Trump 2.0 Impact: హద్దూ పద్దూ లేకుండా టారిఫ్‌లు వేసేస్తున్నాడు.. లెక్కా పత్రం లేకుండా దేశాలు ఆక్రమిస్తానంటాడు.. ఐక్యరాజ్యసమితితో అవసరం లేదంటాడు. దానికి ఆల్టర్నేట్‌గా ఓ బోర్డు తెచ్చి దానికి ఛైర్మన్ తానే అంటాడు.. రష్యా దగ్గర ఆయిల్ కొంటే.. ఎడా పెడా సుంకాలు వేసేస్తాడు.. ఇలా ఒకటా, రెండా.. ట్రంప్ లీలలు తక్కువ లేవు. ఇదంతా.. తెలిసి చేస్తున్నాయో.. తెలియక చేస్తున్నాడో.. తెలుసుకోవాలని చేస్తున్నాడో తెలియదు గానీ.. ఎఫెక్ట్ మాత్రం ఎర్త్ మొత్తం పడుతోంది. ట్రంప్‌ని గనక ఇలాగే వదిలేస్తే.. ప్రపంచం అతని గుప్పిట్లోకి వెళ్లిపోతుందా?
డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు వింటేనే అగ్రరాజ్యాల అధినేతలు సైతం ఒక్కసారి ఆలోచనలో పడిపోతారు. ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మొదలైనా.. అవి క్రమంగా అమెరికా మాత్రమే అనే దిశగా సాగుతున్నాయనే అభిప్రాయాలు.. ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయ్. అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయాలు.. ఇలా ప్రతి రంగంలోనూ.. ట్రంప్ తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు.. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. భారీ టారిఫ్‌లు, చిన్న దేశాల ఆక్రమణలపై చేస్తున్న వ్యాఖ్యలు, ఐక్యరాజ్యసమితిని లెక్కచేయకపోవడం లాంటివన్నీ.. కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపుతున్నాయి.
ట్రంప్ ప్రధాన ఆయుధం టారిఫ్. రష్యా, చైనా, భారత్ అనే తేడా లేకుండా.. అనేక మిత్ర దేశాలపైనా భారీగా సుంకాలు విధించారు. రష్యా నుంచి ఆయిల్ కొన్నా, ఇతర దేశాలతో వ్యాపారం చేసినా, వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్నా, తన మాట వినకపోయినా.. అదనపు సుంకాలు అధిక స్థాయిలో తప్పవనే హెచ్చరికలు పరోక్షంగా ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్నాయ్. ఇది.. గ్లోబల్ సప్లై చైన్‌ని దెబ్బతీసి, సామాన్యుడిపై ధరల భారాన్ని పెంచే ప్రమాదం వైపు తీసుకెళ్తోంది. ఇప్పుడు కూడా గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాకు మద్దతు తెలపని దేశాలపై.. 10 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన.. సంచలనంగా మారింది. డెన్మార్క్‌తో పాటు ఐరోపా దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్‌పై అదనపు సుంకాలను ప్రకటించారు. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. అప్పటికీ దిగిరాకపోతే.. జూన్ నుంచి ఆ సుంకాలను 25 శాతానికి పెంచుతామని హెచ్చరించారు. తన నిర్ణయాలను ప్రశ్నించే దేశాలపై.. ట్రంప్ ఇలా దెబ్బకొడుతుండటమే అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఇక.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్యసమితిని కూడా ట్రంప్ తరచుగా విమర్శిస్తున్నారు. అమెరికా ఇచ్చే భారీ నిధులతో.. ఇతర దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని వాదిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఓ చర్చా వేదికగా మారిపోయిందని, యుద్ధాలను ఆపడంలోనూ, ప్రపంచ శాంతిని నెలకొల్పనడంలోనూ విఫలమైందని చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా బోర్డ్ ఆఫ్ పీస్ అనే కొత్త వ్యవస్థని తీసుకొచ్చి.. దానికి తానే సారథ్యం వహించాలనుకుంటున్నారు. ఈ పీస్ బోర్డులో చేరే దేశాలు సుమారు 8 వేల కోట్లు ఎంట్రీ ఫీజు కట్టినా.. అంతిమ నిర్ణయం మాత్రం తనదే అంటున్నాడు ట్రంప్. ఇలా.. ప్రపంచ దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ట్రంప్ పెద్ద స్కెచ్చే వేసినట్లు కనిపిస్తోంది. ఇదే గనక జరిగితే.. అంతర్జాతీయ నియమ, నిబంధనల కంటే.. ట్రంప్ నిర్ణయాలకే విలువ పెరుగుతుంది.
వెనిజుయెలాలో ఆపరేషన్ సదరన్ స్పియర్ నిర్వహించి ఆ దేశాధినేత నికోలస్ మదురోని బంధించడం, ఇరాన్‌పైనా దాడులు చేస్తామని హెచ్చరించడం, గ్రీన్‌లాండ్‌ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పడం లాంటి ప్రకటనలు.. కలకలం రేపుతున్నాయ్. వివాదాస్పద ప్రాంతాలపై ట్రంప్ చూపే మొండితనం.. అంతర్జాతీయ సమతుల్యని దెబ్బతీస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ, నాటో కూటమి విషయంలోనూ ట్రంప్ అనుసరిస్తున్న తీరు.. ఐరోపా దేశాలను భయపెడుతోంది. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అస్తవ్యస్తంగా కనిపిస్తాయ్. ఈ అన్ ప్రెడిక్టబిలిటీనే ఆయన బలంగా మార్చుకుంటున్నారు. ప్రపంచ దేశాలకు.. తన తదుపరి అడుగేమిటో ఊహించలేనప్పుడు.. వారు డిఫెన్స్‌లో పడిపోతారు. ఈ వ్యూహమే.. ట్రంప్ తన పంతం నెగ్గించుకునేందుకు ఉపయోగపడుతోంది. అందువల్ల.. ట్రంప్‌ని గనక ఇలాగే వదిలేస్తే.. ప్రపంచం మొత్తం అతని నియంత్రణలోకి వెళ్లిపోతుందనే ఆందోళనలు మొదలయ్యాయ్. అయితే.. ప్రపంచం ఇప్పుడు ఒకప్పటి పరిస్థితుల్లో లేదు. చైనా ఆర్థికంగా బలంగా ఉంది. భారత్ వేగంగా ఎదుగుతున్న శక్తిగా ఉంది. ఐరోపా దేశాలు తమ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నాయ్. ట్రంప్ గనక ఇలాగే అతిగా ప్రవర్తిస్తే.. ప్రపంచ దేశాలన్నీ కలిసి.. అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఏదేమైనా.. ట్రంప్ విధానాల ప్రభావం.. భూమిపై ఉన్న ప్రతి దేశం మీద పడుతోందన్నది మాత్రం వాస్తవం.
ప్రతి దానికీ ఓ లిమిట్ ఉంటుంది.. ఆ లిమిట్ ట్రంప్‌కి కూడా ఉంటుంది. కానీ.. ట్రంప్ తన లిమిట్‌లో తాను ఉండడు. తనే.. కొత్త లిమిట్స్ సెట్ చేసేందుకు ట్రై చేస్తాడు. దాంతో.. ప్రపంచదేశాలన్నీ ఇరకాటంలో పడుతుంటాయ్. అందుకే.. దీనికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ట్రంప్‌ని ఆపాల్సిన టైమొచ్చిసిందనే చర్చ మొదలైంది. అంతర్జాతీయంగా అమెరికాని ఏకాకిని చేస్తే తప్ప.. ట్రంప్‌కి బుద్ధిరాదనే టాక్ వినిపిస్తోంది. కానీ.. అమెరికాను ఆపేదెవరు? ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి?
ట్రంప్.. నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. చివరికి ట్రంప్ కూడా! సాధారణంగా.. ఏ దేశాధినేతనైనా.. కొన్ని దౌత్యపరమైన పరిధులు, అంతర్జాతీయ నియమాలు కట్టిపడేస్తాయి. కానీ ట్రంప్ అలా కాదు. ఆయన చాలా డిఫరెంట్. పాత లిమిట్స్ చెరిపేసి.. తనదైన కొత్త గీతలను గీయాలని చూస్తారు. దీనివల్ల మిత్ర దేశాలు, శత్రు దేశాలు అయోమయంలో పడుతున్నాయ్. అందువల్ల.. ట్రంప్ దూకుడుకు గనక బ్రేకులు వేయకపోతే.. ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందుల్లో పడటం ఖాయమనే చర్చ జరుగుతోంది. దీనికి.. అంతర్జాతీయంగా అమెరికాని ఏకాకి చేస్తేనే.. ట్రంప్ దారికొస్తాడనే టాక్ వినిపిస్తోంది. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు.. మిగతా దేశాలకు తలనొప్పిగా మారాయ్. పారిస్ పర్యావరణ ఒప్పంద నుంచి వైదొలగడం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థలపై ఆంక్షలు విధించడం, నాటో మిత్రదేశాలను నిధుల కోసం నిలదీయడం లాంటివన్నీ.. ట్రంప్ దూకుడుకు ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయ్.
అంతర్జాతీయంగా అమెరికాను ఒంటరిని చేయడమనేది.. ఆచరణలో అత్యంత క్లిష్టమైన విషయం. ఎందుకంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం కొనసాగుతోంది. అమెరికాను పక్కన పెట్టి.. వ్యాపారం చేయడమనేది ప్రస్తుతం ఏ దేశానికైనా కత్తి మీద సామే. ఐరోపా దేశాలు, జపాన్, సౌత్ కొరియా లాంటివి.. తమ రక్షణ కోసం ఇప్పటికీ అమెరికా సైనిక శక్తిపైనే ఆధారపడి ఉన్నాయ్. మిగతా దేశాలకు.. వ్యాపారం, వాణిజ్య అవసరాలు అమెరికాతోనే ముడిపడి ఉన్నాయ్. ముఖ్యంగా.. యూఎస్ సిలికాన్ వ్యాలీ నుంచి వస్తున్న టెక్నాలజీ.. ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ నిర్ణయాలను నియంత్రించాలంటే.. ప్రపంచ దేశాల ముందు కొన్ని మార్గాలున్నాయ్. అమెరికా లేకపోయినా అంతర్జాతీయ వ్యవస్థలు నడవగలవని నిరూపించాలి. అమెరికా లేకపోయినా.. వాణిజ్యం ముందుకు తీసుకెళ్లడం ద్వారా ట్రంప్‌పై ఒత్తిడి పెంచొచ్చు. ఇప్పటికే.. గ్రీన్‌లాండ్ విషయంలో ఐరోపా దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చాయ్. గ్రీన్‌లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని.. బ్రిటన్‌తో పాటు ఐరోపా యూనియన్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయ్. టారిఫ్‌లకు బదులిచ్చేందుకు తమ దగ్గరున్న శక్తిమంతమైన సాధానాన్ని ఉపయోగించాలని.. ఈయూ ఆలోచిస్తోంది. తమ వాణిజ్య ఆయుధమైన ట్రేడ్ బజూకని తొలిసారి వాడాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.
ట్రంప్ సుంకాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, యూఎస్‌తో సంబంధాలపై ఇప్పటికే చర్చలు జరిపారు. ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రకటించారు. అలాగే.. తమ యూనియన్‌కు చెందిన ట్రేడ్ బజూకను తొలిసారి ఉపయోగించేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ఈయూయేతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా.. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రూపొందించిన వ్యవస్థ ఇది. దీని ద్వారా.. కౌంటర్ టారిఫ్‌లు విధించడానికి వీలు కలుగుతుంది. అమెరికన్ కంపెనీలకు లాభదాయకంగా ఉండే.. ఈయూ కాంట్రాక్ట్‌ల విషయంలో బిడ్డింగ్‌ను నిరోధించే అవకాశం ఏర్పడుతుంది. ట్రేడ్ బజూకని వాడటమంటే.. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేలా చర్యలు ఉంటాయనే స్పష్టమైన సందేశాన్ని పంపాయ్. మిగతా దేశాలు కూడా అన్నింటికీ.. అమెరికాపైనే ఆధారపడటం తగ్గించుకోవాలి. కేవలం.. అమెరికాని నమ్ముకొనే వ్యాపారం చేయకుండా.. మిగతా దేశాలకు కూడా తమ వస్తు,సేవలను విస్తరించాలి. అమెరికా లేకపోయినా నో ప్రాబ్లమ్ అనే పరిస్థితులను తీసుకురావాలి. అప్పుడే.. అగ్రరాజ్యం అహం దిగొస్తుంది. ట్రంప్ ఎంత తప్పు చేశాడో తెలిసొస్తుంది.
అమెరికాతో సంబంధం లేకుండా.. యూరోపియన్ యూనియన్, క్వాడ్, బ్రిక్స్ లాంటి కూటములు బలోపేతం కావాలి. అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు.. ఈ కూటములు ఆర్థిక లావాదేవీలను పెంచుకోవాలి. అమెరికా ఆర్థిక ఆంక్షల నుంచి బయటపడాలంటే.. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ వినియోగాన్ని తగ్గించే దిశగా దేశాలు అడుగులు వేయాలి. అప్పుడే.. అమెరికా బెదిరింపుల ప్రభావం తగ్గుతుంది. ట్రంప్‌ని ఆపితేనే.. ప్రపంచ శాంతి, దేశాల మధ్య సహకారం స్థిరంగా ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తి గానీ, దేశం గానీ.. ప్రపంచ నియమాలను తనకు నచ్చినట్లు మార్చేయడం మొదలుపెడితే.. అది అరాచకానికి దారితీస్తుంది. అందుకే.. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి.. ప్రెసిడెంట్ ట్రంప్‌కి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. తెలివైన దౌత్యం, బలమైన ఆర్థిక ప్రత్యామ్నాయలతోనే ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టాలి. అప్పుడే.. అమెరికా కంట్రోల్‌లో ఉంటుంది. ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది.