E-Paper
Advertisement

విజయ్ శకం ప్రారంభం.. జెన్ జీ పెట్టుకున్న ఆశలని నెరవేరుస్తాడా?

విజయ్ శకం ప్రారంభం.. జెన్ జీ పెట్టుకున్న ఆశలని నెరవేరుస్తాడా?
Advertisement

CM Vijay: మొత్తానికి తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరింది. జోసెఫ్ విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇది.. తమిళనాడు రాజకీయాల్లోనే చరిత్రాత్మకమైన మలుపు అనే చెప్పాలి. ఆరు దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం వెనుక ఉన్న రియల్ పవర్ జెన్ జీ ఓటర్లే. తమిళనాట పుట్టిన విజయ్ వేవ్ వెనుక ఉన్నది.. యూత్ పవరే అనే చర్చ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు పాత తరం సిద్ధాంతాలు, వారసత్వం చుట్టూ తిరుగుతున్నాయ్. జెన్ జీ ఓటర్లకు ఈ సంప్రదాయ పాలిటిక్స్‌పై విరక్తి కలిగింది. అందుకే.. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీని ఆల్టర్నేట్‌గానే కాదు, తమ గొంతుకగా భావించారు. అందుకే.. రీల్ నుంచి ఆయన్ని రియల్ హీరోగా మార్చేశారు.

జెన్ జీకి సీఎం విజయ్ కనెక్ట్

Advertisement

జెన్ జీని ఆకట్టుకునేలా.. సెక్యులర్ సోషల్ జస్టిస్ శకం మొదలైందన్నారు సీఎం విజయ్. పెరియార్, కామరాజర్, అంబేద్కర్, వేలు నాచియార్ లాంటి మహనీయుల ఆశయాలే తన మార్గమని చెప్పారు. తమిళనాడులో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందని, లౌకిక, సామాజిక, న్యాయశకం మొదలైందని తన ప్రసంగంలో చెప్పారు. తాను అందరివాడినని, ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తనని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందిపెట్టారన్నారు. ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం తనకుందని చెప్పారు. తనది కూడా సాదా సీదా జీవితమేనని.. ప్రజల ఆకాంక్షలు తనకు తెలుసన్నారు.

సెక్యులర్ సోషల్ జస్టిస్ శకం డైలాగ్..

తమిళనాడు ప్రజలను, తనకు మద్దతుగా నిలిచిన యువతరాన్ని ఆకట్టుకునేలా విజయ్ ప్రసంగం కొనసాగింది. ప్రభుత్వ సొమ్ము ఒక్క పైసా కూడా తిననని చెప్పారు సీఎం విజయ్. తాను తప్పు చేయనని, తన చుట్టూ ఉన్నవాళ్లని కూడా చేయనివ్వనని అన్నారు. గెలిచాం కదా.. ఓ ఆట ఆడేద్దామనే ఆలోచనలుంటే.. ఇప్పుడే తీసేయండని చెప్పారు. మిత్రులైనా, శత్రువులైనా తమ ప్రభుత్వంలో అందరికీ ఒకే చట్టం అన్నారు. విద్యార్థుల కోసం విజయ్ మామ అన్నీ మంచి పనులే చేస్తాడంటూ పవర్‌ఫుల్ డైలాగులు వినిపించారు. టీవీకేలో ఒకే ఒక్క పవర్ సెంటర్ ఉందని.. అది విజయ్ మాత్రమేనని క్లియర్ చేసేశారు.

విద్యార్థులు, విజయ్ మామ + పవర్ సెంటర్ డైలాగ్..

Advertisement

విజయ్ టీవీకే పార్టీ ఓటర్ల దాకా చేరేందుకు, యువ తరాన్ని ఆకట్టుకునేందుకు సోషల్ మీడియాని గట్టిగా వాడేసింది. నేరుగా వారి మొబైల్ ఫోన్లలోకి దూసుకెళ్లింది. విజయ్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ.. యువతకు అవసరమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేలా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు. పాలనలో ఏఐని ప్రవేశపెడతామని, తమిళనాడుని.. ఒకటిన్నర ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పడం టెక్-సావీ యువతని అట్రాక్ట్ చేసింది. వీటన్నింటిని మించి.. మిగతా రాజకీయా నేతల్లా కాకుండా.. విజయ్ చాలా తక్కువగా మీడియా ముందుకు వచ్చారు. కానీ, బహిరంగ సభల్లో ఆయన చూపించిన అగ్రెసివ్ ఆటిట్యూడ్.. ఓ స్టైలిష్ ఐకాన్‌గా కనిపించింది. అతనికి ఉన్న క్లీన్ ఇమేజ్ కూడా యూత్‌ని అట్రాక్ట్ చేసింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు విజయ్ ధరించిన దుస్తులు కూడా యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయ్. మొత్తంగా.. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది.

ఫ్రీ కరెంట్‌తో భారీ షాక్!

ఎన్నికల్లో టీవీకే పార్టీ ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ కీలక ఫైళ్లపై సంతకం చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే.. ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అదేవిధంగా మహిళల రక్షణకు స్పెషల్ ఫోర్స్ ఫైల్‌పైనా సంతకం చేశారు. ఇక.. తమిళనాడులో డ్రగ్స్ బెడదను అరికడతానన్న తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు. మొత్తంగా.. పారదర్శకమైన పాలనని అందిస్తానని విజయ్ హామీ ఇచ్చారు. ప్రజల మద్దతుతో టీవీకే పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. విద్య, ఫుడ్ సప్లై, హెల్త్ కేర్, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి స్పష్టం చేశారు. మొత్తానికి.. యువత కోరుకున్న మార్పు తమిళనాడులో వచ్చింది. సీఎంగా విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఎలాంటి పరిపాలన అందిస్తారన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

అసలైన పరీక్ష ఇప్పుడే!

తమిళనాడు రాజకీయాల్లో.. విజయ్ శకం మొదలైంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన దళపతి.. ఇప్పుడు రాజకీయ తెరపై అధిపతిగా వెలుగుతారా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై తన మేనరిజమ్స్‌తో, డ్యాన్స్‌లతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ఒక విజయమైతే, ఆ విజయాన్ని సుస్థిరం చేసుకుంటూ పరిపాలన సాగించడం మరో ఎత్తు. సినిమా స్క్రిప్ట్‌కు, అసెంబ్లీలో ఫైళ్లపై సంతకాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ముందున్న సవాళ్లను విజయ్ ఎలా అధిగమిస్తారనేది ఆసక్తిగా మారింది.

విజయ్ ముందున్న బిగ్ ఛాలెంజ్

సినిమాల్లో హీరో.. ఒకే ఒక్క డైలాగ్‌తో వ్యవస్థను మార్చేయొచ్చు. కానీ, రాజకీయం అలా కాదు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ప్రతి మాట ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని నడపించడం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తన విజన్‌ను అనుగుణంగా నడిపించుకోవడం విజయ్‌కి మొదటి సవాల్. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న డీఎంకే, ఏడీఎంకే లాంటి పార్టీలు విజయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది. ఈ దిగ్గజాలను ఎదుర్కొనేందుకు కేవలం ఛరిష్మా సరిపోదు. రాజకీయ చాణక్యం కావాలి. పైగా.. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఉచితాల చుట్టూనే తిరుగుతుంటాయ్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే.. ఇప్పుడు విజయ్ ముందున్న బిగ్ టాస్క్. ఇప్పటికే ఉన్న అప్పుల భారాన్ని తగ్గిస్తూనే, కొత్త పథకాలను ఎలా ఎమలు చేస్తారనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంటుంది.

సీఎం విజయ్ స్ట్రాంగ్ మెసేజ్

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి ప్రసంగంలోనే.. ప్రభుత్వ స్థిరత్వంపై నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు విజయ్ ప్రయత్నించారు. మల్టిఫుల్ పవర్ సెంటర్స్ ఉండవని, టీవీకే పరిపాలనలో తానే ఏకైక పవర్ సెంటర్‌గా ఉంటానని స్పష్టం చేశారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో.. ప్రభుత్వానికి కేవలం 120 మంది ఎమ్మెల్యేల అతి స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది. చిన్న పార్టీల మద్దతుతోనే.. టీవీకే అధికారంలోకి వచ్చింది. దాంతో.. విజయ్ ప్రకటనకు ప్రాముఖ్యత చేకూరింది. ఇదే సమయంలో.. విజయ్ చేసిన మరో కీలక ప్రకటన.. అందరి దృష్టిని ఆకర్షించింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన డీఎంకేని ఉద్దేశించి.. గత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

డీఎంకే ప్రభుత్వం.. మాపై 10 లక్షల కోట్ల అప్పుని మిగిల్చిందన్నారు. తనపై ఎంత భఆరాన్ని మోపిందో అందరికీ చెబుతానన్నారు. డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని, హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని.. అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. 8 కోట్ల మంది తన వెంట ఉంటే.. ఎంతటి అసాధ్యాలనైనా సాధించే విశ్వాసం తనకుందన్నారు. తమిళనాడు అభివృద్ధి ప్రయాణంలో విమర్శకులని సైతం కలుపుకొని వెళ్తానని హామీ ఇస్తూ.. సయోధ్య ధోరణిని ప్రదర్శించారు.

జెన్ జీ కోసం సీఎం విజయ్ స్పెషల్ ప్లాన్?

విజయ్ తన పార్టీ విలువల గురించి మాట్లాడుతూ అవినీతి రహిత పాలన, సమసమాజం అని నొక్కి చెప్పారు. అయితే, క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టడం అంత సులభం కాదు. ఇందుకోసం ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదే కీలకం. తన బలం యువత అని తెలిసిన విజయ్, నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షిస్తారనే దానిమీదే ఇది ఆధారపడి ఉంటుంది. ఇక, ద్రవిడ సిద్ధాంత పార్టీలకు అధికారం దక్కినంత మాత్రాన.. తమిళనాడు ద్రవిడ సిద్ధాంతానికి పూర్తిగా కాలం చెల్లినట్లు కాదు. అక్కడి పాలిటిక్స్‌లో ద్రవిడ సెంటిమెంట్ బలంగానే ఉంటుంది.

అందువల్ల.. కేంద్ర ప్రభుత్వంతో సీఎం విజయ్ ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనేది కూడా ఇప్పుడు కీలమవుతుంది. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే, నిధుల సాధనలో రాజీపడకుండా వ్యవహరించడం కత్తిమీద సామే అంటున్నారు. ఇక నుంచి సీఎంగా ఆయన తీసుకునే నిర్ణయాలు.. తమిళ ప్రజల్లో ఆయన ఇమేజ్‌ని డిసైడ్ చేస్తాయ్. విజయ్ తన మద్దతుదారుల గురించి మాట్లాడుతూ.. ఓ మాట అన్నారు. తనకు సపోర్ట్ చేసిన వాళ్లలో చాలా మంది.. జెన్ జీ, మిలీనియల్స్ ఉన్నారని, వారి కోసం అన్నీ చేస్తానని నొక్కి చెప్పారు. కార్యకర్తలు లేకపోతే.. తాను లేనని కూడా అన్నారు. టీవీకే కోసం పనిచేసిన, మద్దతు తెలిపిన వర్చువల్ యోధులందరికీ థ్యాంక్స్ చెప్పారు.

సీఎం విజయ్‌కు భారీ ఛాలెంజ్

విజయ్ గెలుపు ఇప్పుడొక ఉప్పెనలా కనిపిస్తోంది. కానీ, ఆ ఉప్పెన సృష్టించిన ఆశలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయ్. ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లు సినీ గ్లామర్ నుంచి బయటకొచ్చి.. అద్భుతమైన పరిపాలనా దక్షతతో.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సినిమా సక్సెస్ అవ్వాలంటే.. హిట్ టాక్ వస్తే సరిపోతుంది. కానీ రాజకీయాల్లో హిట్ అవ్వాలంటే.. ప్రజల కన్నీళ్లు తుడవాలి. సీఎం విజయ్ ఇప్పుడు.. రియల్ లైఫ్ యాక్షన్ డ్రామాలో ఉన్నారు. ఇక్కడ.. రీటేక్‌లు ఉండవు. సెన్సేషనల్ డెసిషన్లు మాత్రమే ఉంటాయ్. ఈ రియల్ పవర్ గేమ్‌లో.. సీఎంగా విజయ్ గేమ్ ఎలా ఉంటుందన్నది త్వరలోనే తేలిపోతుంది. ఎంజీఆర్, జయలలిత బాటలోనే విజయ్ నడుస్తారా? లేక వన్ టర్మ్ సీఎంగానే మిగిలిపోతారా? అనేది ఆయన పాలనపైనే ఆధారపడి ఉంటుంది.

Also Read:10 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త

Story  by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×