US – Venezuela War: అగ్రరాజ్యం అమెరికా చేసిన మెరుపుదాడులతో.. వెనెజుయెలా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రెండంటే.. రెండు గంటల్లోనే అమెరికా సైన్యం తమ ఆపరేషన్ పూర్తి చేసింది. అంతేకాదు.. వెనెజుయెలా అధ్యక్షుడిని, ఆయన భార్యని కూడా కస్టడీలోకి తీసుకున్నట్లు.. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా తల్చుకుంటే.. ఏ దేశమైనా ఇంతేనా? అగ్రరాజ్యం జోక్యం చేసుకుంటే.. నాశనమవక తప్పదా?
ఎయిర్ స్టైక్స్‌తో విరుచుకుపడ్డ అమెరికా ఆర్మీ
తెల్లవారుజామునే వెళ్లిపోయారు.. టార్గెట్ మిస్ అవకుండా దాడులు చేశారు. ప్రెసిడెంట్ ప్యాలెస్‌ని కూడా తమ ఆధీనంలోకి తీసుకొని.. అధ్యక్ష దంపతులను అదుపులోకి తీసుకొని.. దేశం దాటించేశారు. ఇదంతా.. కేవలం రెండంటే.. రెండు గంటల్లోనే పూర్తయిపోయింది. అమెరికా అనుకుంటే.. ఏ దేశాన్నైనా కొట్టేయగలదా? వెనెజుయెలాపై ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత ఈ ప్రపంచంలోని చాలా మందిలో తలెత్తుతున్న సందేహం ఇది! ఎందుకంటే.. యూఎస్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ తాలూకూ ఇంపాక్ట్ అలాంటిది మరి!
డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి పేరిట యూఎస్ దాడులు
అమెరికా ఎయిర్‌స్ట్రైక్స్‌తో.. వెనెజుయెలా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి పేరిట.. యూఎస్ చేసిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయ్. వెనెజుయెలా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుజామున.. ఏడు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దాంతో.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనెజుయెలా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా మెరుపు దాడులతో.. తమ సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే సాకుతో అమెరికా వెనెజుయెలాలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్ నెట్‌వర్క్‌కి సంబంధించి రెండు దేశాల మధ్య కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చాలా రోజులుగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అన్నంత పని చేసినట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి.. క్రిస్మస్ రోజునే దాడులు చేయాలని భావించినా.. వాతావరణం అనుకూలించకపోవడంతో దాడులు వాయిదా పడినట్టు తెలుస్తోంది.
అమెరికా అదుపులో నికోలస్ మదురో, ఆయన సతీమణి
వెనెజుయెలాపై అమెరికా జరిపిన భారీ దాడిలో.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యని కూడా అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాడి తర్వాత.. అమెరికా ఆర్మీకి చెందిన డెల్టా ఫోర్స్.. వెనెజుయెలా ప్రెసిడెంట్ దంపతులను కస్టడీలోకి తీసుకొని.. దేశం బయటకు తరలించింది. అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సమన్వయంతో ఇదంతా జరిగిందని.. పూర్తి వివరాలు త్వరలో చెబుతామని ట్రంప్ ప్రకటించారు. అయితే.. మదురోను ఎలా అదుపులోకి తీసుకున్నారు? ఎక్కడికి తరలించారన్న దానిపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు.
సైనిక చర్య పూర్తయిందన్న యూఎస్ సెనేటర్ మైక్ లీ
తమ ప్రెసిడెంట్‌ని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై.. వెనెజుయెలా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ స్పందించారు. మదురో, ఆయన సతీమణి ఎక్కడున్నారో తమకు తెలియదన్నారు. వారు సజీవంగానే ఉన్నారని తెలిపేలా.. ఆధారాలివ్వాలని అమెరికాను డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ నికోలస్ మదురో అమెరికా కస్టడీకి చిక్కడంతో వెనెజుయెలాలో తమ సైనిక చర్య పూర్తయిందని యూఎస్ సెనేటర్ మైక్ లీ తెలిపారు.
డ్రగ్స్ ముఠాలతో నికోలస్ సంబంధాలున్నాయన్న ట్రంప్
అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్.. చాలా రోజులుగా వెనెజుయెలా ముఠాల నుంచి వస్తున్న డ్రగ్స్ అమెరికాని ముంచెత్తుతున్నాయని చెబుతున్నారు. ఈ ముఠాలతో వెనెజుయెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని, ఆయనే.. ఇంటర్నేషనల్ ఇల్లీగల్ డ్రగ్ నెట్‌వర్క్‌ని నడిపిస్తున్నారని అమెరికా కూడా కొంతకాలంగా ఆరోపిస్తోంది. దాంతో.. నికోలస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందనే వార్తలు, విశ్లేషణలు వినిపించాయి. ఈ ఆరోపణలను మదురో ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అయినప్పటికీ.. నికోలస్ అరెస్ట్‌కు దారితీసే సమాచారాన్ని అందించిన వారికి.. 5 కోట్ల డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా గతంలోనే ప్రకటించింది. ఎయిర్‌స్ట్రైక్స్ జరపడానికి ముందే.. కొన్ని నెలలుగా వెనెజుయెలా సరిహద్దులకు దగ్గరగా.. అగ్రరాజ్యం భారీ స్థాయిలో సైనిక బలగాలను మోహరించింది. కరేబియన్ సముద్రంలో భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు, అడ్వాన్స్‌డ్ ఫైటర్‌జెట్‌లను మోహరించింది యూఎస్ ఆర్మీ. ఈ పరిణామాలన్నీ వెనిజుయెలా లోపలే ఎవరో మదురోకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు.. అమెరికా పరోక్షంగా ప్రోత్సహిస్తున్న సంకేతాలుగా విశ్లేషకులు భావించారు.
1989 తర్వాత లాటిన్ అమెరికా దేశంలో అమెరికా జోక్యం
1989 తర్వాత ఓ లాటిన్ అమెరికన్ దేశంలో.. అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ సమయంలో.. పనామాపై దాడిచేసి, మిలిటరీ నేత మాన్యుయెల్ నోరిగాను పదవీచ్యుతుడిని చేసింది అప్పటి అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు.. మళ్లీ వెనెజుయెలాపై భీకర దాడులు చేయడంతో.. పక్కదేశమైన కొలంబియా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది.
అమెరికా సైనిక జోక్యంతో అఫ్ఘానిస్థాన్ ఇరాక్ నాశనం
వాస్తవానికి.. అమెరికా దశాబ్దాలుగా అనేక దేశాల్లో అంతర్గత జోక్యం, సైనిక జోక్యం చేసుకుంటోంది. ఫలితంగా ఆ దేశాలు నాశనమైపోయిన దాఖలాలున్నాయ్. ఇందుకు.. అఫ్ఘానిస్థాన్, ఇరాక్ లాంటి దేశాలే బెస్ట్ ఎగ్జాంపుల్. 9/11 దాడుల తర్వాత అల్-ఖైదాను అంతం చేసేందుకు.. అమెరికా అప్ఘానిస్థాన్‌లోకి దిగింది. 20 ఏళ్ల యుద్ధం తర్వాత.. అగ్రరాజ్యం వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశం ఆర్థికంగా చితికిపోయింది. రెండు దశాబ్దాల తర్వాత.. మళ్లీ తాలిబన్ల పాలనలోకి వెళ్లింది. సద్దాం హుస్సేన్ దగ్గర మారణాయుధాలున్నాయనే ఆరోపణతో.. ఇరాక్‌పై దాడికి దిగింది అమెరికా. సద్దాం పాలన అంతమైనప్పటికీ.. ఆ దేశంలో ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు పెరగడానికి, అంతర్గత యుద్ధాలకు దారితీసింది. అమెరికా ఆరోపించినట్లుగా.. మారణాయుధాలు మాత్రం దొరకలేదు. లిబియాలో.. గడాఫీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమానికి మద్దతుగా.. నాటోతో కలిసి దాడి చేసింది అమెరికా. గడాఫీ పతనం తర్వాత.. లిబియాలో ఇప్పటికీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడలేదు.
అధ్యక్ష దంపతులను కస్టడీలోకి తీసుకోవడమేంటి?
ఆ దేశం ఇప్పటికీ.. అనేక ముఠాల మధ్య చిక్కుకుంది. ఐసిస్ అణిచివేత పేరుతో.. సిరియా అంతర్గత యుద్ధంలో యూఎస్ జోక్యం చేసుకుంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల.. ఆ దేశం శిథిలమైపోయింది. కోట్లాది మంది శరణార్థులుగా మారారు. అంతేకాదు.. 1983లో గ్రెనడా దేశంపైనా నేరుగా దాడి చేసింది. చిలీ, గ్వాటెమాల, నికరాగువా లాంటి దేశాల్లో ప్రభుత్వాలను మార్చేందుకు రహస్యంగా ప్రయత్నించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా వెనెజుయెలాపై మెరుపు దాడులే బిగ్ సర్‌ప్రైజ్ అనుకుంటే.. ఆ దేశ అధ్యక్ష దంపతులను కూడా కస్టడీలోకి తీసుకోవడమేంటి? వారిని.. దేశం దాటించడమేంటి? ఒక్క.. అమెరికాకు మాత్రమే సాధ్యమయ్యే ఫీట్ ఇది.. అనే చర్చ ఇప్పుడు గ్లోబ్ వైడ్ వినిపిస్తోంది.
అసలు.. వెనెజుయెలా భవిష్యత్ ఏంటి?
వెళ్లారు.. కొట్టారు.. వెనెజుయెలా ప్రెసిడెంట్‌ని, అతని భార్యతో సహా అదుపులోకి తీసుకొని దేశం దాటించేశారు. అసలు.. వెనెజుయెలాపై ఇంత భీకరమైన దాడులు దేనికోసం? డ్రగ్స్ సప్లై కట్టడి అనేది కేవలం ఓ ముసుగేనా? ఆ దేశంలోని ఆయిల్ నిల్వల కోసమే.. అమెరికా ఇదంతా చేస్తోందా? తమకు అనుకూలమైన ప్రభుత్వం వస్తే.. యూఎస్‌కి కలిగే లాభమేంటి? అసలు.. వెనెజుయెలా భవిష్యత్ ఏంటి?
శనివారం తెల్లవారుజామున ఆపరేషన్ సదరన్ స్పియర్
వెనెజుయెలాపై అమెరికా జరిపిన సైనిక చర్య.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు.. శనివారం తెల్లవారుజామున ఆపరేషన్ సదరన్ స్పియర్ మొదలైంది. ఇది.. కేవలం ఒక్కరోజులో జరిగింది కాదు. కొన్ని నెలలుగా వెనెజుయెలా చుట్టూ అమెరికా తన నౌకాదళం, వైమానిక దళాన్ని మోహరిస్తూ వచ్చింది. వెనెజుయెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని పట్టుకోవడమే లక్ష్యంగా.. ఈ ఆపరేషన్ నిర్వహించింది యూఎస్ ఆర్మీ. అమెరికా సైన్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన డెల్టా ఫోర్స్ కమాండోలు.. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో పాల్గొని, మదురోతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకొని.. దేశం దాటించేశారు. ఆపరేషన్ సదరన్ స్పియర్‌లో.. యూఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కొన్ని నెలల ముందు నుంచే.. కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలను మోహరించింది. వెనెజుయెలాకు వచ్చే చమురు ట్యాంకర్లను అడ్డుకుంది.
అనుకూల ప్రభుత్వం ఉంటే నిరంతరాయంగా ఆయిల్ సరఫరా
శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో.. అమెరికా స్పెషల్ ఫోర్సెస్.. రాజధాని కారకాస్‌లోకి ప్రవేశించి నికోలస్ నివాసాన్ని చుట్టుముట్టాయ్. కొందరు వెనెజుయెలా సైనిక అధికారులు.. అమెరికాకు సహకరించినట్లు వార్తలు వస్తున్నాయ్. ఇదే సమయంలో.. కారకాస్‌లోని సైనిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌లే లక్ష్యంగా అమెరికా బలగాలు ఎయిర్‌స్ట్రైక్స్ చేశాయ్. వెనెజుయెలా సైన్యం ఒకరికొకరు సమాచారం పంచుకోకుండా.. సిగ్నల్ యాంటెన్నాలను, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేశారు. అమెరికా గన్ షిప్ హెలికాప్టర్లు నగరంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై రాకెట్లతో దాడులు చేశాయి. ఇలా.. వెనిజుయెలా ప్రెసిడెంట్‌ని క్యాప్చర్ చేయడంలో అమెరికా సేనలు సక్సెస్ అయ్యాయి.
చమురు కోసమే అమెరికా దాడులకు సిద్ధమైందన్న వెనెజుయెలా
వెనెజుయెలా పరిణామాలు.. ఓ దేశ రాజకీయ సంక్షోభం మాత్రమే కాదు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల చదరంగంలో కీలక ఘట్టమనే చెప్పాలి. అమెరికా జోక్యం, డ్రగ్స్ ఆరోపణలు, ఆయిల్ నిల్వల చుట్టూ తిరుగుతున్న ఈ పరిణామాల వెనుక అనేక లోతైన కారణాలున్నాయ్. వెనెజుయెలా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం. సౌదీ అరేబియా కంటే కూడా.. ఇక్కడ ఎక్కువ ఆయిల్ ఉంది. అమెరికాకు ఇంధన భద్రత చాలా ముఖ్యం. వెనెజుయెలాలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే.. తక్కువ ధరకు, నిరంతరాయంగా ఆయిల్ సరఫరా అందుతుంది. అయితే.. ప్రస్తుతం వెనెజుయెలా ఆయిల్.. రష్యా, చైనా కంపెనీల కంట్రోల్‌లో ఉంది. దీనిని మార్చి.. ఆ దేశంలో అమెరికన్ కంపెనీలకు ఆధిపత్యం కల్పించడమే అమెరికా వ్యూహం. దాంతో.. ముందుగా వెనెజుయెలాలో నికోలస్ ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నించిందనే చర్చ జరిగింది. అందులో భాగంగానే.. అమెరికా ప్రభుత్వం మదురోపై నార్కో టెర్రరిజం ఆరోపణలు చేసింది. కొలంబియా నుంచి అమెరికాకు వెళ్లే కొకైన్ రవాణాలో.. వెనెజుయెలా కీలక పాత్ర పోషిస్తోందని, మదురో ప్రభుత్వం దీని ద్వారా కోట్లాది డాలర్లు సంపాదిస్తోందని అమెరికా అంటోంది. వెనెజుయెలా ప్రభుత్వం కూడా తమ చమురు కోసమే అమెరికా దాడులకు సిద్ధమవుతోందని ఆరోపించింది.
డ్రగ్స్ కోసమే ఇంత భారీ స్థాయిలో సైనిక చర్యకు పాల్పడిందా?
డ్రగ్స్ కంట్రోల్ అనేది అంతర్జాతీయంగా ఏ దేశంపై అయినా దాడి చేయడానికి, ఆంక్షలు విధించడానికి బలమైన నైతిక కారణాన్ని ఇస్తుంది. అయితే, కేవలం డ్రగ్స్ కోసమే ఇంత భారీ స్థాయిలో సైనిక చర్యకు పాల్పడటమే ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అందువల్ల.. ఇదొక ముసుగు మాత్రమేననే వాదనకు బలం చేకూరుస్తోంది. వెనెజుయెలాలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే.. అమెరికాకు అనేక లాభాలున్నాయ్. వెనెజుయెలా చమురు బావుల పునర్నిర్మాణం, వెలికితీత కాంట్రాక్టులు అమెరికన్ కంపెనీలకు దక్కుతాయి. లాటిన్ అమెరికాలో రష్యా, చైనా ప్రభావాన్ని తగ్గించడం అమెరికాకు చాలా ముఖ్యం. వెనిజులాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వల్ల లక్షలాది మంది ప్రజలు అమెరికాకు వలస వెళ్తున్నారు. అక్కడ స్థిరమైన ప్రభుత్వం వస్తే వలసల సమస్య తగ్గుతుందనే చర్చ జరుగుతోంది. అమెరికా మెరుపుదాడితో.. వెనెజుయెలాకు ఎటూ పాలుపోవడం లేదు. ప్రెసిడెంట్ దంపతులనే యూఎస్ ఆర్మీ క్యాప్చర్ చేయడంతో.. దాని భవిష్యత్ ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
సైన్యం మద్ధతు ఉపసంహరించుకుంటే పడిపోనున్న ప్రభుత్వం
ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వెనెజుయెలాలా అంతర్గత తిరుగుబాటు మొదలై.. సైన్యం గనక మదురోకు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం వెంటనే పడిపోతుంది. మరోవైపు.. అమెరికా ఆర్థిక ఆంక్షలతో.. వెనెజుయెలా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది అంతుబట్టడం లేదు. మళ్లీ ఎన్నికలు జరిగి, అంతర్జాతీయ సమాజం గుర్తించే నాయకుడు అధికారంలోకి వస్తేనే.. ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వెనెజుయెలా సంక్షోభం ప్రజాస్వామ్యం, డ్రగ్స్, మానవ హక్కుల పోరాటంలా కనిపిస్తున్నప్పటికీ.. దాని మూలాలు మాత్రం ఆయిల్, గ్లోబల్ పవర్ చుట్టూనే తిరుగుతున్నాయి.