Road Incident: వరుస రోడ్డు ప్రమాదాలు.. వాతావరణ మార్పుల కారణంగా ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ పట్టణ శివార్లలోని ఈదులగూడ చౌరస్తా వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను వెనుక నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది.
అయితే ప్రమాద సమయంలో డీసీఎం వ్యాన్‌లో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వ్యాన్ క్యాబిన్ భాగం ట్యాంకర్ వెనుక భాగంలోకి దూసుకుపోవడంతో, అందులో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడి సమీపంలోని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే వారిని హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. డీసీఎం వాహనం నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డీసీఎం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా పొగమంచు కారణంగా రహదారి సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఈదులగూడ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
ఇదిలా ఉండగా..
బాపట్ల జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం..
బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి బైపాస్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. వెదుళ్లపల్లి నుండి ఆనంద్ అనే వ్యక్తి.. మరో వ్యక్తితో కలిసి చీరాల వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం క్షతగాత్రుడు అనంద్‌ను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
Also Read: బిగ్ అలర్ట్! దూసుకొస్తున్న తుఫాన్.. భారీ వర్షాలు ఎన్ని రోజులంటే..
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడా చౌరస్తాలో ఘటన
సిమెంట్ ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టిన డీసీఎం వ్యాన్
ఈ ఘటనలో ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలింపు pic.twitter.com/hMNL5xqtML
— BIG TV Breaking News (@bigtvtelugu) January 9, 2026