కేసీఆర్ కాదని చేతులెత్తేసిన చోటే.. అది సాధ్యమేనని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత- చేవెళ్ల భారీ సాగునీటి ప్రాజెక్టును.. కేసీఆర్ మేడిగడ్డకు మార్చారు. దీన్ని రీ డిజైన్ చేశారు. అంచనాలు పెరిగాయి. దాదాపుగా రెట్టింపు అంచనాలతో లక్ష కోట్ల భారీ వ్యయంతో కాళేశ్వరంగా నిర్మించి తన ముద్రను వేసుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్.
కేసీఆర్‌కు కాలం కలిసి రాలేదు. జనాలు ఓడగొట్టారు. అంతకు ముందు మేడిగడ్డ వద్ద బ్యారేజీ పిల్లర్లు కుంగడము కూడా కేసీఆర్ సర్కార్‌ను కుంగిపోయేలా చేసిన అంశాల్లో ప్రధానమైనదిగా మారింది. ఇక్కడే మళ్లీ తుమ్మిడిహెట్టి తెరపైకి వచ్చింది.అంతకు ముందు నుంచి కాంగ్రెస్ దీనిపై గగ్గోలు పెడుతూ వస్తూనే ఉంది. కాసుల కోసమే కాళేశ్వరమని, కేసీఆర్ మేడిగడ్డ రీ డిజైన్ అందుకేనని.
కానీ దీనికి అంతగా బలం చేకూరలేదు. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగడంతో.. తాము అన్నదే నిజమైందని, ఇది పూర్తిగా హడావుడిగా నిర్మించే క్రమంలో నాణ్యత లోపించి కమీషన్ల బ్యారేజీగా మారిపోయిందని కాంగ్రెస్ తన గళానికి మరింత పదును పెట్టింది. వైఎస్సార్ హయాంలో సర్వం సిద్దమైన ప్రాణహిత- చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం తుమ్మిడిహెట్టి అంశాన్ని బలంగా తెరమీదకు తెచ్చింది.
దీనిపై బీఆరెస్ వివరణనిచ్చే క్రమంలో.. నెపాన్ని మహా సర్కార్‌పై నెట్టింది. 148 మీటర్ల ఎత్తు సరిపోదని, 152 అయితే అక్కడ భారీగా ముంపు జరుగుతుందని, దీన్ని ఆ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని చెబుతూ వస్తోంది. వాస్తవానికి ఇక్కడ ఆ సమస్య ఉంది. అప్పుడు కూడా అక్కడ బీజేపీ సర్కారే ఉంది. సీఎంగా ధర్మేంద్ర ఫడ్నవీసే ఉన్నారు.
కానీ అప్పుడు ఆయన ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. దీనికి తోడు చాప్రాలా వణ్యప్రాణి అభయారణ్యానికి చెందిన అటవీ ప్రాంతం ఉంది. ఈ కారణంగా పర్యావరణ అనుమతులు లభించడం దాదాపుగా అసాధ్యమని కేసీఆర్‌కు తెలిసిపోయింది. అన్నింటికన్నా ముఖ్యంగా కేసీఆర్ .. తెలంగాణ తొలి సీఎంగా కీలకమైన సాగునీటి రంగంలో తనదైన ముద్రను వేసుకోవాలనుకున్నారు.
ప్రాణహిత- చేవెళ్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సీఎంగా రూపొందించబడిన భారీ ప్రాజెక్టు. ఉన్నదున్నట్టుగా కడితే తనకు పేరెలా వస్తుందని అనుకున్నారు కేసీఆర్. అందుకే తుమ్మిడిహెట్టి సాకుతో .. రీడిజైన్‌కు సిద్దమయ్యారు. బ్యారేజీ నిర్మాణ ప్లేస్‌ను మేడిగడ్డకు మార్చారు. అంచనాలూ మారిపోయాయి. రీ డిజైన్‌లో .. జిల్లాల సాగునీటి వనరుల రూట్ మ్యాప్ కూడా చేంజ్ అయిపోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఈ ప్రాజెక్టులోంచి తొలగించేశారు. తుమ్మిడిహట్టి ప్లేస్ మార్చినందుకు ఆదిలాబాద్‌కు రావాల్సిన 2లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు .. ఆ మ్యాప్‌లోంచి తొలిగిపోయింది.
తను అనుకున్నది అనుకున్నట్టే అని చేసినా.. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగడం, ప్రభుత్వం పతనం కావడం, కాంగ్రెస్ సర్కార్ రావడంతో.. కాళేశ్వరం పడావుగా మారింది. తుమ్మడిహట్టి ఇప్పుడు ఇలా రేవంత్ దౌత్యంతో మళ్లీ జీవం పోసుకుంటున్నది. తాజాగా మహారాష్ట్ర సీఎంతో రేవంత్ జరిపిన చర్చలు సఫలీకృతం దిశగా అడుగులు పడుతున్నాయి.
ఫడ్నవీస్ సానుకూలంగా స్పందిస్తూనే.. 152 మీటర్ల ఎత్తు సాధ్యాసాధ్యాలపై కమిటీ వేసి నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఉంటే తనకు ఓకేనని చెప్పేశారు ఫడ్నవీస్. ఇక్కడే రేవంత్ దౌత్యం ఫలించిందని చెప్పాలి. కేవలం దీన్ని ఓ రాజకీయ అంశంగానే కాదు.. ఇరు రాష్ట్రాల మానవ సబంధాల అంశాన్ని, గిరిజన, ఆదివాసీల జీవితాలకు ముడిపడిన సాగునీటి అవసరాలని, జాతీయ స్థాయిలో రక్షణ కేంద్రంగా, విమానాయన కేంద్రంగా అక్కడి ప్రాంత అవసరాన్ని విడమర్చి చెప్పడంలో రేవంత్ సక్సెసయ్యారనే చెప్పాలి.
రెండు రాష్ట్రాల ప్రజలకు ఈ బ్యారేజీ వారధిగా ఉంటుందనే సెంటిమెంట్‌ను కూడా సీఎం ఈ చర్చల సందర్భంగా ప్రయోగించారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టే స్థలం.. చాప్రాలా వన్యప్రాణి అభయారణ్యానికి దగ్గర ఉండటంతో దీన్ని రీ డిజైన్ చేసి మరీ మహా సర్కార్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అన్ని రకాల ఎఫెర్ట్స్‌ను పెట్టిన రేవంత్.. కేసీఆర్ చేతకాదని వదిలేసిన ప్రాజెక్టును తాను ఓకే అనేలా చేశానని చెప్పడమే ఇక్కడ అతని నైతిక విజయంగా చూడాలి. ఆదిలాబాద్ వాసులకు ఇది.. కరువు వేళ కమ్మని శుభవార్త అని చెప్పాలి.