి వచ్చింది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో.. రవాణా వ్యవస్థ స్తంభించింది. దుకాణాలు, సూపర్ మార్కెట్లలో.. నిత్యవసర వస్తువులు కూడా అయిపోతున్నాయ్. వైరల్ అవుతున్న వీడియాల్లో పది అడుగుల కంటే ఎక్కువ మంచు కింద కార్లు కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. హైరైజ్ అపార్ట్‌మెంట్లపైనా మంచు పేరుకుపోయింది.

బయటకు వస్తే నిమిషాల్లోనే మంచు గడ్డలు..

ప్రపంచంలోనే అత్యంత శీతల నగరంగా పేరున్న రష్యాలోని యాకుటియా నగరం కూడా ఇప్పుడు గడ్డకట్టే చలితో విలవిలలాడుతోంది. ఉష్ణోగ్రతలు మైనస్ 56 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఈ టెంపరేచర్‌కి.. అక్కడ ఉండే ప్రజల కంటి రెప్పలు కూడా మంచుతో గడ్డకట్టుకుపోతున్నాయ్. చలి నుంచి తప్పించుకుని జీవించేందుకు జనం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటాయి. యాకుటియా నగరంలో కార్లను ఎప్పుడూ ఆఫ్ చేయకుండా ఆన్‌లోనే ఉంచుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. మల్టీ లేయర్ దుస్తులను ధరిస్తున్నారు. సైబీరియా రీజియన్‌లో ఉన్న ఈ సిటీలో.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాకుటియా, కామ్చాట్కాలో చలి ఎంత తీవ్రంగా ఉందంటే.. గాలిలోని తేమ కూడా వెంటనే గడ్డకట్టి మంచు పొగలా మారుతోంది. దీనివల్ల కనుచూపు మేర ఏమీ కనిపించట్లేదు. బయటకొస్తే నిమిషాల వ్యవధిలోనే కనురెప్పలపై మంచు గడ్డకడుతోంది. వేడి నీటిని గాల్లోకి చల్లితే.. ఈ నీరు కింద పడకముందే మంచు స్ఫటికాలుగా మారిపోతోంది. ఈ ప్రాంతంలో భారీ హిమపాతాలకు ప్రధాన కారణం.. వాయవ్య పసిఫిక్ మహాసముద్రంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడటమేనని వాతావరణ శాఖ తెలిపింది. దాని ఫలితంగానే బలమైన మంచు గాలులు, భారీగా మంచు కురుస్తుందని చెబుతున్నారు.

గడ్డకట్టే చలి, తెగిపోయిన విద్యుత్ లైన్లు.. రష్యా ప్రజల కష్టాలు

ప్రకృతి విరుచుకుపడితే.. మనిషి తట్టుకోవడం అసాధ్యమని రష్యాలో కురుస్తున్న మంచు నిరూపిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ప్రకృతి ప్రకోపం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతోంది. ఒకప్పుడు వేసవి కాలం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వరదలు, చలికాలం ఉండే చోట ఇలాంటి మంచు తుపానులు రావడం.. వాతావరణ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమయ్యేలా చేస్తోంది. రష్యాలో ఈ స్థాయికి మంచుకు కారణం.. నార్త్ పోల్ ‌పైన ఉండే అతి శీతల గాలుల సుడిగుండాలే. దీనినే.. ఆర్కిటిక్ వోర్టెక్స్ అంటారు. సాధారణంగా ఇది ధ్రువ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ వాతావరణ మార్పుల వల్ల ఈ సుడిగుండం బలహీనపడి, దక్షిణ దిశగా రష్యా, యూరప్ వైపు దూసుకొచ్చింది. దీనివల్ల ఆర్కిటిక్ ప్రాంతంలోని గడ్డకట్టే చలి.. రష్యా నగరాలను ముంచెత్తుతోంది. ఇక.. వాతావరణం వేడెక్కినప్పుడు సముద్రపు నీరు ఎక్కువగా ఆవిరై.. గాలిలో తేమ పెరుగుతుంది. రష్యా పక్కనే ఉన్న సముద్రాలు వేడెక్కడం వల్ల గాలిలో చేరిన తేమ, ఆర్కిటిక్ నుంచి వచ్చిన చలి గాలులను తాకగానే భారీ మంచుగా మారి కురుస్తోంది. ఈ భారీ మంచు వల్ల రష్యా ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. మంచు బరువుకు విద్యుత్ తీగలు తెగిపోయి, వేలాది గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. సప్లై చైన్ దెబ్బతినడంతో.. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయ్. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 40 నుంచి 50 డిగ్రీలకు పడిపోయాయి.

రష్యాలో ఈసారి ఇంత మంచు కురవడానికి గల కారణాలు

రష్యాలో వింటన్ సీజన్ ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. కానీ.. ఈసారి కురుస్తున్న మంచు అసాధారణంగా ఉంది. దీనికి అనేక కారణాలున్నాయ్. భూగోళం వేడెక్కుతున్నకొద్దీ.. ఉత్తర ధ్రువం దగ్గర వాతావరణం వేగంగా మారుతోంది. దీనివల్ల ధ్రువ ప్రాంతాల్లో ఉండాల్సిన అతి శీతల గాలులు కిందికి జారి సైబీరియా, రష్యా లాంటి ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఇంతటి భయంకరమైన చలిలో, మంచులోనూ రష్యన్లు జీవించగలుగుతున్నారంటే.. అది వారి లైఫ్ స్టైల్, వారికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల చలవే. మనమంతా చలి పెడితే.. ఒక స్వెటర్ వేసుకుంటే సరిపోతుంది. కానీ.. ఇక్కడలా కాదు. నాలుగైదు పొరలుగా దుస్తులను ధరిస్తారు. బయటకు వచ్చేటప్పుడు కళ్లు మాత్రమే కనిపించేలా లేయర్డ్ డ్రెస్సింగ్ ఉంటుంది. రష్యాలోని నగరాల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వమే.. హాట్ వాటర్ పైప్‌లైన్స్ ద్వారా సెంట్రల్ హీటింగ్ అందిస్తుంది. దీనివల్ల.. బయట మైనస్ 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా.. ఇంట్లో 20 డిగ్రీల వెచ్చదనం ఉంటుంది. అంతేకాదు.. శరీరంలో వేడిని పుట్టించే.. అధిక క్యాలరీలు ఉన్న ఆహారం, సూప్‌లు, వేడి పానీయాలను ఎక్కువగా తీసుకుంటారు.

ఈ చలి ప్రకృతి ఇస్తున్న తీవ్ర హెచ్చరిక

అయితే.. ఈ చలి ప్రకృతి ఇస్తున్న తీవ్ర హెచ్చరికగా భావిస్తున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు క్లైమేట్ ఇన్‌స్టెబిలిటీకి నిదర్శనం. ఉన్నట్టుండి ఎండలు మండిపోవడం, భారీ స్థాయిలో వరదలు రావడం, క్లౌడ్ బరస్ట్‌లు, ఇలా అసాధారణ రీతిలో మంచు కురవడం అనేది.. వాతావరణ సమతుల్యత దెబ్బతిందని చెప్పడానికి ఇదో సంకేతం. ఆర్కిటిక్ మంచు కరగడం వల్ల.. సముద్ర మట్టాలు పెరగడమే కాకుండా, భూమి ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ మొత్తం తలకిందులవుతోంది. మంచు కురవడం ప్రకృతికి అవసరమే. కానీ.. ఈ స్థాయిలో ఉండటం అంత మంచిది కాదు. మంచు కురవడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయ్. శీతాకాలపు పంటలకు కూడా ఇది మేలుచేస్తుంది. అయితే.. అతిగా మంచు కురిస్తే.. జన జీవం స్తంభిస్తుంది. అన్నికంటే ముఖ్యంగా.. పెర్మాఫ్రాస్ట్ కరగడం మొదలైతే.. వేళ ఏళ్లుగా భూమి లోపల దాగున్న ప్రమాదకరమైన వైరస్‌లు, మీథేన్ గ్యాస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది.. మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తుంది.

రష్యాలో కనిపిస్తున్న ఈ మంచు విలయం.. కేవలం ఆ ఒక్క దేశానికే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పుల్లో భాగమే. ప్రకృతిని మనం కాపాడుకోకపోతే, భవిష్యత్తులో ఇలాంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈ మంచు తుఫానులు మానవాళిని హెచ్చరిస్తున్నాయి.

Story by: Anup, Big Tv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×