Trump issues Warning: వెనెజుయెలా కథ ముగిసింది.. మరి ఇప్పుడు అమెరికా ఏ దేశంపై కన్నేసింది? ఇప్పుడిదే ప్రశ్నపై గ్లోబల్ పాలిటిక్స్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరి నిజంగానే అమెరికా మరో దేశాన్ని కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటుందా? అంటే ఔననే అంటున్నారు. ఆ ఔను అనేది ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. ఒక దేశం కాదు.. ఆయన ఏకంగా ఒక లిస్టే చెప్పారు. మరి నిజంగానే ట్రంప్ ఆ దేశాలపై దాడులు చేయబోతున్నారా? ట్రంప్ ఇమ్మిడియేట్‌గా ఏ దేశంపై దాడి చేసే అవకాశం ఉంది?
ఆపరేషన్ ఆబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో దాడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. ఇప్పటికే వెనెజుయెలాపై ఆపరేషన్ ఆబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో సైనిక దాడి చేశారు.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను తీసుకొచ్చి అమెరికా జైల్లో పడేశారు. నిజానికి వెనెజుయెలాలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని.. ఆ దేశం నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్నారంటూ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ట్రంప్ ఆరోపిస్తూనే ఉన్నారు. అదే సమయంలో దాడులు చేస్తామని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడీ మాటలను నిజం చేస్తూ ఓ స్పెషల్ ఆపరేషన్ చేపట్టి.. అన్నంత పని చేశారు. దీంతో వెనెజుయెలా కథ కంచికి చేరింది. అక్కడి పాలనను మేమే చూస్తామని.. అక్కడి చమురుపై అమెరికన్ సంస్థలదే పెత్తనమని ఓపెన్‌గా చెప్పేశారు కూడా ట్రంప్. నిజానికి ట్రంప్ చేసిన ఈ పనితో అమెరికా తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని ప్రపంచ దేశాలకు చెప్పకనే చెప్పింది.
లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలకు ట్రంప్ వార్నింగ్
ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ట్రంప్ వెనెజుయెలాలో ఆపరేషన్ సక్సెస్ తర్వాత మరో స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కాస్త కలవరపెడుతోంది. ఎందుకంటే పద్ధతి మార్చుకోకపోతే వెనెజుయెలా లాంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వస్తుందంటూ లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. సో ట్రంప్ నెక్ట్స్ ఏ దేశంపై టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. .
గ్రీన్ లాండ్‌కు సంబంధించి చాలా సార్లు వార్నింగ్‌లు
ట్రంప్ ఇదే స్పీడ్‌లో కంటిన్యూ అయితే నెక్ట్స్ ఏ దేశాన్ని టార్గెట్ చేస్తాడనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. దీనికి ఇప్పుడు అందరూ ముక్త కంఠంతో చెబుతున్న సమాధానం గ్రీన్‌లాండ్. ఇదేదో మాట వరుసకి చెబుతున్న మాట కాదు. ట్రంప్ ఇప్పటికే గ్రీన్‌లాండ్‌కు సంబంధించి చాలా సార్లు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం డెన్మార్క్ పాలనలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామన్నారు ట్రంప్. ఇప్పుడీ వ్యాఖ్యలను మరింత బలపరిచేలా ఒక ఘటన జరిగింది. డొనాల్డ్ ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ రీసెంట్‌గా ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్‌లాండ్ మ్యాప్‌ను.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానికి సూన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే అమెరికా నెక్ట్స్ టార్గెట్ గ్రీన్‌లాండ్ అని చెప్పకనే చెప్పారా? అనే డౌట్ ఇప్పుడు మొదలైంది.
చమురు, ఖనిజాలు ఉన్న దేశంపై అమెరికాకు ప్రేమ
మరి ట్రంప్‌కు గ్రీన్‌లాండ్‌పై ఎందుకంత ఇంట్రెస్ట్? అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చమురు, ఖనిజాలు ఏ దేశంలో ఉంటే.. ఆ దేశంపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తుంది అమెరికాకు. ఇది చరిత్ర చెబుతున్న నగ్నసత్యం. వెనెజుయెలాలో ప్రజాస్వామ్యం, అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురో దుర్మార్గాలపై అంత ఫోకస్ చేయడానికి కారణం.. అక్కడ ఉన్న చమురు నిక్షేపాలే అనేది ఓపెన్ సీక్రేట్. ఇప్పుడు గ్రీన్‌లాండ్ విషయంలో కూడా ఇదే పాలసీ ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్ అనేది ఓ మంచు ప్రాంతం. ప్రస్తుతం డెన్మార్క్ ఆధీనంలో ఉంది ఈ ప్రాంతం. అయితే ఇక్కడి మంచు కింద ఊహించని స్థాయిలో సహజ వనరులు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఆయుధాల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ మెటల్స్ గ్రీన్‌లాండ్‌లో పుష్కలం. ప్రస్తుతం ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్‌పై చైనాదే పెత్తనం. ఆ పెత్తనానికి తలొగ్గే చైనా విషయంలో కాంప్రమైజ్ అవుతూ వస్తోంది అమెరికా. అలా కాంప్రమైజ్ కాకుండా ఉండాలన్నా.. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలన్న గ్రీన్‌లాండ్ అమెరికా కంట్రోల్‌లో ఉండాలి.
ఆర్కిటిక్ ఏరియాలో రష్యా, నా సైనిక స్థావరాలు
నాటో ఓన్లీ రేర్ ఎర్త్ మెటల్స్.. గ్రీన్‌లాండ్‌లో కూడా భారీగా క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయనేది అంచనా. ఇది కూడా అమెరికాకు కలిసి వచ్చే అంశం. ఇది మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆర్కిటిక్ ఏరియాలో రష్యా, చైనా తమ సైనిక స్థావరాలను పెంచుతూ వస్తున్నాయి. సో.. గ్రీన్‌లాండ్ తమ కంట్రోల్‌లో ఉంటే.. మంచు ఖండంపై ఈ రెండు దేశాల ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చనే ఆలోచన కూడా ఉంది. ఇక్కడ ఇప్పటికే అమెరికాకు చెందిన పిటూఫిక్ స్పేస్ బేస్ ఉంది. రష్యా లేదా ఇతర దేశాల నుండి వచ్చే మిసైల్స్‌ను గుర్తించడానికి.. స్పేస్‌పై నిఘా వేయడానికి ఇది అత్యంత కీలకమైన కేంద్రం. అక్కడితో అయిపోలేదు.. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు చాలా వేగంగా కరుగుతుంది.. ఇదే జరిగితే ఆర్కిటిక్ గుండా కొత్త షిప్పింగ్ లైన్స్ అందుబాటులోకి వస్తాయి. ఆ పరిస్థితి రావడానికి ముందే గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలనేది అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది.
అమెరికా చరిత్రలో తన ప్రత్యేకత ఉండాలనుకునే ట్రంప్
గ్రీన్‌లాండ్‌ను అమెరికా చేజిక్కించుకుంటే ఇన్ని ప్రయోజనాలతో పాటు.. ట్రంప్‌కు మరో లాభం కూడా ఉంది. అమెరికా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనేది ఓ కోరిక. పేరు ప్రఖ్యాతులు అంటే ట్రంప్‌కు ఎంత పిచ్చో ఇప్పటికే నోబెల్ పీస్ డీల్ విషయంలో చూశాం. 1867లో అమెరికా రష్యా నుంచి అలాస్కాను కొనుగోలు చేసింది. తాను కూడా గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేసి అమెరికా భూభాగాన్ని విస్తరించిన గొప్ప అధ్యక్షుడిగా మిగిలిపోవాలనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది.
గ్రీన్ లాండ్ నాట్ ఫర్ సేల్ అంటూ కౌంటర్లు
మరి ఇది అంత సులువా? అంటే కానే కాదని చెప్పాలి. ఎందుకంటే డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలు ట్రంప్‌కు ఎప్పటికప్పుడు కౌంటర్ వేస్తూనే ఉన్నాయి. గ్రీన్‌లాండ్ నాట్ ఫర్ సేల్ అంటూ ఖరాకండిగా చెబుతూ వస్తున్నాయి. వెనెజుయెలా ఇష్యూ తర్వాత.. గ్రీన్‌లాండ్‌పై కూడా అలాంటి ఆపరేషన్ చెప్పట్టే అవకాశం లేకపోలేదనే చర్చ అయితే జరుగుతోంది. కానీ ఈ విషయంలో ట్రంప్ సైన్యాన్ని వాడకుండా.. టారిఫ్‌లను వాడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
మళ్లీ భారీగా టారిఫ్ లు పెంచి ఒత్తిడి పెంచే అవకాశం
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఫేవరేట్ ఆయుధంగా టారిఫ్‌ను మార్చుకున్నారు. ఇప్పుడీ ఆయుధాన్ని డెన్మార్క్‌పై ఉపయోగించే అవకాశం ఉంది. డెన్మార్క్ నుంచి అమెరికాకు వచ్చే ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు, ఆహార ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు పెంచి ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. గ్రీన్‌లాండ్ ఇవ్వకపోతే మిమ్మల్ని నాశనం చేస్తామని చెప్పకనే చెప్పే అవకాశం లేకపోలేదు. డెన్మార్క్‌పై సైనిక ఆపరేషన్ నిర్వహించే చాన్స్ లేదు. ఎందుకంటే డెన్మార్క్ అనేది నాటోలో సభ్య దేశం. నాటో సభ్య దేశం కావడంతో అమెరికా అక్కడ మిలటరీ బేస్‌లను ఏర్పాటు చేసి.. రక్షణ ఇస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది. ఇప్పుడు తాము ఇస్తున్న రక్షణకు ఎక్కవ చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు.
డెన్మార్క్ ను నుంచి విడిపోయేలా పరిస్థితులు కల్పించే అవకాశం
అమెరికా మరో పని చేసే అవకాశం కూడా లేకపోలేదు. డెన్మార్క్‌ను నుంచి విడిపోయి అమెరికాలో కలిసి పోవాలనేలా ప్రజల అభిప్రాయాన్ని మార్చే పని కూడా ఇప్పటికి చాలా రోజులు ముందునుంచే జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో ట్రంప్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఒక్క గ్రీన్‌లాండ్ మాత్రమే కాదు.. అమెరికా హస్తగతం చేసుకోవాలనుకునే లిస్ట్‌లో మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి.
గ్రీన్‌లాండ్ ఎందుకు ముఖ్యమో.. అమెరికాకు ఎంత అవసరమో చెప్పుకున్నాం కదా.. ఇప్పుడు మిగతా దేశాలను చూద్దాం. అమెరికా చుట్టుపక్కలే ఉంటూ ఆ దేశాన్ని చికాకు పెడుతున్న దేశాలు ఇంకొన్ని ఉన్నాయి. మేమే ఎన్నో దేశాల్లో చిచ్చు పెడతాం.. అలాంటిది మా దేశంలో మీరు ఇలా రెచ్చిపోతే ఎలా? అనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. అందుకే ఆయన ఇప్పుడు ఓ లిస్ట్‌ను రెడీ చేసుకున్నారు. అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్‌లో భాగంగానే ఇదంతా చేస్తున్నారా? ఇందుకోసం అమెరికా విదేశాంగ విధానంలో ఓ కొత్త సిద్దాంతాన్ని ట్రంప్ రూపొందించారా?
ఒక్క గ్రీన్‌లాండ్ మాత్రమే కాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ చేసే దేశాలు ఇంకా ఉన్నాయి. వెనెజుయెల్ సైనిక ఆపరేషన్ ముగిసిన తర్వాత.. ట్రంప్ నోటివెంట ఆపరేషన్ కొలంబియా అనే మాట వినిపించింది.
ట్రంప్ నోటి నుంచి ఆపరేషన్ కొలంబియా అనే మాట
ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తూ ట్రంప్ చేసిన కామెంట్స్ ఇవి. అయితే ట్రంప్ ఈ కామెంట్స్ చేయడం వెనక కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి. వెనెజుయెలాపై అమెరికా దాడిని కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో తీవ్రంగా ఖండించారు. నిజానికి ఆయన అమెరికా విధానాలను విమర్శిస్తూ వస్తున్నారు కూడా. దీంతో అమెరికాకు, కొలంబియాకు మధ్య విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ నోటి నుంచి ఆపరేషన్ కొలంబియా అనే మాట రావడంతో.. తమ టార్గెటెడ్ కంట్రీస్ లిస్ట్‌లో కొలంబియాను కూడా చేర్చారా అనే చర్చ మొదలైంది. లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికా ఆధిపత్యానికి అడ్డుగా నిలిచే ప్రభుత్వాలను మార్చడం అనే కాన్సెస్ట్‌లో భాగంగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది.
మదురో ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన క్యూబా
కొలంబియా మాత్రమే కాదు.. ట్రంప్ నోటి నుంచి వచ్చిన మరో రెండు దేశాల పేర్లు మెక్సికో, క్యూబా. మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్‌ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌తో పోలుస్తున్నారు ట్రంప్. ఇక క్యూబాలో ప్రస్తుతమున్న ప్రభుత్వం వెనెజుయెలాలో నిన్నా మొన్నటి వరకున్న మదురో ప్రభుత్వానికి చాలా మద్దతు ప్రకటించింది. సో.. ట్రంప్ ఈ రెండు దేశాలను శత్రు దేశాలగానే భావిస్తున్నారు. అంతేకాదు మదురో ఇంటర్నల్ సెక్యూరిటీ టీమ్ క్యూబా ఇంటెలిజెన్స్ టీమ్ కనుసన్నల్లోనే ఉంటుందనే సమాచారం ఉంది. సో.. మదురోకు ఇన్ని రోజుల పాటు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది క్యూబానే అని భావిస్తోంది అమెరికా. ఇది మాత్రమే కాదు.. క్యూబా, అమెరికా శత్రుత్వం ఇప్పటిది కాదు. దశాబ్ధాల నాటిది. అమెరికా పక్కనే ఉంటూ అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారిన దేశం క్యూబా. అందుకే సందట్లో సడేమియా అన్నట్టుగా పనిలో పనిగా క్యూబాలో కూడా తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేది అమెరికా ఆలోచనగా కనిపిస్తోంది.
అమెరికా సైనిక, సాంకేతికత శక్తి ముందు నిలవలేని దేశాలు
మరి కొలంబియా, క్యూబాలను తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవడం అమెరికాకు అంత సులువా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న సైనిక శక్తి, సాంకేతికత ముందు ఈ రెండు చిన్న దేశాలు ఏ మాత్రం నిలబడవు. దీనికి తోడు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, CIA చేసే కోవర్ట్ ఆపరేషన్‌లు మరింత అదనం. ఇక ఇజ్రాయెల్ మొసాద్ ఇచ్చే సహకారం అమెరికాకు మరింత శక్తిని ఇస్తుంది. సో.. నిజంగానే ట్రంప్ దాడులు చేయాలి.. ఆ దేశాలను తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలంటే పెద్ద కష్టమేమీ కాదు. కానీ దేశాలను చేజిక్కించుకోవడం ఎంత సులువో.. ఆ తర్వాత అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడం అంత సులువు మాత్రం అస్సలు కాదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ట్రంప్ అంత సాహసం చేయకపోవచ్చు అనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఖమేనీపై పోరాడుతున్న ఇరాన్ ప్రజలు
ట్రంప్ టార్గెట్ ఈ చిన్న దేశాలు మాత్రమే కాదు.. ఇరాన్ అని కూడా తెలుస్తోంది. అమెరికా అన్‌స్టాపబుల్‌గా ఉండాలన్నా.. మధ్య ప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలన్న.. ఇరాన్‌ను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం చాలా అవసరమనే ఆలోచనలో ఉన్నారు ట్రంప్. 2025 జూన్‌లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ప్రస్తుతం ఆ దేశంలో ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆ దేశ సుప్రీంలీడర్ అయెతుల్లా ఖమేనీపై ప్రజలు పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై కఠినంగా వ్యవహరిస్తే, తాము మళ్లీ దాడులకు సిద్ధమంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌లో కూడా మదురో తరహాలో ప్రభుత్వ మార్పు కోసం అమెరికా సైనిక ఆపరేషన్ నిర్వహించే అవకాశం లేకపోలేదు అనే చర్చ ఉంది.
డాన్ రో సిద్ధాంతాన్ని రెడీ చేస్తున్న ట్రంప్
చూస్తుంటే అమెరికా విదేశాంగ విధానాన్ని మార్చే పనిలో ట్రంప్ ఉన్నట్టు క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. అమెరికా విదేశాంగ విధానంలో మన్రో సిద్ధాంతం అనేది ఒకటుంది. 1823లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో దీనిని రూపొందించారు. దీని సారాంశం ఏంటంటే.. అమెరికా ఖండంలోని దేశ వ్యవహారాల్లో యూరప్ దేశాల జోక్యం ఉండకూడదు అనేది దాని ఉద్దేశం. కానీ ఇప్పుడు టైమ్ మారింది. ట్రంప్ ఇప్పుడు డాన్ రో సిద్ధాంతాన్ని రెడీ చేసినట్టు కనిపిస్తోంది. అప్పుడు యూరప్ దేశాలు జోక్యం చేసుకోకూడదు అంటే.. ఇప్పుడు రష్యా, చైనాలు అమెరికా సమీప దేశాల్లో జోక్యం చేసుకోకూడదు అనే కొత్త సిద్ధాంతాన్ని చెబుతున్నారు. వెనెజుయెలా, క్యూబా వంటి దేశాల్లో రష్యా, చైనాల జోక్యం ఉందనేది వాస్తవం. అందుకే అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తే, అమెరికా నేరుగా సైనిక చర్యకు దిగుతుందనే సందేశాన్ని ఇప్పుడు వినిపించారు.
Also Read: నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు.. పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు
నిజానికి ఇప్పుడు అమెరికా జోక్యం లేని దేశం లేదు. మిత్రుడు అనుకుంటే సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం.. శత్రువు అనుకుంటే ఆంక్షల పేరుతో దారిలోకి తెచ్చుకోవడం.. అది కుదరదంటే ఇలా సైనిక ఆపరేషన్‌లు చేపట్టడం కామన్‌గా మారింది. నిజానికి అమెరికా ఒకప్పుడు తన ఆత్మ రక్షణ కోసం తీసుకొచ్చిన సిద్ధాంతం ఇది. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం ఇతర దేశాలపై తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి, ఆక్రమణలను సమర్థించుకోవడానికి వాడుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
Story By Vamshi Krishna, Bigtv