Trump Warning: బలహీన దేశాలపై డైరెక్ట్ థ్రెడ్స్.. బలమైన దేశాలపై టారిఫ్ బెదిరింపులు.. ఇది ట్రంప్ స్టైల్.. అమెరికా ఫస్ట్ అనే చెప్పే క్రమంలో అమెరికాను సూపర్ పవర్‌గా మరోసారి చూపించాలి అనుకునే క్రమంలో తమకు వ్యతిరేకం అనుకున్న బలహీన దేశాలపై ప్రతాపం చూపిస్తున్నారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు అన్నమాట.. ఇరాన్‌ను ఫినిష్ చేశాకా.. క్యూబా సంగతి చూస్తం అని ట్రంప్ తాజాగా చెప్పడం సంచలనంగా మారుతుంది. ఇంతకి క్యూబా అంటే ట్రంప్ కి ఎందుకంత పగ..
ట్రంప్ కామెంట్స్. ఫస్ట్ ఇరాన్ ను ఫినిష్ చేస్తాం.. ఆ తర్వాత క్యూబా సంగతి తేలుస్తాం. అంతకు ముందు ఫ్రెండ్లీ టేకోవర్ అన్న ట్రంప్.. ఇప్పుడు ఏకంగా క్యూబాను డౌన్ చేస్తామని ప్రకటించడం కీలకంగా మారుతోంది. ట్రంప్ కు మైండ్ లో ఏది వస్తే అదే మాట్లాడుతుంటారు. తనకు రైట్ అనిపిస్తే అందరికీ రైట్ అనిపించాల్సిందే. ఏమైనా అంటే పవర్ ఫుల్ కంట్రీ అని, అమెరికా ఫస్ట్ అని, సూపర్ పవర్ అని, తాము ఏం చేసినా ప్రపంచ దేశాలు కిక్కురు మనకుండా పడి ఉండాలన్నట్లుగా ఈ మధ్య చాలా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురో దంపతుల్ని కళ్లకు గంతలు, చేతులకు బేడీలు వేసి అమెరికా జైలులో పెట్టడం సంచలనంగా మారింది. దీనిపై ఏ దేశం కూడా మాట్లాడలేదు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశాక ట్రంప్ లో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. తమతో యుద్ధం చేసేందుకు ఎవరూ ముందుకు రారు అన్న ధీమా పెరిగింది. రష్యా, చైనా కూడా చూస్తూ ఉండిపోతాయంతే అన్న భ్రమలు పెరిగాయ్. అందుకే ఈ భూగోళమంతా అమెరికా చెప్పినట్లే వినాలి.. చెప్పినట్లే నడుచుకోవాలి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయ్.
ఇందుకు నిదర్శనం ట్రంప్ తాజాగా క్యూబా సంగతి తేలుస్తామన్నారు. ఇరాన్ ను ఫినిష్ చేశాక క్యూబా అంతు చూస్తామన్నారు. ఇదొక కీలక వ్యవహారంగా మారింది. క్యూబాలో ఏం జరుగుతుందో చూడ్డానికి అద్భుతంగా ఉందంటూ మాట్లాడారు. ఈ కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అసలు ప్రపంచదేశాలను ట్రంప్ ఏమి చేయాలనుకుంటున్నారు.. ఏం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. కలలో ఏ దేశం కనిపిస్తే ఆ దేశాన్ని టార్గెట్ చేయడమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయ్. గత కొన్ని దశాబ్దాలుగా యుఎస్, క్యూబా మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. క్యూబా ప్రభుత్వంపై గత కొన్నేళ్లుగా అమెరికా తీవ్ర ఆంక్షలు విధించింది. ట్రేడ్, ఫైనాన్స్, ఎనర్జీ సప్లైలను టార్గెట్ చేసింది. ఆర్థికంగా దెబ్బతీసి క్యూబా అంతు తేల్చాలనుకుంటున్నారు ట్రంప్.
క్యూబా ప్రభుత్వ రాజకీయ విధానాలను మార్చేందుకు కఠినమైన ఆంక్షలతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు గత కొన్నాళ్లుగా పెంచింది అమెరికా. ఈ ఆంక్షలతో క్యూబా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. సాధారణ జనం ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. యుఎస్-క్యూబా సంబంధాలు లాటిన్ అమెరికా ప్రాంత స్థిరత్వంపై చాలా ప్రభావం చూపుతాయి. క్యూబా విషయంలో యుఎస్ కొత్త ఆలోచన ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చంటున్నారు. ప్రస్తుతం క్యూబా ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఇంధనం, ఇతర వనరుల కొరత వల్ల కష్టాలు విపరీతంగా పెరిగిపోయాయ్. గత కొన్నేళ్లుగా క్యూబా వెనిజులాపై ఆధారపడుతూ వచ్చింది. వెనిజులా చమురు క్యూబాకు ఆర్థిక జీవనాడి. అయితే వెనిజులాలో చమురు వ్యవహారాలను అమెరికా తన కంట్రోల్ లోకి తీసుకుంది. దీంతో క్యూబాలో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. దీంతో రాజకీయంగా కూడా క్యూబాలో ఒత్తిడి పెరుగుతోంది.
మార్చి 4న క్యూబా నేషనల్ గ్రిడ్ పూర్తిగా విఫలమైంది. దీనివల్ల హవానా సహా దేశంలోని మూడొంతుల భాగం చీకట్లోనే ఉంటోంది. అమెరికా చేస్తున్న ఇంధన దిగ్భంధంతో క్యూబాకు చమురు ఆగిపోయింది. ముఖ్యంగా వెనిజులా నుండి వచ్చే ఆయిల్ నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. రోజుకు 20 గంటల వరకు పవర్ కట్‌లు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు ఆహారం, మెడిసిన్స్, తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే ఇరాన్ సంఘర్షణ ప్రపంచ భద్రతా ఆందోళనలను పెంచింది. అంతర్జాతీయ దౌత్య ప్రాధాన్యతలను మార్చింది. ఇరాన్ యుద్ధం ముగిశాక.. క్యూబాలో నాయకత్వ మార్పు చేసి చెప్పినట్లు పని చేయించుకునే ఆలోచనలు కనిపిస్తున్నాయంటున్నారు.
నిజానికి తమ తర్వాత టార్గెట్ క్యూబా అని ట్రంప్ చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా ఇదొక హాట్ డిబేట్ అయింది. ఎందుకంటే క్యూబా చరిత్రాత్మకంగా ప్రపంచ రాజకీయాల్లో ముందంజలో ఉంది. ముఖ్యంగా యుఎస్-యుఎస్ఎస్ఆర్ సంబంధాలు చెడిపోయినప్పుడు ఇదే కీలకంగా పని చేసింది. క్యూబా యుఎస్ కు సమీపంలో ఉండటం వల్ల అక్కడ ఏ చర్యలు జరిగినా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తాయి. అమెరికా తీసుకునే చర్యలతో కొత్త భౌగోళిక రాజకీయ సంఘర్షణలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయ్. క్యూబా ప్రభుత్వం ఏదో ఒక ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తిగా ఉందని, ప్రస్తుతం అమెరికా అధికారులతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ అంటున్నారు. అయితే క్యూబా ప్రెసిడెంట్ మిగ్యుల్ డియాజ్ మాత్రం చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ లొంగిపోయే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఒత్తిడికి తలొగ్గి ఎలాంటి ఛాన్స్ ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మూలిగే నక్కపై యుద్ధం కాదు.. దమ్ముంటే బెబ్బులిపై యుద్ధం చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయ్. క్యూబా ఆర్థికంగా పూర్తిగా బలహీనపడింది. అంత మాత్రాన తమను తాము తక్కువ చేసుకునే పరిస్థితిలో అసలే లేదు. అయితే అమెరికా కోరుకుంటున్నట్లుగా క్యూబాలో ప్రభుత్వ మార్పు జరుగుతుందా లేక అక్కడి ప్రజలు ఈ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడతారా అనేది రాబోయే కొన్ని వారాల్లో తేలనుంది.
ఇరాన్, క్యూబా, వెనిజుయెలా, గాజా, గ్రీన్ ల్యాండ్, కెనడా, పనామా కాలువ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ట్రంప్ టార్గెటెడ్ లిస్ట్ చాలానే ఉంది. ఇక కీలక దేశాలైనా రష్యా, చైనా వంటి వాటిని కంట్రోల్ చేయాలని, డాలర్లలోనే బిజినెస్ చేయాలని, అంతా అమెరికా చెప్పినట్లే వినాలని, అమెరికానే ఫస్ట్ అని చెప్పే ప్రయత్నాలు పెంచుతున్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా భారీ సైనిక దాడులు చేస్తున్నాయి. ఈ దాడులకు పెద్ద కారణం కూడా లేదు. ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయడం లేదని, క్షిపణి వ్యవస్థలను పెంచుకుంటోందని, అక్కడ ప్రభుత్వ మార్పు తీసుకురావడం లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కానీ ఇవేవీ అసలు కారణాలు కాదని, ఇరాన్ ఆయిల్ పై ట్రంప్ కన్ను ఉందంటారు. అందుకే ఇలా దాడి చేసి డమ్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడం లక్ష్యంగా ఈ యుద్ధమంటున్నారు. ఇక తమకు సమీపంలో ఉన్న క్యూబాలో అయితే కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పడగొట్టి తమకు బేస్ గా మార్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నారంటున్నారు. క్యూబాను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా ముద్ర వేశారు ట్రంప్. క్యూబాకు వెళ్లే చమురు నౌకలను అమెరికా అడ్డుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.
మొన్నటికి మొన్న వెనిజుయెలాలో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది. ల్యాటిన్ అమెరికాలో వెనిజులా కూడా ట్రంప్ టార్గెట్ లిస్టులో ఉంది. గతంలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూలదోసి, అక్కడ కొత్త ప్రభుత్వాన్ని అమెరికా ప్రయత్నించింది. అయితే ఈ ఏడాది జనవరిలో వెనిజుయెలాపై మెరుపు దాడులు చేసింది అమెరికా. మదురోను అధికారంలో నుండి తొలగించి అరెస్ట్ చేసి తీసుకెళ్లింది. దీనిపై ప్రపంచదేశాలు పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో అమెరికా మరింతగా రెచ్చిపోతోందంటున్నారు. అటు చైనాను సైనిక పరంగానే కాకుండా ఆర్థిక పరంగా అతిపెద్ద శత్రువుగా ట్రంప్ భావిస్తున్నారు. భారీ టారిఫ్ లు విధించారు. అటు అణుఆయుధాల తయారీని ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని నార్త్ కొరియాకు చాలా సార్లు వార్నింగ్ లు ఇచ్చారు. మెక్సికో, కెనడాలనూ టార్గెట్ చేస్తున్నారు. సరిహద్దుల వద్ద డ్రగ్స్ అక్రమ వలసలను అడ్డుకోకపోతే టారిఫ్‌లు విధిస్తామని బెదిరించారు. ట్రంప్ తన వ్యూహంలో భాగంగా ఆర్థిక ఆంక్షలు, టారిఫ్‌లు అవసరమైతే సైనిక దాడుల ద్వారా ఆయా దేశాల్లో ప్రభుత్వాలను మార్చి అమెరికా ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
గ్రీన్ ల్యాండ్‌ను కొనడం లేదా స్వాధీనం చేసుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత అవసరమని ట్రంప్ భావిస్తున్నారు. రష్యా లేదా చైనా నుండి క్షిపణి దాడులు జరిగితే, అవి గ్రీన్ ల్యాండ్ మీదుగానే అమెరికాకు చేరుకుంటాయి. అది అమెరికా సొంతమైతేనే.. గోల్డెన్ డోమ్ వంటి అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలను నిర్మించగలమని వాదిస్తున్నారు. డెన్మార్క్ ఈ గ్రీన్ ల్యాండ్ ను రష్యా లేదా చైనా నుండి రక్షించలేదని, అమెరికా మాత్రమే ఆ పని చేయగలదని ట్రంప్ నమ్ముతున్నారు. ఇదే ట్రంప్ లక్ష్యం కాదు.. అసలు మ్యాటర్ ఏంటంటే.. అక్కడ లభించే అరుదైన ఖనిజాలు భవిష్యత్ టెక్నాలజీకి చాలా కీలకం. అది కూడా ట్రంప్ మైండ్ లో ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనాపై ఆధారపడడం తగ్గించుకునే ఉద్దేశంతో గేమ్ మార్చాలనుకుంటున్నారు. అయితే ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ఎత్తుగడపై చాలా యూరోపియన్ దేశాలు మండిపడ్డాయి.
Also Read: క్లస్టర్ ముప్పు.. పిల్లలకే ఎఫెక్ట్!
కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలనే ప్రతిపాదనను ట్రంప్ వ్యూహాత్మకంగా ఒక దశలో ప్రస్తావించారు. అది చాలా హాట్ డిబేట్ కు దారి తీసింది. సరిహద్దులు పంచుకుంటే దేశాలను ఆక్రమించేస్తారా అన్న చర్చ జరిగింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ సరిహద్దుల వద్ద డ్రగ్స్ వలసలను అడ్డుకోకపోతే, ఆ దేశంపై 25% టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ బెదిరించారు. అంతే కాదు కెనడా రక్షణ కోసం అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతోందని, అందుకు ప్రతిగా కెనడా అమెరికాలో కలవడం బెటర్ అని కామెంట్ చేశారు. అటు పనామా కాలువ ఇది ప్రపంచ వాణిజ్యానికి చాలా కీలకమని, దీనిపై మళ్ళీ అమెరికా నియంత్రణ ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. అమెరికా 1900లలో నిర్మించిన ఈ కెనాల్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పాడు. 1977లో జిమ్మీ కార్టర్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో పనామాతో చేసుకున్న ఒప్పందాన్ని పెద్ద తప్పు అని విమర్శించాడు. సో ఓవరాల్ గా చూస్తే ట్రంప్ టార్గెట్ చేస్తున్న దేశాలు ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్నాయి. కానీ కొన్ని రియాక్ట్ చేసే స్థితిలో ఉన్నాయి.