E-Paper
Advertisement

Medaram Jatara 2026: వన దేవతకు మహా జాతర..అడవి తల్లి సిగలో సరికొత్త మేడారం

Medaram Jatara 2026: వన దేవతకు మహా జాతర..అడవి తల్లి సిగలో సరికొత్త మేడారం

Medaram Jatara 2026: సంకల్పం నెరవేర్చిన శక్తులకు.. చరిత్రలో నిలిచిపోయేలా జరగబోతోంది ఓ గొప్ప సంబురం. తెలంగాణ రాతను మార్చిన తల్లుల రుణం తీర్చుకుంటున్న తరుణమిది! త్యాగాల నేలగాథ.. తరతరాలు నిలిచిపోయేలా.. పౌరుషాల మట్టిని తాకిన ప్రతి బిడ్డా.. తనువెల్లా తన్మయత్వంలో మురిసిపోయేలా.. మేడారం సిద్ధమైంది. ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకలను ప్రపంచానికి చాటేలా.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం భుజానికెత్తుకున్న బృహత్ సంకల్పం నెరవేరింది. వనంలో కొలువైన జనదేవత, మన దేవత.. సమ్మక్క-సారలమ్మలతో.. మేడారం మహిమాన్విత క్షేత్రంగా కనిపిస్తోంది.

గద్దెలనే తల్లులుగా కొలిచే వేడుక.. గుండెల్లో నిలిచిపోయేలా వేదిక.

రెండేళ్లకోసారి వైభవంగా నిర్వహించుకునే గిరిజన, ఆదివాసీల పండగ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద జాతర. కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చి.. అమ్మవార్లను దర్శించుకొని ఆశీస్సులు పొందే.. తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర. బెల్లం ముద్దలనే.. బంగారు ముద్దలుగా మురిసిపోయే మహిమాన్విత జాతర.. ఈ నెల 28న ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరకు.. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 251 కోట్లు కేటాయించి.. మేడారం రూపురేఖలను పూర్తిగా మార్చేసింది.

జాతర కోసం అద్భుతమైన ఏర్పాట్లు.. మేడారం కొత్త చరణం

ఇప్పుడు మీరు చూస్తున్న మేడారం.. ముందు ఇలా ఉండేది కాదు. గతేడాది నవంబర్‌కు ముందు మేడారం ఇలా ఉండేది. అమ్మవారి గద్దెల చుట్టూ ఇనుప కంచెలు, చెట్లు, పదుల సంఖ్యలో దుకాణాలు, ఇరుకైన రోడ్లు, వీధులతో.. మేడారం భక్తులకు అనువుగా ఉండేది కాదు. భారీ స్థాయిలో వాహనాల వచ్చినా, ఒకేసారి పెద్ద మొత్తంలో భక్తులు వచ్చినా.. ఇబ్బందులు తప్పేవి కావు. జాతరకు వచ్చిపోయే భక్తులకు సరైన ఏర్పాట్లు, వసతి, ఇతర సౌకర్యాలు పెద్దగా ఉండేవి కావు. అడవి మధ్యలో అన్నీ అరకొరగానే దొరికేవి.

మేడారం పై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఫోకస్

ఎప్పుడైతే.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మేడారంపై ఫోకస్ పెట్టిందో.. అప్పుడే మార్పు మొదలైంది. మేడారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. సమ్మక్క, సారలమ్మ గద్దెలు మరో 200 ఏళ్లు నిలిచేలా పునర్‌నిర్మించాలని భావించింది. మార్పులంటే.. భారీ నిర్మాణాలు ఒక్కటే కాదు. ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణాలు, చిహ్నాల ఏర్పాట్లతో.. మేడారం చరిత్రని నేటి తరాలకు అర్థమయ్యేలా చూపించాలనే ఉద్దేశంతో పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఎక్కడా.. ఆదివాసీ సంప్రదాయాలకు భిన్నంగా అడుగులు ముందుకు వేయలేదు. వారి ఆచార, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ.. ప్రతి నిర్మాణంలో వారి సంస్కృతి కొట్టొచ్చినట్లు కనిపించేలా.. సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం ఆమోదంతోనే ముందుకెళ్లింది. దాదాపు 3 నెలల పాటు పూజారులు, గిరిజన నేతలు, సమ్మక్క-సారలమ్మల చరిత్ర తెలిసిన వారితో సంప్రదింపులు జరిపి.. గద్దెల పునర్నిర్మాణం మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అలా.. నెమ్మదిగా ఈ ప్రాంతం కొత్త రూపుని సంతరించుకోవడం మొదలైంది.

4 వేల టన్నుల గ్రానైట్‌పై ఆదివాసీ చరిత్ర

గత నవంబర్‌లో పనులు మొదలవగా.. డిసెంబర్ రెండో వారం నాటికి మేడారం గద్దెల దగ్గర పనులు దాదాపు సగం పూర్తయ్యాయి. కోయ వంశీయుల చిహ్నాలు, గొట్టె గోత్రాలు, వారి జీవనశైలి ఏ విధంగా ఉందో తెలిపేలా.. వారు పూజించే వృక్షాలు, పక్షులు, జంతువులు కనిపించేలా రాత్రి స్తంభాలపై తీర్చిదిద్దారు. 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు రూపాన్నిస్తూ.. ఇలా శిల్పాలను రూపొందించారు. 4 వేల టన్నుల గ్రానైట్‌పై.. ఆదివాసీ చరిత్ర, సంస్కృతిని తెలియజేసే వేలాది బొమ్మలతో నిర్మాణాలు చేపట్టారు.

సమ్మక్క వంశీయుల చరిత్రను ప్రతిబింబించే బొమ్మలు

జనవరి నాటికి మేడారం రూపురేఖలు మారిపోయాయ్. ఇప్పుడు అక్కడ అనేక శిలాకృతులు కనిపిస్తున్నాయ్. ఆదివాసీల చరిత్రని తెలిపేలా అనేక చిహ్నాలు, బొమ్మలు ఆకర్షిస్తాయ్. ప్రధాన స్వాగత తోరణంపై.. సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు కనిపిస్తాయ్. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7 వేల బొమ్మలు మేడారంలో కనిపిస్తాయి. గద్దెల ప్రాంగణం.. చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా ఉండేలా రాతితో పునర్నిర్మించారు. 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 46 పిల్లర్లతో ఈ ప్రాకారాన్ని నిర్మించారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు ఉంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున.. ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ.. 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దారు.

సమ్మక్క-సారక్క జాతర.. కొత్త రూపు, కొత్త అనుభూతి

మేడారం అంటేన.. ఆదివాసీల సంస్కృతికి, ప్రాచీన వైభవానికి నిలువుటద్దం. ఇంతకుముందుతో పోలిస్తే.. ఈసారి జాతర ఎంతో ప్రత్యేకం. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల పునర్నిర్మాణం, వాటి చుట్టూ 8 ద్వారాలు, సమ్మక్క-సారక్క గొట్టు గోత్రాలు, చరిత్ర ఉట్టిపడేలా చిహ్నాలు, బొమ్మలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయ్. ఆధ్యాత్మిక శోభతో విలసిల్లే మేడారానికి.. గ్రానైట్ సొబగులు అద్దారు. ఆదివాసీ ఆచారాలకు సంబంధించిన ఆకృతులు, రాతి ప్రాకారాలు మరింత ఆకట్టుకుంటున్నాయ్. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని 251 కోట్ల నిధులు కేటాయించి.. మేడారం రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. ఆనాటి మేడారానికి, నేటి మేడారానికి.. ఎంతో తేడా కనిపిస్తోంది. భక్తులు మెచ్చేలా, సమ్మక్క-సారలమ్మ సైతం మురిసేలా.. మేడారం కొత్త రూపు సంతరించుకుంది.

మేడారం ఆలయంలో పశుపక్ష్యాదుల ప్రాముఖ్యం

ఇప్పటికే.. గద్దెల దగ్గర ఉన్న చెట్లని తొలగించకుండా అభివృద్ధి పనులు చేపట్టారు. బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప లాంటి 12 రకాల వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. మరో 140 రకాల ఆయుర్వేద మొక్కలను నాటనున్నారు. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయలు ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే.. పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులతో పాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలను స్తంభాలపై చెక్కారు. ఇవన్నీ.. సమ్మక్క-సారలమ్మ చరిత్ర తరతరాలకు తెలిసేలా చేస్తాయ్. ఒకప్పుడు చిలుకల గుట్టపై జరిగిన జాతర.. కాలక్రమంలో మేడారంలో గద్దెల ఏర్పాటుతో సకల జనుల జాతరగా మారింది. ఇప్పుడు.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన పునరుద్ధరణ పనులతో.. మేడారం మహిమాన్విత క్షేత్రంగా కనిపిస్తోంది. చారిత్రక కట్టడాలను మించిన శిల్పకళతో భక్తులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా.. సమ్మక్క-సారలమ్మల వంశ చరిత్రను, ఆదివాసీల గొట్టు గోత్రాలను భావితరాలకు తెలియజేసేలా సరికొత్త రూపం సంతరించుకుంది.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది తరలివచ్చి, సంబరంగా చేసుకునే పండగ మేడారం జాతర. అలాంటి మేడారం.. ఈసారి సరికొత్త గిరిజన రాగం వినిపించబోతోంది. ఇంతకుముందెన్నడూ చూడని ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరియనుంది. ఆ ఏర్పాట్లు, వసతులు, నిర్మాణాలు.. ఆసాంతం అద్భుతంగా కొలువైన అమ్మవార్ల గద్దెల ప్రాంగణం.. భక్తజనం గుండెలకి తాకనున్నాయ్. నిజమైన మేడారాన్ని పరిచయం చేయనున్నాయి.

2026లో మేడారం జాతరలో సరికొత్త అనుభవం.. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతర.. రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజుల్లో జరుగుతుంది. దశాబ్దాలుగా.. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ అతిపెద్ద గిరిజన మహాజాతరకు.. కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుంది. ఒకప్పుడు మేడారం జాతరంటే.. భక్తుల పూనకాలు, బెల్లం మొక్కుల సమర్పణ, జంపన్న వాగు గుండా ఎడ్ల బండ్ల ప్రయాణాలు, సమ్మక్క-సారలమ్మ గద్దెల దగ్గర దర్శనాలు.. ఇలా ఎంతో కోలాహలంగా సాగేది. స్వాతంత్ర్యానికి ముందు మేడారం జాతరని చిలుకల గుట్టపై ఆదివాసీలు మాత్రమే జరుపుకునేవారు. క్రమంగా భక్తుల సంఖ్య పెరగడం, గిరిజనేతరులు సైతం జాతరకు పోటెత్తడంతో.. అమ్మవార్ల గద్దెలను ఇప్పుడున్న ప్రాంగణానికి మార్చారు. అయితే.. ఈసారి మేడారం వెళ్లే భక్తులంతా.. సరికొత్త అనుభూతి పొందడం పక్కా. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను.. ఏకంకాలంలో 8 వేల మంది, రెండు వైపుల నుంచి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా.. మేడారం జాతర ఎప్పుడు జరిగినా.. అమ్మవార్లు కొలువైన ప్రాంగణమంతా కిక్కిరిసిపోతుంది. అప్పడు భక్తులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నింటిని.. ప్రభుత్వం గుర్తించింది కాబట్టే.. ఎవరి మనసు నొప్పించకుండా ఇంత అద్భుతంగా అభివృద్ధి పనులు చేపట్టింది.

101 కోట్లు, శాశ్వత నిర్మాణాలు.. మేడారం జాతర ఈసారి కొత్త వెలుగు

మేడారం అంటే ఇన్నాళ్లూ తాత్కాలిక నిర్మాణాలకే ప్రాధాన్యత ఇచ్చారు. జాతర సాగే వారం రోజుల పాటే జనం కనిపిస్తారు. ఆ తర్వాత పెద్దగా ఎవరూ రారనే భావనతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడం, వాటిని తీసేయడం లాంటివి చేశారు. కానీ.. ఈసారి అలా కాదు.. తాత్కాలిక నిర్మాణాలతో పాటు శాశ్వాత నిర్మాణాలపై ఫోకస్ చేసింది రేవంత్ ప్రభుత్వం. ఇందులో.. ముఖ్య ఆకర్షణ వనదేవతల కొలువుండే గద్దెల విస్తరణే. ఈ పనులకే.. 101 కోట్లు ఖర్చు చేసింది. గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఉన్న చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు చేశారు. రెండేళ్లకోసారి వచ్చే ఈ మహా జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులను పూర్తి చేశారు. శాశ్వత ప్రాతిపదికన రికార్డు సమయంలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు.. మేడారం ధగ ధగ మెరుస్తోంది. ఈ ఏర్పాట్లు, అభివృద్ధి పనులని చూసి భక్తజనం మురిసిపోతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ.. జనాన్ని కట్టిపడేస్తున్నాయ్.

వందలాది వాహనాలను పార్కింగ్‌ చేయడానికి కొత్త మార్గాలు

జంపన్న వాగు సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థలు, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, 60 అడుగుల వెడల్పుతో నాలుగు లేన్లకు రోడ్ల విస్తరణ, క్యూ లైన్లు, సత్రాలు, వాచ్ టవర్లు, గ్రీనరీ.. ఇలా అన్ని పనులు పూర్తయ్యాయ్. మరోవైపు.. జాతర సజావుగా సాగేందుకు.. మహా కుంభమేళాలో భాగస్వాములైన నిపుణుల బృందం సైతం మేడారానికి వచ్చి.. జాతర జరిగే ప్రాంతం, అక్కడికి చేరుకునే మార్గాలు, రద్దీ ఉండే ఉప ఆలయాలను సందర్శించి.. అధికారులకు తగిన సూచనలు చేసింది. ఈసారి జాతరకు వచ్చే భక్తులకు.. పార్కింగ్ సమస్య తలెత్తకుండా, గద్దెల సమీపంలోనే ఏకకాలంలో వేల వాహనాలు పార్కింగ్‌ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

మేడారం కొత్త రూపం.. ఆదివాసీ చరిత్రతో మెరుగైన వేదిక

కొన్ని నెలల కిందటి వరకు మేడారంలో చెట్లు,చేమలు, ఇనుప కంచెలు మాత్రమే కనిపించేవి. కానీ.. ఇప్పుడు స్వాగత తోరణాలు, రాతి ప్రాంగణంలో కొలువైన స్తంభాలపై ఆదివాసీల చరిత్రని తెలియజేసేలా చిహ్నాలు, బొమ్మలు కనిపిస్తాయ్. ఆదివాసీల ప్రాచీన వైభవం, సంస్కృతి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో అభివృద్ధి చేశారు. మేడారం రూపురేఖలను సమూలంగా మార్చేశారు. మరింత సుందరంగా తీర్చిదిద్దారు. మేడారం జాతరకు వెళ్లిన భక్తులందరికీ.. ఆ మార్పు తప్పకుండా కనిపిస్తుంది.

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×