E-Paper
Advertisement

Greenland: గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్ను!

Greenland: గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్ను!

Greenland: వెనెజుయెలా అమెరికా కంట్రోల్‌లోకి వచ్చేసింది.. ఇప్పడు ట్రంప్ కన్ను గ్రీన్ ల్యాండ్ మీద పడింది. ఇక.. డెన్మార్క్ రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. ఇంకొక్క 20 రోజుల్లో.. ఆ ద్వీపం అమెరికా ఆధీనంలోకి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. యూఎస్ నేషనల్ సెక్యూరిటీకి ఇది చాలా అవసరమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. ఆ లెక్కన.. ఇంకొద్దిరోజుల్లోనే అక్కడ అమెరికా జెండా ఎగురుతుందా? ఉన్నట్టుండి.. ట్రంప్ కన్ను గ్రీన్ ల్యాండ్‌పై ఎందుకు పడింది?

ప్రపంచ దేశాల్లోని సహజ వనరులపై కన్నేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ దృష్టి.. ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌పై పడింది. జాతీయ భద్రత రీత్యా మాకు గ్రీన్‌ల్యాండ్‌ కావాల్సిందే అంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. దీనిద్వారా ఆర్కిటిక్‌ ప్రాంతంలోని శత్రువులను అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. డెన్మార్క్ పాలనలో ఉన్న ఈ అతిపెద్ద ద్వీపాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే.. ఈ విషయంలో చూస్తూ ఊరుకోబోమంటోంది డెన్మార్క్. తమ ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ని కాపాడుకునేందుకు అన్నింటికీ సిద్ధమే అంటోంది.

డెన్మార్క్.. నార్త్ ఐరోపాలోని ఓ దేశం. జట్లాండ్ ద్వీపకల్పం సహా మరికొన్ని దీవుల సమూహం. డెన్మార్క్‌తో పాటు మరో రెండు స్వయం ప్రతిపత్తి ప్రాంతాలైన గ్రీన్‌ల్యాండ్, ఫారో దీవుల్ని కలిపి.. డానిష్ కింగ్‌డమ్‌గా పిలుస్తారు. పురాతన రాజరికాల్లో ఇదీ ఒకటి. ఈ రాజ్యానికి కింగ్ ఫ్రెడెరిక్ సార్వభౌమాధికారి. కానీ.. రాజ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే పాలన ఉంటుంది. అయితే.. గ్రీన్‌ల్యాండ్‌ని స్వాధీనం చేసుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయని, సైనిక చర్య ఆప్షన్‌ని పక్కన పెట్టలేదని అమెరికా కూడా స్పష్టం చేసింది. ట్రంప్ దూకుడుతో.. అమెరికాతో చర్చలకు డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ సిద్ధమయ్యాయ్. అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియోతో సమావేశానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి.

వెనెజుయెలాపై దాడి తర్వాత.. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనంపై ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఈ విషయంలో ఐరోపా దేశాలు తనకు మద్దతిస్తున్నాయని ఆయన చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే.. ఐరోపా నేతలు మాత్రం భిన్నంగా స్పందించారు. అమెరికా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రాదేశికంగా గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్‌ది. స్వయంప్రతిపత్తితో ఉంటుంది. అలాంటి ప్రాంతంపై సైనిక చర్యతో.. తమలో కలిపేసుకునే ఆలోచనతో ఉంది ట్రంప్ ప్రభుత్వం. ఆర్కిటిక్ ప్రాంత‌లో గ్రీన్‌ల్యాండ్ చాలా కీల‌కం. తన ప్రత్యర్థులైన.. చైనా, రష్యానికి ఎదుర్కొనేందుకు గ్రీన్‌ల్యాండ్ తమ అదుపులో ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే.. ఇప్పుడు యూఎస్ ఫోకస్ ఇటు మళ్లింది. దాంతో.. ఈ నెలాఖరులోపే.. గ్రీన్‌ల్యాండ్‌పై ఏదో ఒక మిషన్ మొదలవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయ్.

గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ గురి ఇప్పటిది కాదు. దాని గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కూడా కాదు. అధ్యక్షుడిగా తన మొదటి పదవీకాలంలోనే.. ఈ ప్రతిపాదనని తెరపైకి తెచ్చారు. అప్పట్లో.. డెన్మార్క్ ప్రధాని దీనిని కొట్టిపారేశారు. ఇప్పుడు.. వెనెజుయెలా యూఎస్ కంట్రోల్‌లోకి వెళ్లాక.. ఈ అంశం మరింత వేగంగా చర్చకు వస్తోంది. గ్రీన్‌ల్యాండ్‌ని అమెరికా కావాలనుకోవడానికి అనేక కారణాలున్నాయ్. ఎందుకంటే.. ఆ ద్వీపం కేవలం మంచుగడ్డ కాదు. అదొక వ్యవహాత్మక బంగారు గని. గ్రీన్‌ల్యాండ్‌లో అపారమైన సహజ వనరులున్నాయ్. ముఖ్యంగా.. ఎలక్ట్రానిక్స్, సెల్‌ఫోన్లు, యుద్ధ విమానాల తయారీలో వాడే రేర్ ఎర్త్ మినరల్స్ ఇక్కడ పుష్కలంగా ఉన్నాయ్. ప్రస్తుతం.. వీటిపై చైనా ఆధిపత్యం ఉంది. దాన్ని దెబ్బతీయాలంటే.. అమెరికాకు గ్రీన్‌ల్యాండ్ అవసరం. అంతేకాదు.. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ మంచు కరుగుతుండటంతో.. కొత్త షిప్పింగ్ మార్గాలు ఓపెన్ అవుతున్నాయ్. ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తే.. రష్యా, చైనా కదలికలను నియంత్రించొచ్చు అనే ఆలోచనతో ఉంది అమెరికా. గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటికే అమెరికాకు చెందిన తులే ఎయిర్‌బేస్ ఉంది. ఇక్కడి నుంచి ఉత్తర అమెరికాపైకి వచ్చే మిసైళ్లని సులువుగా పసిగట్టొచ్చు. ఈ ద్వీపం గనక అమెరికా చేతిలోకి వస్తే.. రక్షణపరంగా తిరుగుండదు. అందుకే.. ట్రంప్ ఇంతలా పట్టుబట్టారు.

1946లోనే.. అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ డెన్మార్క్‌ని కొనుగోలు చేసేందుకు వంద మిలియన్ డాలర్ల బంగారాన్ని ఆఫర్ చేశారు. అప్పుడే డెన్మార్క్ దానిని తిరస్కరించింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయ్. గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పుడు 57 వేల మంది జనాభా ఉన్నారు. గతేడాది నిర్వహించిన ఓ పోల్‌లో 85 శాతం మంది అమెరికా స్వాధీనం ఆలోచనని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. గ్రీన్‌ల్యాండ్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్ తమ దేశం అమ్మకానికి లేదని స్పష్టం చేసింది. అయితే.. 1951లో అమెరికా, డెన్మార్క్ ఓ ఒప్పందంపై సంతకం చేశాయి. దానిప్రకారం.. గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా ఏదైనా చేయగలదని చెబుతున్నారు. గ్రీన్‌ల్యాండ్ టెక్నికల్‌గా డెన్మార్క్‌లో భాగమైనప్పటికీ.. దానికి స్వయంప్రతిపత్తి ఉంది. డెన్మార్క్ కూడా గ్రీన్‌లాండ్‌ను తన ఆత్మగౌరవంగా భావిస్తుంది. దాన్ని అమ్మే ప్రసక్తే లేదని పదే పదే తేల్చి చెబుతోంది. అయితే.. గ్రీన్‌లాండ్ ఆర్థికంగా డెన్మార్క్ ఇచ్చే గ్రాంట్లపైనే ఆధారపడి ఉంది.

అంతర్జాతీయ ఒప్పందాలు, ఒక దేశ భూభాగాన్ని మరో దేశం తీసుకోవడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదు. గ్రీన్‌ల్యాండ్‌ని అమెరికా స్వాధీనం చేసుకోవాలంటే.. డెన్మార్క్ పార్లమెంట్, గ్రీన్‌ల్యాండ్ స్థానిక ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటికే వెనెజుయెలాలో తన పట్టు నిరూపించుకున్న అమెరికా.. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ను ఆధీనంలోకి తెచ్చుకుంటే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో.. అమెరికా అజేయమైన శక్తిగా మారుతుంది. అయితే, డెన్మార్క్ దీనికి తలొగ్గుతుందా? ట్రంప్ దీనిని ఏవిధంగా సాధించగలరనేది ఆసక్తి రేపుతోంది.

గ్రీన్ ల్యాండ్ విషయంలో.. అమెరికా చాలా క్లియర్‌గా ఉంది. కచ్చితంగా.. తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతోంది. మరి.. ఈ పరిస్థితుల్లో అమెరికాని ఢీకొట్టడం డెన్మార్క్ వల్ల అవుతుందా? ఆ దేశం మిలిటరీ.. యూఎస్ ఆర్మీని తట్టుకోగలుగుతుందా? గ్రీన్ ల్యాండ్‌లో యుద్ధం వస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయ్? గ్రీన్ ల్యాండ్ కూడా మరో వెనెజుయెలాలో మారడం ఖాయమా?

గ్రీన్‌లాండ్.. ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. ముఖ్యంగా.. అమెరికా కొన్నేళ్లుగా గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామనో, తమ ఆధీనం కిందకు తెచ్చుకుంటామనో చేస్తున్న వ్యాఖ్యలు డెన్మార్క్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇప్పుడు వెనెజుయెలాని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాక.. నెక్ట్స్ టార్గెట్ గ్రీన్‌లాండే అని అమెరికా చెప్పాక.. మరింత హీట్ నెలకొంది.
అమెరికా గ్రీన్‌లాండ్ పై కన్నేయడానికి భౌగోళిక వ్యూహం కారణం. ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించాలంటే.. గ్రీన్‌లాండ్ కీలకం. రష్యా, చైనాల కదలికలను గమనించడానికి ఇది అమెరికాకు ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాంటిది. మరొకటి.. ఈ మంచు కింద అపారమైన చమురు, గ్యాస్, అరుదైన ఖనిజాలు ఉన్నాయి. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీకి ఇవి చాలా అవసరం. అందుకే అమెరికా గ్రీన్‌లాండ్‌పై ఫోకస్ పెట్టింది.

డెన్మార్క్ ఓ చిన్న దేశం. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తి. ఈ రెండింటి మధ్య ప్రత్యక్ష యుద్ధం అనేది ఊహించలేని విషయం. అయినప్పటికీ.. ట్రంప్ హెచ్చరికల్ని సమర్థంగా తిప్పికొట్టారు డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌. బెదిరింపులు ఆపాలని.. గ్రీన్‌లాండ్‌ని నియంత్రణలోకి తీసుకోవడం అమెరికాకు కలేనని తీవ్రంగా స్పందించారు. ఐరోపాలో అతి చిన్న దేశాల్లో ఒకటైనప్పటికీ.. అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన డెన్మార్క్‌ రాజ్యంలో గ్రీన్‌ల్యాండ్‌ ఎప్పటికీ భాగమేనని స్పష్టం చేశారు. అయితే దానికి కూడా స్వయం ప్రతిపత్తి ఉంది. పైగా నాటో సభ్యదేశం. ఇప్పటికే రక్షణ ఒప్పందం ద్వారా అమెరికాకు ద్వీపంలో ప్రవేశం లభించింది. అయినాసరే.. ట్రంప్‌ పదే పదే దాన్ని విలీనం చేసుకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. దాంతో.. గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదని.. మిత్రదేశం పట్ల ఇలాంటి చర్య ఆమోదయోగ్యం కాదని చెబుతోంది డెన్మార్క్. అంతేకాదు.. అది నాటో కూటమి అంతానికి దారితీస్తుందని హెచ్చరించారు. డానిష్‌ రాజ్యంలోని మూడు దేశాల్లో దేన్నీ ఆక్రమించుకునే హక్కు అమెరికాకు లేదంటూ.. ఘాటుగా బదులిచ్చారు మెటె ఫ్రెడెరిక్సన్‌.

అమెరికా ఆలోచనల్ని డెన్మార్క్ ప్రధాని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. నాటో కూటమి అంతానికి దారితీస్తుందని హెచ్చరించినా.. అమెరికా తాము లేకపోతే.. నాటోనే లేదంటోంది. వాస్తవానికి.. డెన్మార్క్ సైన్యం చాలా చిన్నది. అమెరికాతో పోలిస్తే వారి రక్షణ బడ్జెట్ చాలా తక్కువ. కాబట్టి, కేవలం సైనిక బలంతో డెన్మార్క్ అమెరికాని ఢీకొట్టడం అసాధ్యం. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. డెన్మార్క్, అమెరికా.. రెండూ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.. నాటోలో సభ్యదేశాలు. ఒక సభ్య దేశంపై మరొక సభ్య దేశం దాడి చేయడం నాటో కూటమి నిబంధనలకు విరుద్ధం. అమెరికా గనక
గ్రీన్‌లాండ్‌ను ఆక్రమిస్తే.. అది అంతర్జాతీయంగా అమెరికాకున్న మిత్రదేశాల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఒకవేళ గ్రీన్‌లాండ్‌లో యుద్ధ వాతావరణం నెలకొంటే.. అది సాధారణంగా ఉండదు. అక్కడ వాతావరణమే పెద్ద సవాల్. గ్రీన్‌లాండ్ అత్యంత శీతల ప్రాంతం. అక్కడ యుద్ధం చేయడం ఏ సైన్యానికైనా నరకప్రాయమే. రోడ్లు, రవాణా సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాలు దాదాపు శూన్యం. పైగా.. గ్రీన్‌లాండ్‌లో ఉండే ప్రజలు తమ స్వయంప్రతిపత్తిని కోరుకుంటున్నారు. అందువల్ల.. అమెరికా బలవంతపు ఆక్రమణను వారు అంగీకరించే పరిస్థితి లేదు. కచ్చితంగా ప్రతిఘటన మొదలవుతుంది.

Also Read: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్‌, DCM ఢీ.. స్పాట్‌లో ఆరుగురు

వెనెజుయెలా ఆర్థిక సంక్షోభం, అంతర్గత రాజకీయ అవినీతి వల్ల దెబ్బతింది. అందుకే.. అమెరికా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కొన్ని గంటలు మాత్రమే పట్టింది. కానీ.. గ్రీన్‌లాండ్ అలా కాదు. ప్రస్తుతం ఇది డెన్మార్క్ పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. కానీ.. సహజ వనరులు ఎక్కువగా ఉన్న దేశాలపై.. అమెరికా లాంటి దేశం కన్ను పడటం వల్ల అశాంతి నెలకొనే అవకాశం ఉంది. డెన్మార్క్ సైనిక పరంగా అమెరికాని ఎదిరించలేకపోయినా.. దౌత్యపరంగా అమెరికాను నిలువరించగలదు. అమెరికా గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా ఆక్రమించుకుంటే, అది ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టను దిగజార్చుతుంది. అందువల్ల.. యుద్ధం కంటే చర్చల ద్వారా ఒప్పందాల ద్వారా గ్రీన్‌లాండ్‌లో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకే అమెరికా ప్రయత్నిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి గ్రీన్‌లాండ్ కోల్డ్ వార్‌కి వేదికగా మారుతోంది. ఇది.. ఎక్కడికి దారితీస్తుందన్నది ప్రపంచం మొత్తం ఉత్కంఠ రేపుతోంది.

Story By Anup, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×